అముద్రిత గ్రంథ చింతామణి

తెలుగు మాసపత్రిక

నెల్లూరు నుండి ఈ మాసపత్రిక వెలువడింది. పూండ్ల రామకృష్ణయ్య వీరనాగయ్య ఒడయరు సహకారంతో ఈ పత్రికను ప్రారంభించాడు. తొలి సంచిక 1885, జూన్ నెలలో వెలుగుచూసింది. గ్రాంథిక భాషలో ఈ పత్రిక వెలువడింది. ఈ పత్రిక మొదటిపుటలో ముఖశీర్షిక క్రింద భర్తృహరి సుభాషితములలోని ఈ క్రింది పద్యము ప్రచురింపబడింది.

అముద్రిత గ్రంథ చింతామణి
అముద్రిత గ్రంథ చింతామణి
రకంమాసపత్రిక
ప్రచురణకర్తపూండ్ల రామకృష్ణయ్య
సంపాదకులుపూండ్ల రామకృష్ణయ్య
సహ సంపాదకులువీరనాగయ్య ఒడయరు
స్థాపించినది1885, జూన్
భాషతెలుగు
ముద్రణ నిలిపివేసినది1904, జూన్
కేంద్రంనెల్లూరు

విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్య నృపాల పూజితము విద్యనెఱుంగని వాఁడు మర్త్యుఁడే

ఆశయాలు

మార్చు

పూండ్ల రామకృష్ణయ్య ఈ పత్రిక ఉద్దేశాలను తొలి సంచికలో క్రింది విధంగా పద్యరూపంలో తెలిపాడు.[1]

తోరపు నూలు పగ్గములతోఁ బదిలంబుగఁ గట్టి పెట్టెలు
జేరుప నందు జీర్ణదశఁ జెంది మొగిఁ గ్రిమి కీటకచ్ఛటా
పూరితమై వృధాసెడు నముద్రిత పుస్తక పంక్తి నెంతయున్
గూరిమి మీఱ నచ్చునను గూర్చుట నల్లదె పత్రికాకృతిన్

చరిత్ర

మార్చు
 
పూండ్ల రామకృష్ణయ్య

నెల్లూరులోని విక్టోరియా ముద్రాక్షరశాలలో ముద్రించబడిన ఈ పత్రిక ప్రారంభించే సమయానికి పూండ్ల రామకృష్ణయ్య వయసు పాతిక సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే వీరనాగయ్య ఒడయరు సహాయ సంపాదకత్వంలో వెంకటగిరి మహారాజా గోపాలకృష్ణ యాచేంద్ర బహద్దరు ఆర్థిక సహకారంతో ఈ పత్రికను ప్రారంభించాడు. నాలుగు సంవత్సరాలు పత్రిక నడచిన తరువాత ఎందువల్లనో వీరనాగయ్య పత్రిక నుంచి తప్పుకున్నాడు. అయినా పూండ్ల రామకృష్ణయ్య ఒక్కడే ఈ పత్రికను నిరాటంకంగా తను మరణిచేంత వరకూ అంటే 1904, జూన్ నెల వరకు ఈ పత్రికను నడిపాడు.[2]

అముద్రితంగా తాళపత్ర్రాల రూపంలో పడిఉన్న అనేక తెలుగు గ్రంథాలను పత్రికలో ప్రచురించడం సంకల్పమైనప్పటికీ ప్రారంభం నుండి ఈ పత్రిక విమర్శలకు, చర్చలకు కూడా వేదిక అయ్యింది. చాటుపద్యాల ప్రచురణ మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రారంభమైంది. సమస్యాపూరణలు కూడా ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికలో మొదటి నాలుగు పుటలలో మయూఖము అనే శీర్షిక వెలువడేది. బిల్వేశ్వరీయము, ఆంధ్ర కుమారసంభవము, బ్రహ్మవిద్య, రామరాజీయము, రుక్మిణీపరిణయము, పాకశాస్త్రము, సునందినీ పరిణయము, ప్రతాపరుద్రీయ నాటకము మొదలైన కృతులపై విమర్శలు ఈపత్రికలో వెలువడ్డాయి. వేదము వేంకటరాయశాస్త్రి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి వంటి పండితుల సహాయ సహకారాలు ఈ పత్రికకు లభించాయి.

ఈ పత్రిక ద్వారా అచ్చయిన తాళపత్ర గ్రంథాలు

మార్చు
  1. యాదవ రాఘవ పాండవీయము
  2. మిత్రవిందా పరిణయము
  3. హరిశ్చంద్ర నలోపాఖ్యానము
  4. చంద్రాంగద చరిత్ర
  5. వైజయంతీ విలాసము
  6. శ్రీ ప్రబంధరాజ విజయవేంకటేశ్వర విలాసము
  7. శుద్ధాంధ్రనిర్యోష్ఠ్యనిర్వచన కుశరాట్చరిత్రము
  8. ఆంధ్రభాషార్ణవము
  9. ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము
  10. వసుంధరా పరిణయము
  11. ద్విరేఫవర్ణదర్పణము మొ||

పత్రికా ప్రశంస

మార్చు

ఈ పత్రికను గురించి పలు సమకాలీన పత్రికలు, పండితులు ప్రశంసించారు. వాటిలో కొన్ని:

  • ఎక్కడనో యొక్కొక్క చక్కని నక్కియుండి పట్టపగటి వెలుంగుఁ గాంచక ధూళిఁగలియునట్టి కబ్బముల నబ్బురముగ నచ్చొత్తించి చదువరుల యెడఁదనుబ్బుఁ గూర్చు నముద్రిత గ్రంథచింతామణీ పత్రికాధ్యక్షునిఁ బొగడుట పోలదే? ఈతని అముద్రిత గ్రంథచింతామణి ముద్రిత గ్రంథచింతామణియై యనేకుల భారతీముద్రిత వక్త్రుల నొనర్చుట స్తోత్రపాత్రము కాదే? ఒక్కొక్కరు ఒక్కొక్క పొత్తము రచింప నుద్యుక్తులగు నిక్కాలమున నిట్టి పురాతన కావ్యముల ముద్రించి పేరొందు బ్రహ్మశ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు కదా కృతులు."విడువక కూలిఁబెట్టి చదివించు కృతుల్ గృతులే వసుంధరన్" అను పల్కుల గుఱియగు పొల్లుపొత్తముల నచ్చొంతింపఁ దివురక యాంధ్రభాషావధూటికిఁ దాటంకముల వడుపుననెగడు కావ్యరత్నంబులఁ బ్రచురించి తెనుఁగు బాసపొలఁతి పొలుపలఁతికాక వెలయఁజేసి పెంపొందుటచే నీ బుధరత్నముఁబోలరితరులు. కృతుల రచియించుట కన్న బుధజనగణనీయంబులగు పురాతన గ్రంథములను ముద్రింపదొరకొనుటయె స్తవనీయంబని మేము నొక్కి వక్కాణింపఁగలము. - ఆంధ్రప్రకాశిక[3]

మూలాలు

మార్చు
  1. పూండ్ల రామకృష్ణయ్య (1885-06-01). "ఇష్టదేవతా ప్రార్థనాదికము". అముద్రిత గ్రంథ చింతామణి. 1 (1): 2. Archived from the original on 2016-03-05. Retrieved 1 March 2015.
  2. పొత్తూరి, వెంకటేశ్వరరావు (2004-08-01). ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ. pp. 136–139.
  3. సంపాదకుడు (1904-06-01). "అముద్రితగ్రంథచింతామణి". అముద్రితగ్రంథచింతామణి. 17 (6): 1. Archived from the original on 2016-03-05. Retrieved 2 March 2015.
  4. సంపాదకుడు (1900-11-01). "అముద్రిత గ్రంథ చింతామణి". అముద్రిత గ్రంథ చింతామణి. 13 (9–10): 1. Archived from the original on 2016-03-05. Retrieved 1 March 2015.