దామోదర్ ఘనశ్యామ్ బాబరే (అన్నా చించిణీకర్)

దామోదర్ ఘనశ్యామ్ బాబరేను అందరూ 'అన్నా చించిణీకర్ 'అని పిలిచేవారు . కారణం ,అతడు చించినీ గ్రామానికి చెందినవాడు . అతడు అతని భార్య లక్ష్మీబాయి బాబాను చాలాకాలం ఎంతో భక్తితో సేవించారు . వారి పొలాలకు సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉన్నది. బాబా దాని గురించి ,"అల్లా అచ్ఛాకరేగా " అనేవారు . మూడు సంవత్సరాలు గడిచినా విచారణ పూర్తికాలేదు . ఒకరోజు వారికి ఒక జాబు వచ్చింది . అందులో అన్నా చించిణీకర్ కేసు ఓడిపోయినట్లు వ్రాసి ఉంది . అది చూసి బాబా దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు అన్నా . అతడేమీ చెప్పకుండానే బాబా " ఆ ఉత్తరం చింపేయండి ,నా మీద నమ్మకం లేదా ? అని అరిచారు. కొంతకాలానికి అతనికి లాయర్ దగ్గర కేసు గెలిచినట్లు జాబు వచ్చింది . అతనికి ఆ కేసులో రూ . 1800/- లు వచ్చాయి . ఆ పైకాన్ని బాబాకు సమర్పించాడు అన్నా . ఆయన స్వీకరించక పోవడంతో ఆ ధనాన్ని చావడి మరమ్మత్తు చేయించడానికి ఉపయోగించారు . అన్నా చించిణీకర్ కు సంతానం లేదు కనుక తన యావదాస్తినీ బాబాకే సమర్పించాడు .