అభ్యుదయ
అభ్యుదయ సాహిత్య మాసపత్రిక ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం తరఫున వెలువడింది. తొలి సంచిక 1946 అక్టోబరులో మల్లంపల్లి సోమశేఖరశర్మ ముఖచిత్రంతో అచ్చయ్యింది. విజయవాడ నుండి ప్రకటితమైన ఈ పత్రికను ప్రజాశక్తి ప్రెస్‌లో ముద్రించారు. వెల రూపాయి. ఈ పత్రికకు చదలవాడ పిచ్చయ్య సంపాదకుడు.
![]() రవీంద్రనాథ్ టాగూరు ఫోటోతో వెలువడిన అభ్యుదయ ముఖచిత్రం | |
సంపాదకులు | చదలవాడ పిచ్చయ్య |
---|---|
వర్గాలు | సాహిత్యపత్రిక |
తరచుదనం | మాసపత్రిక |
ముద్రణకర్త | అభ్యుదయ రచయితల సంఘం |
మొదటి సంచిక | అక్టోబరు 1, 1946 |
దేశం | ![]() |
కేంద్రస్థానం | విజయవాడ |
భాష | తెలుగు |
ఆశయాలు
మార్చుఈ పత్రిక తొలి సంపాదకీయంలో తన ఆశయాలను ఈ క్రింది విధంగా పేర్కొంది.
ప్రజల విజ్ఞాన వికాసాలు పెంపొందిననాడే - దేశం, జాతీ అత్యుత్తమస్థాయి నందుకోగలవనీ; అందుకు సాహిత్యారాధకులందరూ కలిసి కృషి చేయాలనీ శ్రీ వీరేశలింగం, గిడుగు, గురజాడలు ఎలుగెత్తి చాటారు. ఆ ఆశయసిద్ధి కోసం తమ జీవితాలనే అంకితం చేశారు. ఆంధ్రజాతి దివ్య భవిష్యత్తును గురించి ఏ త్రిమూర్తులు తమ జీవితాలను అంకితం చేశారో వారి ఆశయాదర్శాలను సఫలం చేయడానికి సాహిత్యారాధకులైన మనం పూనుకోవాలి. ఈ ఉత్తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సాహిత్యారాధకులందరి సహకారంతో 'అభ్యుదయ' కృషి చేస్తుంది.
దాస్య భారతంలో ముక్కులు ముక్కలుగా ఉన్న తెలుగుదేశాన్ని ఒకే స్వతంత్ర రాష్ట్రంగా నిర్మించడానికీ, విశాలాంధ్ర జాతీయ భాషా వికాసానికీ, ఆంధ్ర సంస్కృతీ కళావిజ్ఞానాలకు రూప్పరేఖలు తీర్చడానికీ 'అభ్యుదయ' నిరంతరం పాటుపడుతుంది.
రెండువందలేండ్ల బ్రిటిష్ దాస్యశృంఖలాలను తెగతెంచుకొని బయట పడడానికై చావుబతుకుల పోరాటం సాగిస్తున్న వీరభారత ప్రజాహృదయాన్ని అభ్యుదయ ప్రతిబింబిస్తుంది. జాతీయ స్వాతంత్ర్య యోధుల వీరగాధలను ప్రజాహృదయానికి హత్తుకొనేలా చిత్రిస్తుంది.
చరిత్ర
మార్చుఈ పత్రిక ఆంధ్రసాహిత్య పాఠశాలా ప్రత్యేక సంచిక, గాంధీజీ స్మృతి సంచిక, తెలంగాణా ప్రత్యేక సంచిక, స్వాతంత్ర్యదినోత్సవ ప్రత్యేక సంచిక, కాళిదాస సంచిక, సాహిత్య విమర్శ ప్రత్యేక సంచిక మొదలైన ప్రత్యేక సంచికలను వెలువరించింది. ఈ పత్రిక తొలుత విడిప్రతి వెల ఒక రూపాయి అని నిర్ణయించినా పది నెలల తరువాత దానిని ఆరు అణాలకు తగ్గించారు. మొదట చదలవాడ పిచ్చయ్య సంపాదకునిగా వ్యవహరించినా కొమఱ్ఱాజు వినాయకరావు, ప్రయాగ కోదండరామశాస్త్రి సంపాదకవర్గంలో చేరారు. తరువాత కొంత కాలానికి చదలవాడ పిచ్చయ్య సంపాదకవర్గం నుండి తప్పుకోగా అనిసెట్టి సుబ్బారావు చేరాడు. 1956 జనవరిలో శ్రీరంగం శ్రీనివాసరావు, కొడవటిగంటి కుటుంబరావు, అనిసెట్టి సుబ్బారావు, తుమ్మల వెంకటరామయ్య, కె.వి.రమణారెడ్డి లతో కొత్త సంపాదకవర్గం ఏర్పాటయ్యింది. 1977 ఆగష్టు నెలలో ఈ పత్రిక ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం మద్రాసు శాఖ తరఫున తుమ్మల వెంకట్రామయ్య సంపాదకత్వంలో పునఃప్రారంభమయ్యింది. 1980లో ఈ పత్రిక హైదరాబాదుకు తరలి వెళ్ళింది.
రచనలు
మార్చుఈ పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, నాటికలు మొదలైనవాటిని ప్రచురించారు.
కొన్ని రచనలు ఇలా ఉన్నాయి.
- ప్రస్థానం (అనువాద కవిత మూలకవి:మయాకోవస్కీ)
- పిలుపు (కవిత)
- బండరాముడి పెళ్లాం (కథ)
- ప్రకటన (కవిత)
- సన్మానం (గల్పిక)
- వచనపద్యాలు: కొన్ని సూచనలు (వ్యాసం)
- పట్టుదల (నాటిక)
- భాషా సమస్య (వ్యాసం)
- ఆధునిక కవిత్వం
- కావ్యవస్తువు
- వ్యావహారిక భాష
- సోషలిస్టు మానవత్వం
- సంధి లేదు (కథానిక)
- వీరకుంకుమ (నాటిక)
శీర్షికలు
మార్చు- సంపాదకీయం
- పాలపుంత - ఈ శీర్షికలో ఇదివరకు ప్రచురితమైన ప్రముఖ రచనలను పునర్ముద్రించారు.
- పుస్తక పరిచయం
- చిత్ర సమీక్ష
- సాహిత్యమీమాంస
రచయితలు
మార్చుఈ పత్రికలో రచనల చేసినవారిలో మాధవపెద్ది గోఖలే, కొడవటిగంటి కుటుంబరావు, అట్లూరి పిచ్చేశ్వరరావు, దేవరకొండ బాలగంగాధర తిలక్, ధనకుధరం, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, ఆవంత్స సోమసుందర్, రాంషా, పురిపండా అప్పలస్వామి, కె.వి.రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, నార్ల చిరంజీవి, సుంకర సత్యనారాయణ, కుందుర్తి ఆంజనేయులు, తాపీ ధర్మారావు, నిడదవోలు వెంకటరావు, పువ్వాడ శేషగిరిరావు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణశాస్త్రి, సముద్రాల రాఘవాచార్యులు, పిలకా గణపతిశాస్త్రి, గిడుగు వేంకట సీతాపతి, తెన్నేటి సూరి, సెట్టి ఈశ్వరరావు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, మద్దుకూరి చంద్రశేఖరరావు, రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బూదరాజు రాధాకృష్ణ, విద్వాన్ విశ్వం, రాంభట్ల కృష్ణమూర్తి మొదలైనవారున్నారు.
అభిప్రాయాలు
మార్చు- ఈ పత్రికపై విశ్వనాథ సత్యనారాయణ ఈ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.[1]
“ | “అభ్యుదయ” మార్గము క్రొత్తది. క్రొత్తదియైనను ప్రాఁత మార్గములతో సమన్వయము కొఱకు ప్రయత్నించుచున్నది. ప్రాఁతకు బ్రాఁత, క్రొఁత్తకు గ్రొఁత్త. యెవరిదారిని వారు పోయి జాతి మత సంఘములలో భిన్నత్వము తెచ్చుకొని యెవరితెన్ను వారు పోయి యైక్యము లేకుండఁ జేసికొనరాదు. అపుడు బలము నశించును. అట్లుకాక యభ్యుదయ సమైక్యముకొఱకే ప్రయత్నించుచున్నది. క్రొత్త రారాదని యెవరును బిగించుకొని కూర్చుండరాదు. ప్రాత యను కొన్నదానిలోనను తత్తత్కాలముల యందలి క్రొత్తలు కలిసియే నేటి సమిష్టిరూప మొక ప్రాతయైనది. సమన్వయము సంఘములోని యుదాత్త ప్రకృతులయు సంఘ సమైక్యము యొక్క జీవననిర్మాతల యొక్కయు దృష్టి. క్రొత్తలో గొన్ని సమన్వయమునకు గుదురని వుండును. కాలక్రమేణ అవి సర్దుకొనును. ఈ సర్దుకొని యీ నూత్నప్రవాహము నిత్య ప్రవాహముతో సాధుసంగమము పొందునట్లు చేయుట కర్ణధారుల పని. కర్ణధారులు సనాతనులు. అనగా నిత్యులు. అనగా సృష్టిలో అవసరమైనప్పుడెల్ల నుదయించు చుందురు. ఈ "యభ్యుదయ" యీ సర్వలక్షణములు కలిగియు౦డుట ముదావహము. | ” |
- భారతి మాసపత్రిక నవంబరు 1946 సంచిక విమర్శనము శీర్షికలో అభ్యుదయ పత్రిక గురించి వి.రా. సమీక్ష వ్రాస్తూ ఈ విధంగా పేర్కొన్నాడు.[2]
“ | ఈ సంచికలో ఆనకట్టకు పూర్వపు పండిత ప్రకాండులు మొదలు ఆత్యాధునికులైన అభ్యుదయ ఖండకవులదాకా అన్నితరాల రచయితలూ, అన్ని తరహాల రచయితలూ ప్రాతినిధ్యం పొందారు. ఇంత వరకూ ఇంకా పెద్దలను పిన్నలు గురుప్రాయంగా చూచే సనాతనాచారం విసర్జితం కాలేదని గమనిక. కాని అన్ని తరాలవారి అభిప్రాయాలూ, అభిరుచులూ స్యమెక్య దృక్పథాన్ని సమీకరణం పాందినట్లు ఇంతమాత్రాన రుజువు కాజాలదని కూడా హెచ్చరిక.
కోరాడవారూ, పంచాగ్నులవారూ; మల్లంపల్లి వారూ, మద్దుకూరివారూ ; చిలుకూరివారూ, చెదలవాడవారూ; తెలికిచెర్లవారూ, తెన్నేటివారూ; కృష్ణశాస్త్రి గారూ, శ్రీశ్రీగారూ; గోపాలకృష్ణ మూర్తిగారూ, కుటుంబరావుగారూ అంతా ఒకేఒక దృక్కోణంనుంచి అభ్యుదయపథాన్ని ఆవగాహన చేనుకు, అభివ్యక్తం చేస్తారా అన్నది అనుమానాస్పదమైన విషయం. సాహిత్యం అన్నా, ప్రజాహితం అన్నా యీ అందరికి సమానమైన సమాదరం వున్నదని మాత్రమే సువేద్యమౌతుంది. ఈ విధమెన సమైక్యదృష్టి దేశభక్తి వంటి పాతభావమే అని నాకు తోస్తుంది - జర్మనీదీ దేశభక్తే, రష్యాదీ దేశభక్తే అన్నట్లు. అభ్యుదయ స్వరూపనిర్ణయం, స్వభావనిర్దేశం ఇంత సువిశాలమైన మైదానంగా వుంటే, ఇది ఒక పంథాగా ఎట్లు అనుసరణీయం కాగలదో సుబోధ్యం కాదు. ఈ విశాల విజ్ఞానసర్వస్వాన్ని చెరిగి వడవోతపోసి ఒక దిక్కుకి మళ్ళించే బాధ్యత వ్యాసకర్తల భుజస్కంధాలమీద మోపక, బహుశా సంపాదకులే స్వీకరించి నింపాదిగా ముందుముందు నిర్వహించదలచుకున్నారని ఊహిస్తాను. ఆపని కాలక్రమేణా జరిగినపుడు సాహిత్యంవలన స్థిరించగల అభ్యుదయ మెట్టిదో, అభ్యుదయంవలన లభ్యంకాగల సాహిత్యమెట్టిదో, ఈ ఫలితద్వంద్వ౦లోని సమీకరణమెట్టిదో, వైరుధ్యమెట్టిదో సుస్పష్టమౌతుందని విశ్వసిస్తాను. |
” |
మూలాలు
మార్చు- ↑ విశ్వనాథ సత్యనారాయణ (1 November 1946). "'అభ్యుదయ'కు స్వాగతం". అభ్యుదయ. 1 (2): 13. Retrieved 5 March 2025.
- ↑ వి.రా. (1 November 1946). "విమర్శనము". భారతి. 23 (11): 502. Retrieved 5 March 2025.