అతడు-ఆమె

(అతడు - ఆమె నుండి దారిమార్పు చెందింది)

ఈ నవలను ఉప్పల లక్ష్మణరావు రచించారు. ఈ నవల చాల ప్రాచుర్యం[1] పొందిన చారిత్రక నవల. మాలతీ చందూర్ వంటి విమర్శకులు ఈ నవలను పలు శీర్షికలలో పాఠకులకు పరిచయం చేశారు.[2]

అతడు - ఆమె
అతడు - ఆమె పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఉప్పల లక్ష్మణరావు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:

పేరు మార్చు

ఈ నవలలో మూడు భాగాలు. ఒక్కో భాగం ఒక్కో జంట రాసుకున్న డైరీ. పాత్రలు రాసుకున్న డైరీ ఆధారంగా ఈ నవల నడుస్తుంటుంది. అతడు, ఆమెల మధ్య జరిగిన సన్నివేశాలను ఇద్దరూ విడివిడిగా రాసుకున్న డైరీ కాబట్టీ ఈ నవల పేరు అతడు ఆమె అని పెట్టారు.

నవలా కాలం మార్చు

నవలలోని మొదటి భాగం శాంతం, శాస్త్రిల మధ్య జరుగుతుంటుంది. గాంధీ ఉద్యమాలు ముమ్మరంగా ఉన్న రోజుల్లో వీళ్ళద్దరి కథ నడుస్తుంది. తరువాతి భాగంలోని జంట శుభ-జనార్ధనరావు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నడుస్తుంది ఈ కథ. ఆఖరి భాగం లక్ష్మీ, భాస్కరం ల మధ్య జరుగుతుంది. 1947 మొదట్లో కథ మొదలై 1951లో ముగుస్తుంది. ఈ నవలలో మొదటి రెండు జంటలు దంపతులు కాగా, ఆఖరి జంట స్నేహితులు. ఈ నవల ఎక్కువ భాగం స్వాతంత్ర్యోద్యమ కాలంలో జరుగుతుంటుంది. ఆ సమయంలో జరిగిన కొన్ని ఉద్యమలలో పాత్రలు పాల్గొనడం ద్వారా ఆనాడు ఎంతమంది నిజమైన స్వతంత్ర కాంక్షులో, ఎంత మంది పరువు కోసం ఉద్యమాల్లోకి వచ్చేవారో చిత్రంగా వివరిస్తారు రచయిత. ఆనాటి సంఘాన్ని, ఉద్యమ స్వరూపాన్ని అద్దం పడుతుంది ఈ నవల.

కథ మార్చు

శాంతం, చిదంబర శాస్త్రిలతో నవల ప్రారంభమవుతుంది. శాంతం లెక్చరర్ గా పనిచేసి మానేసిన గృహిణి. శాస్త్రి విదేశంలో బారిష్టరు చదివి చెన్నపట్నంలో లా ప్రాక్టీసు పెట్టిన లాయరు. శాంతం ఆధునిక భావాలున్న మహిళ. శాస్త్రి పాతకాలం మనిషి. చాలా విషయాల్లో వారిద్దరి అభిప్రాయాలు కలవవు. డబ్బే అన్నిటికన్నా ప్రధానమైనది, దాని కోసం విలువలు, ఆదర్శాలూ పక్కన పెట్టచ్చూ అన్నది అతని వాదన. మనం సంపాదించే డబ్బును ఇతరులకు ఖర్చు పెట్టడంతో వచ్చే తృప్తి తెలుసుకోమంటుంది ఆమె. ఈ భాగంలో ఈ పాత్రలు తమ మధ్య జరిగిన సంఘటనలను డైరీగా రాసుకుంటారు. ఇద్దరి కోణాల్లోనూ ఆ సంఘటనలుంటాయి. దాంతో ఇద్దరి మనస్తతత్త్వాలు పాఠకునికి అర్ధమవుతాయి. ఒకే సంఘటనకు ఇద్దరు స్పందించే తీరు ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది ఈ నవలలో. ఈ ప్రక్రియ ఒక ప్రయోగమనే చెప్పుకోవాలి. శాంతం మనస్ఫూర్తిగా స్వాతంత్ర్యోద్యమంలోకి దిగితే, శాస్త్రి పేరు ప్రతిష్ఠల కోసం ఉద్యమంలోకొస్తాడు. ప్రతి విషయాన్నీ డబ్బు రూపంలోనే చూసే అతని మనస్తత్తత్వం నచ్చని శాంతం అతనిని వదిలి ఇద్దరి కూతుళ్ళతో కాశ్మీరం వెళ్ళి తిరిగి అతన్ని చేరడంతో వారిద్దరి కథ ముగుస్తుంది.[3] శుభ, జనార్ధనరావుల కథ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొదలవుతుంది. శాంతానికి కూతురు పుట్టిన సమయంలో ఒకరోజు ఒక పదహారేళ్ళ పిల్ల శాంతం ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటుంది. ఆమె తెలంగాణావాసి అని, ఆమె తల్లిదండ్రులు 100 రూపాయల కోసం తమిళనాడు వాళ్ళకి అమ్మేయగా, వాళ్ళు ఈమెని వేశ్యగా అమ్మబోతుండగా ఆమె తప్పించుకువచ్చానని చెప్పడంతో ఆమెను చేరదీస్తుంది శాంతం. ఆ అమ్మాయే శుభ. శాంతం ఆమెని తన కూతురు లక్ష్మితో సమానంగా పెంచుతుంది. జనార్ధనరావు శుభ స్నేహితుడు. అతను ఆర్మీలో ఇంజినీరుగా పనిచేస్తుంటాడు. వీరిద్దరూ తమ మనసులోని ఇష్టాన్ని బయటపెట్టలేకపోతారు. చాలా కాలం తరువాత ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయడంతో కథ ముగుస్తుంది. కథ నడుస్తున్నంత సేపూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ ప్రజల పరిస్థుతుల్ని వర్ణిస్తూనే ఉంటారు రచయిత. ప్రజల కష్టనష్టాలతో పాటు, ఆర్మీలోని అధికారుల స్థితిగతుల్ని కూడా వివరిస్తుంటారు. తరువాతి కథ శాంతం-శాస్త్రిల కూతురు లక్ష్మిది. లక్ష్మి కమ్యూనిస్టు భావలు కల అమ్మాయి. ఆమె స్నేహితుడు భాస్కరరావు. వీరిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ చూపించరు రచయిత. నిజానికి లక్ష్మికి పెళ్ళి, పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటే వ్యతిరేక భావాలు ఉండటమే కారణం. ఇద్దరూ ఇంజినీర్లే. భాస్కరం చిన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను బలవంతంగా స్వాధీనపరచుకుంటాడు. ఈ విషయం లక్ష్మికి ఉత్తరం రాసి పశ్చాత్తాపపడతాడు. అలా పితృస్వామిక మనస్తత్తత్వం నుంచి లక్ష్మి ద్వారా బయట పడతాడు. స్వతంత్రం వచ్చినా ప్రభుత్వ విధానాల్లో మర్పులు రాకపోవడంతో లక్ష్మి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడంతో మొత్తం నవల ముగుస్తుంది. ముగ్గురు ఆడవాళ్ళు, మూడు మనస్తత్త్వాలు, మూడు రకాల అభ్యుదయ భావాలు రచయిత ఈ నవలలో చిత్రిస్తారు. వారి భావాలకు రకరకాలుగా స్పందించే మగవాళ్ళు, వారి మనస్తత్తత్వాలూ కూడా ఈ నవల్లో గమనించవచ్చు.

పాత్ర చిత్రణ మార్చు

సహజంగా కాల్పనిక సాహిత్యంలో పాత్రల భావోద్వేగాలకనుగుణంగా కథ నడుస్తుంటుంది. కానీ ఈ నవలలో పాత్రలు తాము రాసుకునే డైరీ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకుంటుంటాయి. పాత్రలు రాసేది డైరీ కనుక ఎదుటి వారిని ప్రశంసించడానికో, విమర్శించడానికో అన్నట్టుగా కాక నిజాయితీగా మనసులో భావాలను వ్యక్తీకరిస్తుంటాయి. ఈ నవలలోని పాత్రలు సామజిక స్పృహ కలిగినవి. తమ చుట్టూ సమాజంలో జరిగే విషయాలకు స్పందిస్తూ ఉండటంతో కథ సజీవంగా నడుస్తుంటుంది.

మూలాలు మార్చు

  1. 100 చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా: సాక్షి ఫన్ డే 100 సంచికల ప్రత్యేక సంచిక
  2. నవలామంజరి:మాలతీచందూర్ నవలా పరిచయ వ్యాసాల సంకలనం
  3. చందూర్, మాలతీ (మే 2008). నవలా మంజరి-1 (కె.వి.ఎస్.ఆర్.పతంజలి ed.). విజయవాడ: క్వాలిటీ పబ్లిషర్స్. p. 129-137. Retrieved 19 November 2015.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అతడు-ఆమె&oldid=3846326" నుండి వెలికితీశారు