బెంథామ్-హుకర్ వర్గీకరణ

జార్జి బెంథామ్ (George Bentham), జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా పుష్పించే మొక్కలకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంథంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.

వర్గీకరణలోని ముఖ్యాంశాలు మార్చు

  • బెంథామ్-హుకర్ వర్గీకరణ విధానం ముఖ్యంగా డి కండోల్ వర్గీకరణపై ఆధారపడి ఉంది. డి కండోల్ వర్గీకరణ లోని థలామిఫ్లోరె, కాలిసిఫ్లోరె లలోని అసంయుక్త ఆకర్షణ పత్రాలు గల కుటుంబాలన్నిటినీ కలిపి పాలిపెటాలె (Polypetalae) అనే ఉప విభాగాన్ని ఏర్పరచారు. అదేవిధంగా సంయుక్త ఆకర్షణ పత్రాలు గల కుటుంబాలన్నిటిని కలిపి గామోపెటాలె (Gamopetalae) అనే ఉప విభాగాన్ని ఏర్పరచారు.
  • వీరి వర్గీకరణ కేవలము పుష్పించే మొక్కలకు మాత్రమే వర్తిస్తుంది. పుష్పించే మొక్కలలో మొత్తం 97,205 జాతులను, 202 కుటుంబాలుగా గుర్తించారు. పాలిపెటాలెలో 84, గామోపెటాలెలో 45, మోనోక్లామిడెలో 36, వివృత బీజాలలో 3, ఏకదళబీజాలలో 34 కుటుంబాలను గుర్తించారు.
  • పుష్పించే మొక్కలను వరుసగా ద్విదళ బీజాలు (Dicotyledons), వివృత బీజాలు (Gymnosperms), ఏకదళ బీజాలు (Monocotyledons) అనే మూడు ప్రధాన వర్గాలుగా విభజించారు. వీటిని మరల శ్రేణులుగాను (Series), క్రమాలుగాను (Cohorts/Orders), కుటుంబాలుగాను (Families) విభజించారు.
  • పిండములోని బీజ దళాల సంఖ్య, ఈనెల వ్యాపనము, పుష్ప నిర్మాణము బట్టి ఆవృత బీజలను ద్విదళ బీజాలు (Dicotyledons), ఏకదళ బీజాలు (Monocotyledons) గా వర్గీకరించారు.
  • పరిపత్రాల స్వభావాన్ని బట్టి ద్విదళ బీజాలలో పాలీపెటాలే (Polypetalae), గామోపెటాలే (Gamopetalae), మోనోక్లామిడే (Monochlamydae) అనే మూడు తరగతులను గుర్తించారు.
  • పాలీపెటాలే లోని పరిపత్రాలు రెండు వలయాలలో ఉండి ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. మొక్కలను అండాశయ స్వభావాన్ని బట్టి మరల మూడు శ్రేణులను గుర్తించారు. అవి థలామిఫ్లోరే (Thalamiflorae), డిస్కిఫ్లోరే (Disciflorae), కాలిసిఫ్లోరే (Calyciflorae).
    • థలామిఫ్లోరే శ్రేణికి చెందిన మొక్కలలో అండకోశాధస్థిత పుష్పాలు ఉంటాయి. దీనిలో 6 క్రమాలను (Orders), 34 కుటుంబాలను (Families) ఉంచారు. దీనిలో మొదటి క్రమం రానేలిస్ (Ranales) గాను, చివరి క్రమం మాల్వేలిస్ (Malvales) గా వర్ణించారు.
    • డిస్కిఫ్లోరే శ్రేణిలో అండకోశాధస్థిత పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాలలో అండాశయము క్రింద వర్తులాకారపు లేదా పీలికలుగా తెగిన మకరంద గ్రంథి (Disc) ఉంటుమ్ది. ఈ శ్రేణిలో 4 క్రమాలను, 24 కుటుంబాలను చేర్చారు. మొదటి క్రమం జిరానియేలిస్ (Geraniales), చివరి క్రమం సపిండేలిస్ (Sapindales) గా వర్ణించారు.
    • కాలిసిఫ్లోరే శ్రేణిలో పర్యండకోశ (Perigynous) పుష్పాలు లేదా అండకోశోపరిక (Epigynous) పుష్పాలు ఉంటాయి. ఈ శ్రేణిలో 5 క్రమాలను, 27 కుటుంబలను చేర్చారు. ఇవి రోజేలిస్ (Rosales) క్రమంతో ప్రారంభమై, అంబెల్లేలిస్ (Umbellales) తో అంతమవుతుంది.
  • గామోపెటాలె ఉపతరగతిలోని మొక్కలలో ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. అండాశయము స్థానం ఆధారంగా ఇన్ ఫెరె (Inferae), హెటిరేమిరే (Heteromerae) బైకార్పల్లేటే (Bicarpellatae) అనే మూడు శ్రేణులను గుర్తించారు.
  • పరిపత్రాలు ఒకే వలయంలో అమరివున్న ద్విదళబీజాలను మోనోక్లామిడే అనే ఉపతరగతిలో ఉంచారు. దీనిలో మొత్తం 8 శ్రేణులను గుర్తించి వాటిలో 36 కుటుంబాలను వర్ణించారు. దీనిలో మొదటి శ్రేణిని కర్వెంబ్రియే (Curvembryae) గాను చివరి శ్రేణిని ఆర్డైన్స్ అనామలై (Ordines Anamali) గాను పేర్కొన్నారు.
  • ఈ వర్గీకరణలో ద్విదళబీజాలకు, ఏకదళబీజాలకు మధ్యలో వివృత బీజాలు (Gymnosperms) ఉంచారు. వీనిలో మూడు కుటుంబాలను గుర్తించారు. అవి సైకడేసి (Cycadaceae), కోనిఫెరేసి (Coniferaceae), నీటేసి (Gnetaceae).