ఇదే పేరుతో 1984లో మరొక సినిమా కోసం కథా నాయకుడు చూడండి

కథానాయకుడు (1969)
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
రచన ముళ్ళపూడి వెంకటరమణ, భమిడిపాటి రాధాకృష్ణ
తారాగణం నందమూరి తారక రామారావు,
చలపతిరావు,
జయలలిత,
నాగభూషణం,
పద్మనాభం,
మిక్కిలినేని
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ గోపాలకృష్ణ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథానాయకుడు కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, చలపతిరావు, జయలలిత, నాగభూషణం ప్రధానపాత్రల్లో నటించిన 1969 నాటి తెలుగు చలనచిత్రం. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన స్వామిద్రోహి కథ అనే చిన్నకథ ఆధారంగా ఈ చిత్రకథను అభివృద్ధి చేశారు.

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

ముళ్ళపూడి వెంకటరమణ రాసిన రాజకీయాలపై రాసిన వ్యంగ్య కథల మాలిక రాజకీయ బేతాళ పంచవింశతిక. అందులోని ఒకానొక చిన్న కథ-స్వామి ద్రోహి కథ. కథానాయకుడు సినిమా ఆ కథను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు. ముళ్ళపూడి వెంకటరమణ ఆ కథను ఆధారంగా చేసుకుని 150 పేజీల్లో సీన్ల విభజనతో సహా ట్రీట్మెంట్ రాశారు. అయితే రమణ అప్పటికే రచయితగా, నిర్మాతగా బిజీ అయిపోవడంతో సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ రాశారు.[1]

కథ మార్చు

ఒక పట్టణంలో ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్‌షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరాల), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు. దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (ధూళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (యన్‌టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్‌రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్‌గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[2]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా1969 వ సంవత్సరానికి గాను ఎంపిక చేసి ప్రధమ బహుమతిగాb బంగారు నంది అవార్డు ప్రకటించింది.

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: ముళ్ళపూడి వెంకటరమణ
  • మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • సంగీతం: టివి రాజు
  • కళ: బిఎస్ కృష్ణ
  • నృత్యం: తంగప్ప
  • స్టంట్స్: శ్యామ్‌సుందర్
  • కెమెరా: విఎస్‌ఆర్ స్వామి
  • నిర్మాత: కె గోపాలకృష్ణ
  • దర్శకత్వం: హేమాంబరధరరావు

తారాగణం మార్చు

  • ఎన్.టి.రామారావు - సారథి
  • నాగభూషణం - దయానందం
  • మిక్కిలినేని - కాంట్రాక్టర్ సత్యమూర్తి
  • అల్లు రామలింగయ్య - అప్పడు
  • ధూళిపాళ - శ్రీనివాసరావు
  • జయలలిత - జయ
  • ప్రభాకరరెడ్డి - నాగులు
  • ముక్కామల - సిబిఐ ఆఫీసర్
  • కాకరాల - తాతారావు
  • డాక్టర్ రమేష్ - ప్రభుత్వ వైద్యుడు
  • పద్మనాభం - సింహ
  • రమాప్రభ - రమ
  • రాధాకుమారి
  • రావి కొండలరావు
  • రాజ్‌బాబు
  • నాగయ్య - స్కూలు మాష్టారు చలపతి
  • చలపతిరావు - మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగి

రీమేక్స్ మార్చు

కథానాయకుడు సినిమా తమిళ, హిందీ భాషల్లో పునర్నిర్మితమై విజయవంతమైంది. 1969లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలన్న ఆలోచనతో ఉన్న ఎం.జి.రామచంద్రన్ ప్రజలు దాన్నెలా స్వీకరిస్తారోనన్న సందేహంతో ఉన్నారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డిని రాజకీయ సంబంధమైన చిత్రాన్ని నిర్మించమని కోరారు. దాంతో తెలుగులో విజయవంతమైన కథానాయకుడు సినిమాను సూచించగా దాన్ని అంగీకరించి తమిళంలో నమ్‌నాడు పేరిట ఎం.జి.రామచంద్రన్, జయలలిత, ఎస్.వి. రంగారావు ప్రధాన పాత్రల్లో బి.నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. నమ్‌నాడు చిత్ర విజయం, మరీ ముఖ్యంగా ఎంజిఆర్, నాగిరెడ్డి మేఖలా థియేటర్లో సినిమా చూసేప్పుడు దురై(ఎం.జి.రామచంద్రన్) మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాకా అలిమేలు(జయలలిత) విజయగీతం ఆలపించడాన్ని ప్రజలు ఆస్వాదించడం, ఆ పాట మళ్ళీ వేయాలని గొడవపెట్టి మరీ వేయించుకుని చూడడం వంటివి, రామచంద్రన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రజామోదం ఉన్నట్టు నమ్మకం కలిగించాయి. తర్వాత ఆయన తమిళనాడు శాసనసభకు అతిగొప్ప మెజారిటీతో ఎన్నికై సంచలనం సృష్టించారు. నమ్‌నాడుకు దర్శకత్వం వహించిన సి.పి.జంబులింగాన్నే దర్శకునిగా పెట్టుకుని ఇదే సినిమాను హిందీలో అప్నా దేశ్ పేరిట పునర్నిర్మించారు. అప్నా దేశ్ సినిమాలో రాజేశ్ ఖన్నా, జయలలిత, ఓంప్రకాష్ ప్రధాన పాత్రలు ధరించారు.[1][3]

పాటలు మార్చు

  1. ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా - ఘంటసాల బృందం . రచన: దాశరథి
  2. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి కోపం మాని తాపం - పి.సుశీల బృందం, రచన: దాశరథి
  3. ముత్యాల జల్లు కురిసె రతనాల మెరుపు మెరిసే వయసు మనసు - సుశీల , రచన: దాశరథి
  4. రావేలా దయలేదా బాలా ఇంటికి రారాదా రారాదా - పిఠాపురం, మాధవపెద్ది , రచన: కొసరాజు
  5. వయసు మళ్ళిన బుల్లోడా కొంటెచూపుల కుర్రోడా లవ్ లవ్ అంటే నవ్వుతా - సుశీల , రచన: కొసరాజు
  6. వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే - సుశీల, ఘంటసాల బృందం . రచన: కొసరాజు.
  7. పళ్ళండి పళ్ళండి పళ్ళు జామపళ్ళు, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: కొసరాజు.్లు

వనరులు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ముళ్ళపూడి, వెంకటరమణ (1 July 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  2. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (16 February 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 కథానాయకుడు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 17 February 2019.
  3. "స్మాల్ ట్రిబ్యూట్ టు ఎ బిగ్ లెజెండ్". ది హిందూ. 10 May 2014. Retrieved 29 July 2015.