కుంభకర్ణుడు

రామాయణంలో రావణుని సోదరుడు

కుంభకర్ణుడు (Kumbhakarna, సంస్కృతం:कुम्भकर्ण) రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలో సంభోగం వల్ల జన్మించిన సంతానం.

కుంభకర్ణుడు

కుంభకర్ణ జన్మవృత్తాంతం మార్చు

రావణాసురుని తమ్ముఁడు. ఈ రక్కసుఁడు మహాఘోరము అగు చేసి వరము అడుగబోవు వేళ దేవతల ప్రార్థనచే సరస్వతీదేవి వాని నాలుకయందు ప్రవేశించి 'నిద్ర కావలెను' అని పలికించెను. అది కారణముగ వాఁడు ఎల్లపుడు నిద్రపోవుచుండును., వానికి నిద్రాభంగము అగువేళ చావు సంభవించును అని నియతి కలిగి ఉన్నందున రాముఁడు లంకలో యుద్ధముచేయు నవసరమున రావణుఁడు నిద్రించుచు ఉన్న కుంభకర్ణుని లేపి యుద్ధమునకు పంపఁగా వాఁడు రామునిచేత చచ్చినట్లు చెప్పుదురు. రావణ కుంభకర్ణులు సనకసనందనుల శాపముచే రాక్షసావతారము ఎత్తిన విష్ణుద్వారపాలకులు. భాగవత పురాణం ఆధారంగా సనత్ కుమారులు ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరుకొనగా జయవిజయులు (వైకుంఠ ద్వారపాలకులు) సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమోచనాన్ని అడుగగా జగన్నాటకసూత్రధారి ఏడు జన్మలు వైష్ణవ భక్తులగా గాని లేక మూడు జన్మలు మహావిష్ణువుతో వైరంతో జన్మిస్తే శాపవిమోచనం జరుగుతోంది అని అంగీకరిస్తాడు. ఈ విధంగా మూడు యుగాలలో

శాపవిమౌచన పొంది మహావిష్ణువుని వైకుంఠాన్ని చేరుకొన్నారు.

త్రేతాయుగంలో ఈ విధంగా శాపవిమౌచన కోసం జన్మించిన వాడు రావణకుంభకర్ణులు.

బ్రహ్మాణ సాద్వి అయిన విషర్వసునికి దైత్య రాకుమారైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు కావాలని కోరికతో అందరు రాకుమారుని అంగీకరించకుండా మాహాసాద్వి అయిన విష్వరసు ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకసారి కైకేసి సమయం కాని సమయంలో విశ్వరసు వద్దకు సంతానం కోసం వెళ్తుంది. విశ్వరసు సమయం కాదు అని ఉత్తమమైన సంతానం కలుగదు అని వారించిన, సంభోగిస్తుంది. ఈ విధంగా పుట్టినవారు రావణాసురుడు, కుంభకర్ణుడు.

కుంభకర్ణుడి నిద్ర మార్చు

 
రావణుడు తన కోసం సిద్ధంచేసిన అద్భుతమైన నివాసస్థలంలో నిద్రపోతుమన్న కుంభకర్ణుడు

శరీరవిస్తీర్ణాన్ని గురించి, నిద్ర గురించి, బలాన్ని గురించి వివిధ గాథలున్నాయి. కుంభ కర్ణుడు ఆరువందల ధనువుల పొడవు అనీ, వాని కైవారం నూటయాభై ధనువులంత అనీ రామాయణం యుద్ధ కాండంలో ఉంది. కుంభకర్ణుడి నిద్ర అనేది ఒక జాతీయంగా వాడుతారు. కుంభకర్ణుడు తపస్సు చేసి బ్రహ్మనుండి వరాన్ని పొందాలనుకొన్నాడు. కాని వాడి బలానికి భయపడిన దేవతలు ఆ సమయానికి వాడి నోటివెంట 'నిద్ర' అనే పదాన్ని వచ్చేలా చేశారనీ ఒక కథ ప్రచారంలో ఉంది. కాని రామాయణాతర్గతంగా చెప్పబడిన కథక్రింద ఉంది.

వాల్మీకి రామాయణం యుద్ధకాండలో విభీషణుడు రామునకు కుంభకర్ణుని గురించి ఇలా వివరించాడు -అతను విశ్రవసుని పుత్రుడు. అనేక దేవతలను, సమవర్తిను, సురపతిని కూడా జయించాడు. ఇంత భారీ ప్రమాణం గలవారు రాక్షసులలో మరొకరు లేరు. వాడు శూలం పుచ్చుకొస్తే మృత్యుదేవత స్వయంగా ముందు నిలచినట్లే. తక్కిన రాక్షసులంతా వరాలవలన గొప్పవాళ్ళయ్యారు. కాని వీడు సహజంగానే మహా తేజశ్శాలి, బలవంతుడు. పుట్టగానే ఆకలితో కనిపించిన జంతువునల్లా తినసాగాడు. లోకులు ఇంద్రుని శరణు వేడగా ఇంద్రుడు వాడిని వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుడు ఎక్కివున్న ఐరావతం దంతం వూడబెరికి దాంతోనే ఇంద్రుడిని తీవ్రంగా దండించాడు. భయపడిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు పోయి లోకాలు విపత్తులో ఉన్నాయని మొరపెట్టుకొన్నాడు. బ్రహ్మ కూడా భయపడి, అంతలోనే తేరుకొని "నువ్వు నేటినుండి చచ్చిపడినట్లు నిద్రపోతావు" అని శపించాడు. వెంటనే కుంభకర్ణుడు నిద్రలోకి జారుకున్నాడు. రావణుడు బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ "ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు" అని శాపాన్ని సడలించాడు.

యుద్ధానికి ముందు రావణుడు తన మంత్రులతో రానున్న విపత్తు గురించి చర్చించాడు. ఆరోజు కుంభకర్ణుడు మేలుకొని వున్నరోజు. విషయం తెలుసుకొని కుంభకర్ణుడు రావణుడు సీతను అపహరిండం పొరపాటని అభిప్రాయపడ్డాడు. అయినా జరిగిందేదో జరిగిపోయింది. సోదరప్రేమతో ఇలా చెబుతున్నాను. ఇక యుద్ధంలో నేను సమస్త వానరసేననూ, రామ లక్ష్మణులనూ తినేస్తాను. నువ్వు మధువు సేవించి నిశ్చింతగా వుండు అని ధైర్యం చెప్పాడు. తరువాత యధాప్రకారం నిద్రలోకి జారుకున్నాడు.

కుంభకర్ణుడిని నిద్ర లేపడం మార్చు

 
తనను నిద్ర నుండి లేపిన తరువాత ఆవలిస్తున్న కుంభకర్ణుడు

ప్రహస్తుని మరణానంతరం రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. అంత తేజోమయుడూ రామునిచేతిలో భంగపడి వెనుకకు తెరిగి వచ్చాడు. ఇక లాభం లేదని కుంభకర్ణుడిని నిద్ర లేపమని అనుచరులను ఆజ్ఞాపించాడు.

రాక్షస భృత్యులు ఎన్నో రకాల ఆహారాలు, మధ్యాలు తీసికొని కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమయ్యింది. కుంభకర్ణుడు ఉచ్చాస నిశ్వాసాలు చేస్తుంటే నిద్ర లేపడానికి వచ్చిన సైనికులు కుంభకర్ణుడి నాశికా రంధ్రాలలో లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. వాడిముందు ఆహారాన్ని, మద్యాన్ని వుంచి, పెద్దపెట్టున భేరీలు మ్రోగించారు. కర్రలతో కొట్టారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు.

జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు పోశారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగితే, అదే అవకాశం అనుకొని రాక్షస సైన్యం అంతా కలసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు లేచాడు. లేచిన వేంటనే పరిగలవంటి తన రెండు చేతులు విరుచుకొని, పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవలించాడు. వాడి దృష్టి వెంటనే అక్కడ పరిజనం వెంట ఉన్న మాంసరాసులు, అన్నం రాసులు, రక్తం కడవలు, మధ్యభాండాలు మీద పడుతుంది.. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.

కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మద్యం త్రాగి, రావణుని అంత:పురానికి బయలు దేరాడు. అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడి పోయి చెట్లు, పుట్టలు ఎక్కారు, కొందరు సేతువు వైపు పారిపోయారు. అది చూసిన విభీషణుడు అంగదుడు, సుగ్రీవుడుతో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచివెళ్ళుతున్నది రాక్షసుడు కాదని ఒక యంత్రం అని చెప్పమంటాడు. సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదించారు.

తనకు సంబంధించిన విపత్తును వివరించాడు రావణుడు. తమ సోదరుడు విభీషణుడు చెప్పినట్లు చేయడం మంచిదని కుంభకర్ణుడు సలహా ఇచ్చాడు. రావణుడు అందుకు కోపించాడు. మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణు నకు ఆపద తెచ్చాయని చింతించిన కుంభకర్ణుడు రావణుడికి ధైర్యం చెప్పి, నమస్కరించి, యుద్ధానికి బయలుదేరాడు.

కుంభకర్ణుడి యుద్ధం మార్చు

 
రామాయణ యుద్ధములో కుంభకర్ణునిపై బాణాలు ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916)

కోటగోడను ఒక్క అంగలో దాటి కుంభకర్ణుడు యుద్ధానికి రాగానే వానరసేన భయంతో పారిపోసాగింది. ఆ వచ్చేది ఒక యంత్రమనీ, రాక్షసుడు కాదనీ వానరసేనకు నచ్చజెప్పి అంగదుడు వారికి ధైర్యం చెప్పారు. వానరవీరులంతా ఒక్కుమ్మడిగా పైబడినా కుంభకర్ణుడికి ఈగలు ముసిరినట్లే అనిపించింది. వారు విసిరిన బండలు వాడి దేహానికి తగిలి పొడి ఐపోయాయి. హనుమంతుడు వాడి గుండెలమీద వేసిన పర్వత శిఖరం వలన మాత్రం కాస్త చలించి రక్తం కక్కుకున్నాడు. కుంభకర్ణుడు శూలంతో పొడవగా హనుమంతుడు కూడా బాధతో గర్జించాడు.

అంగదుడు, నీలుడు, ఋషభుడు, శరభుడు వంటి వీరులు కుంభకర్ణుడి చరుపులకు సృహ తప్పారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని విరిచేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని చేత పట్టుకొని లంకవైపు బయలుదేరాడు. దారిలో సృహ వచ్చిన సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు గిల్లి, ముక్కు కొరికి నేర్పుగా తప్పించుకొని ఎగిరి మళ్ళీ వానరసేన వైపు వచ్చిపడ్డాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఎడా పెడా వానర సైన్యాన్ని తినిపారవేయసాగాడు.

లక్ష్మణుడు తీవ్రమైన ఏడు బాణాలతో కుంభకర్ణుని బాధించాడు. రాముడు వేసిన రౌద్రాస్త్రం వల్ల కుంభకర్ణుని నోట అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నిరాయుధుడైన కుంభకర్ణుడు చేతులతోనూ, కాళ్ళతోనూ అందరినీ మర్దించసాగాడు. వాడిని నిలవరించడానికి ఎందరో వానరులు వాడిమీదకు ఎక్కినా వాడు వాళ్ళను విదిలించేశాడు. రాముడు వేసిన వాడి బాణాలు కూడా వాడిని ఆపలేకపోయాయి.

కుంభకర్ణుడి మరణం మార్చు

 
కుంభకర్ణుడిని సంహరిస్తున్న రామ లక్ష్మణులు

ఇక లాభం లేదని రాముడు వాయవ్యాస్త్రంతో కుంభకర్ణుడి ఒక చేతినీ, ఐంద్రాస్త్రంతో మరొక చేతినీ తెగగొట్టాడు. మరో రెండు మహిమాన్విత బాణాలతో కాళ్ళను నరికేశాడు. ఐనా రాహువులాగా కుంభకర్ణుడు ముందుకే వస్తున్నాడు. అపుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడిని సంహరించాడు. వాడి దేహం క్రింద పడి అనేక వానరులూ, రాక్షసులూ నలిగి మరణించారు దేవతలూ, గంధర్వులూ, మహర్షులూ రామచంద్రుని కీర్తించారు. వానర సేనా నాయకులు రాముని పూజించారు.

రావణుడు దుఃఖించాడు. కుంభకర్ణుని ఇద్దరు కొడుకులు- కుంభుడు, నికుంభుడు అనే మహావీరులు - తరువాత యుద్ధంలో మరణించారు.

వనరులు మార్చు

  • వాల్మీకి రామాయణం - సరళ సుందర వచనము - బ్రహ్మశ్రీ కొంపెల్ల వెంకటరామశాస్త్రి (రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి వారి ప్రచురణ)