మయూరి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. ఇది నర్తకియైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీశారు.[1] ఈ సినిమాలో సుధా చంద్రన్ తన జీవితాన్ని పోలిన మయూరి అనే నర్తకి పాత్ర పోషించింది. మయూరి ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా జైపూర్ కాలుతో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.

మయూరి
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతరామోజీరావు
తారాగణంసుధా చంద్రన్,
వీరమాచనేని సుభాకర్,
శైలజ,
పి.ఎల్.నారాయణ
సంగీతంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1985
భాషతెలుగు

ఈ సినిమా 1985 లో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2] 2014 లో కూడా మళ్ళీ అదే ఉత్సవాల్లో నృత్య ప్రధాన చిత్ర ప్రదర్శనలో భాగంగా ఇది ప్రదర్శించబడింది.[3] ఈ సినిమాకు ఏ తెలుగు సినిమాకు దక్కని విధంగా 14 నంది పురస్కారాలు దక్కాయి. ఈ సినిమాను మలయాళం, తమిళంలో అదే పేరుతో అనువాదం చేయగా హిందీలో 1986 లో నాచే మయూరి అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు.

కథ మార్చు

ముంబైలోని తెలుగు కుటుంబంలో జన్మిస్తుంది మయూరి. తల్లిదండ్రులకు ఆమె ఒక్కటే కూతురు. పెరిగే కొద్దీ నాట్యం అన్నా, కళలు అన్నా ఆసక్తి పెంచుకుంటుంది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన తండ్రి ఆమెను చిన్న వయసులోనే నాట్యశిక్షణాకేంద్రంలో చేరుస్తాడు. మూడేళ్ళకే నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్ళకే మొదటిసారిగా ప్రదర్శన ఇస్తుంది. చదువుతో పాటు నాట్యం కూడా నేర్చుకుంటూ 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి 75 ప్రదర్శనలు ఇస్తుంది. చదువులో కూడా ముందు ఉంటుంది కానీ నాట్యం అంటే ఆమెకు ప్రాణం.

16 వ పుట్టిన రోజుకు నాలుగు నెలల సమయం ఉండగా తమిళనాడులో ఒక ప్రమాదానికి గురౌతుంది. కుడికాలు ఎముక విరగడమే కాకుండా కొన్ని గాయాలు కూడా తగులుతాయి. ఆమెను ఆసుపత్రికి చేర్చే సమయంలో రోగులతో రద్దీగా ఉండగా ఆమెకు కొంతమంది జూనియర్ వైద్యులు చికిత్స చేస్తారు. గాయాల తీవ్రత గమనించకుండా కాలుకు కట్టుకట్టడంతో గాయం ముదిరి మోకాలి కింద కొంత భాగం తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాట్య ప్రపంచంలో ఆమె కన్న కలలు కల్లలవుతాయి. ఒక్కసారిగా నిరాశకు లోనవుతుంది. కానీ ఆమెకు నాట్యం పై ఉన్న ప్రేమ కుదురుగా ఉండనీయదు. జైపూర్ కాలు సాయంతో తిరిగి నడవడం నేర్చుకుంటుంది. అదే స్ఫూర్తితో నాట్యం కూడా సాధన చేయడం మొదలుపెడుతుంది.

పాత్రలు-పాత్రధారులు మార్చు

పాటల జాబితా మార్చు

1: ఈ పాదం , రచన: వేటూరి, గానం.ఎస్ పి.శైలజ

2: గౌరీశంకర శ్రింగం , రచన: వేటూరి, గానం.ఎస్ జానకి కోరస్

3: ఇది నా ప్రియ నర్తన, రచన: వేటూరి, గానం. ఎస్ . జానకి

4: కైలాసంలో తాండవమాడే , రచన వేటూరి, గానం.ఎస్. జానకి కోరస్

5: మౌనం, గానం , మధురం , రచన వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి కోరస్

6: వెన్నెల్లో ముత్యమా, రచన:వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కోరస్.

అవార్డులు మార్చు

  • జాతీయ సినిమా అవార్డు - సుధా చంద్రన్ - 1986.
  • ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
  • ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985

మూలాలు మార్చు

  1. https://m.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-singeetham-srinivasa-rao/20100907.htm#1
  2. "Indian Cinema 1985" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 8 July 2015. Retrieved 22 September 2014.
  3. "45th International Film Festival of India, Goa" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 16 March 2016. Retrieved 23 August 2015.