ఉత్కళ రాజ్యం (ఒరియా-ଉତ୍କଳ;దేవనాగరి-उत्कळ) ప్రాచీన భారతదేశంలోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం ప్రస్తుతం ఒడిషా రాష్ట్రం యొక్క ఉత్తర, తూర్పు భాగాలలో ఉంది. దీని గురించి మహాభారతంలో ఉత్కళ, ఉత్పళ మొదలైన పేర్లతో ప్రస్తావించబడింది. ఉత్కళ రాజపుత్రులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు పోరాటంలో పాల్గొన్నారు. భారత జాతీయ గీతములో "జన గణ మన... ద్రావిడ ఉత్కళ వంగ" అని ఈ ప్రాంతం చేర్చబడింది.

ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఉత్కళ అంటే ఉత్కృష్టమైన కళలు కలిగిన దేశం అని అభివర్ణించారు.

పురాణాల్లో మార్చు

మహాభారతంలో ద్రోణపర్వం, నాల్గవ అధ్యాయం, ఎనిమిదవ శ్లోకంలో ఉత్కళ రాజ్యాన్ని కర్ణుడు జయించినట్లుగా ప్రస్తావన ఉంది.[1] కురుక్షేత్ర సంగ్రామంలో ఉత్కళ రాజ్యం కౌరవుల పక్షాన నిలిచి పాండవ వీరుడైన నకులుడి సైన్యంతో పోరాడింది. ఈ రాజ్యాన్నే ఉత్పల, ఒక్కల్, ఒక్కలి అనే పేర్లతో కూడా ప్రస్తావించారు.[2]

భాగవత పురాణంలో తూర్పు భారతదేశంలో ఉత్కళ, కళింగ అనే రాజవంశాలుండేవనీ వాటి ఆధారంగానే రెండు రాజ్యాలు ఏర్పడ్డాయని ఉంది. ప్రద్యుమ్నుడికి ముగ్గురు కొడుకులు; హరితస్వుడు లేదా బినితస్వుడు, గయుడు, ఉత్కళుడు. వీరు ముగ్గురికీ వారి వారి పేరు మీదుగా రాజ్యాలు సంక్రమించినాయి. ఇదే పురాణంలో వాలి కి అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఓడ్ర అనే ఆరుగురు కుమారులున్నారనీ వారి పేరు మీదుగా రాజ్యాలు ఏర్పడ్డాయని ఉంది.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. www.wisdomlib.org (2015-08-01). "Utkala, Utkalā: 7 definitions". www.wisdomlib.org. Retrieved 2019-08-29.
  2. "Kingdoms of South Asia - Kalinga / Orissa". www.historyfiles.co.uk. Retrieved 2019-08-29.
  3. Acharya, Paramananda (1955). "ANCIENT ROUTES IN ORISSA". Proceedings of the Indian History Congress. 18: 44–51. ISSN 2249-1937.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్కళ&oldid=3056167" నుండి వెలికితీశారు