అక్కన్న మాదన్న దేవాలయం
అక్కన్న మాదన్న దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలంలోని మహదేవపూర్ గ్రామంలోని దేవాలయం. ఇక్కడ రుక్మిణీ సత్యభామా సహితంగా వేణుగోపాలస్వామి చతుర్భుజుడై భక్తాభీష్ట వరదుడిగా కొలువుదీరివున్నాడు. గర్భగుడిలో నిలువెత్తు నల్లరాతితో చెక్కిన వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభామ విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వామి ఇక్కడ సంతాన వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధుడు. ఈ ధామాన్ని రామదాసు కాలంనాటి అక్కన్న మాదన్నలు నిర్మించారని చారిత్రిక కథనం. అందుకే ఈ దేవాలయాన్ని అక్కన్న మాదన్న దేవాలయంగా పిలుస్తున్నారు.[1]
అక్కన్న మాదన్న దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | యాదాద్రి భువనగిరి జిల్లా |
ప్రదేశం: | మహదేవపూర్, బీబీనగర్ మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభామ |
ముఖ్య_ఉత్సవాలు: | మహాశివరాత్రి |
ఉదయం వేళల్లో స్వామివారు అమ్మవారితో కలిసి బయటకు వచ్చి, దేవాలయమంతా తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళీపోతారని, స్వామి వారి పాదానికి ఉన్న దుమ్ము, మట్టి రేణువులే దీనికి తార్కాణమని ఇక్కడి భక్తులు చెబుతున్నారు.[2]
చరిత్ర
మార్చునాలుగు ఎకరాల విస్తీర్ణంలోని 500 మీటర్ల పరిధిలో కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం, ఆ తర్వాత వచ్చిన తురుష్కుల పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయి మట్టిదిబ్బల మాదిరిగా మారిపోయింది. ఆ తరువాత నిజాం రాజులకాలంలో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. తానీషా దగ్గర మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు భువనగిరి పరిసర ప్రాంతాల్లో కప్పం వసూలు చేయడానికి వచ్చి, గోల్కొండ నుండి వరంగల్ వెళ్తూ మధ్యలో సేదతీరడానికి ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్రించేవారు.
ఒకసారి అక్కన్న మాదన్న ఈ ప్రాంతంలో నిద్రిస్తుండగా స్వామివారు కలలో ప్రత్యక్షమై, సమీపంలోని గుట్ట వద్ద తమ విగ్రహాలు ఉన్నాయని, వెతికి దేవాలయం నిర్మించాలని చెప్పడంతో అక్కన్న మాదన్నలు గుట్టకు సొరంగం తవ్వగా స్వామివార్ల విగ్రహాలు బయటపడ్డాయని, ఆ తరువాత దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతున్నది.[3]
నిర్మాణం
మార్చుఈ దేవాలయం మొత్తం రాతితోనే నిర్మించబడింది. పక్కనే ఉన్న బొంత గుట్ట నుంచి రాళ్ళు తీసుకొచ్చారు. గర్భగుడి ముందు రంగ మండపం ఉంది. మండపంలో నాట్యం చేయడానికి అనుకూలంగా మండపంపై నుంచి వెలుగు, గాలి వచ్చేలా ఖాళీ ప్రదేశాన్ని వదలడంతోపాటు మంటపం మధ్యలో గుండ్రటి ప్రదేశం ఏర్పాటుచేయబడింది.
ఈ దేవాలయ ప్రాంగణంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, ఉమామహేశ్వరుల దేవాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయుడి దేవాలయం అనే మూడు దేవాలయాలు ఉన్నాయి.[2]
పూజలు, బ్రహ్మోత్సవాలు
మార్చుఇక్కడున్న వేణుగోపాలస్వామికి శనివారం, ఉమామహేశ్వరుడికి సోమవారం, అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున వేణుగోపాలస్వామికి బ్రహ్మోత్సవాలు, శివ కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.[2]
పునరుద్ధరణ
మార్చుతెలంగాణ ఉద్యమ సమయంలో ఈ దేవాలయాన్ని దర్శించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని దేవుడికి పూజలు చేశాడు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ దేవాలయాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఎప్పుడు భక్తులతో రద్ధీగా ఉండే ఈ దేవాలయంలో సినిమాలు, సీరియళ్ళ షూటింగులు జరుగుతుంటాయి.[2]
చోరీ
మార్చు2022 ఆగస్టు 22న అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దొంగలు దేవాలయ గర్భగుడిలోకి ప్రవేశించి, విలువైన వెండి ఇత్తడి కిరీటాలు, ఇతర ఆభరణాలతోపాటు హుండీని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారు. దేవాలయంలోని సీసీ కెమెరాలు అక్కడి అటెండర్ మొబైల్‌ఫోన్ కు లింక్ చేసి ఉండడంతో దొంగలు చొరబడి హుండీని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అతను గ్రామస్తులకు ఫోన్ చేసి అప్రమత్తం చేయడంతో దేవాలయం వద్దకు వెళ్ళి చూడగా వంద మీటర్ల దూరంలో పడివున్న హుండీని యధావిధిగా ఉండడం గుర్తించారు.[4] కాగా దొంగలను పట్టుకుని చోరీకి గురియైన మిగతా వస్తువులు తిరిగి రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ Balaraju, Naresh (2017-08-13). "భద్రాద్రి రాముడి తమ్ముడు ఈ భాగ్యనగర కృష్ణుడు". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
- ↑ 2.0 2.1 2.2 2.3 telugu, NT News (2022-11-10). "ఆధ్యాత్మిక పరిమళం అక్కన్న మాదన్న ఆలయం". www.ntnews.com. Archived from the original on 2022-11-14. Retrieved 2023-01-26.
- ↑ "Special Story on Akkanna Madanna Temple At Bibinagar @ Yadadri Bhuvanagiri District". ap7am.com (in ఇంగ్లీష్). 2017-12-05. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
- ↑ ABN (2022-08-23). "అక్కన్న మాదన్న ఆలయంలో చోరీ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.