అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ (Ammembal Subba Rao Pai) (Kannada:ಅಮ್ಮೆಂಬಳ ಸುಬ್ಬ ರಾವ್ ಪೈ) (నవంబర్ 19, 1852 - జూలై 25, 1909) భారత్‌లోని మంగళూరుకు చెందిన ప్రఖ్యాత న్యాయవాది. ప్రస్తుతం భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు కూడా ఆయనే.
జీవితం మరియు కాలంసవరించు
1852, నవంబర్ 19 న మంగళూరులోని ముల్కీలో జన్మించిన అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ ప్రాథమిక విద్యను మంగళూరు ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. తర్వాత తల్లి అకాల మరణం ఆయన చదువులపై బాగా ప్రభావం చూపింది. ఎఫ్ఏ పరీక్ష పాసైన తర్వాత ఉన్నత విద్య కోసం తండ్రి ఆయన్ను మద్రాస్ పంపారు. అక్కడి ప్రెసిడెన్సీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మద్రాస్ లా కాలేజీలో చేరారు. అక్కడ జస్టిస్ హోలోవేతో పరిచయం కలిగింది. ఆయన అద్భుత వ్యక్తిత్వం సుబ్బారావుపై ఎంతో ప్రభావం చూపింది. ఆయనకు ఎంతగానో లాభించింది.
1876లో తండ్రి మరణానంతరం సుబ్బారావు మంగళూరుకు తిరిగి వచ్చారు. విజయవంతంగా లా ప్రాక్టీసు కొనసాగించారు. తన కక్షిదారులు కోర్టు బయటే పరస్పర సంతృప్తికరమైన పరిష్కార మార్గాలు చూసుకునేలా ఆయన ప్రోత్సహించే వారని చెబుతారు. దీనివల్ల కొన్నిసార్లు ఆయనకు ఫీజు నష్టం కలిగినా పట్టించుకునేవారు కారట. మద్రాసులో తనకు కలిసిన నలుగురు టీచర్లు 1891లో ఆయనను కలిసి, మంగళూరులో ఒక పాఠశాల ప్రారంభించాల్సిందిగా కోరారు. మహిళల్లో విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో తర్వాత కొంతకాలానికే, అంటే 1894లో కెనరా గర్ల్స్ ఉన్నత పాఠశాలను స్థాపించారు. నాటి సామాజిక పరిస్థితులు, మహిళా విద్య విషయంలో అప్పుడున్న ఆంక్షలు, నిషేధాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది గొప్ప విషయమే.
20వ శతాబ్ది మొదట్లో అర్బుత్నట్ కంపెనీ పతనం వల్ల సుబ్బారావు 1906లో కెనరా హిందూ పర్మెనెంట్ ఫండ్ లిమిటెడ్ (నేటి కెనరా బ్యాంక్) ను ప్రారంభించారు. స్వయం సహాయం ద్వారా సమాజం తనకు తానే నిధులు సమకూర్చుకునేలా చేసేందుకు ఆయన ఈ పనిచేశారు. జీఎస్బీ సమాజానికి ఆయన చేసిన ప్రధాన సేవల్లో గౌడ సరస్వత్ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పూర్ బాయ్స్ ఎడ్యుకేషన్ ఫండ్ మొదలు పెట్టడం (దీని వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు) ను చెప్పాలి. జీవితాంతం ఆయన కీళ్లవాతంతో బాధపడ్డారు. చివరికి 1909, జూలై 25 న ఆ వ్యాధితోనే కన్నుమూశారు.
కెనరా బ్యాంకుసవరించు
కెనరా బ్యాంక్‌ను హిందూ పర్మెనెంట్ ఫండ్ పేరుతో 1906లో దేశభక్తుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ స్థాపించారు. ఆయన వేసిన ఈ చిన్ని విత్తనం 1910లో కెనరా బ్యాంక్ లిమిటెడ్ పేరుతో వికసించింది. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత 1969లో కెనరా బ్యాంకుగా మారింది.
''మంచి బ్యాంకు సమాజానికి ఆర్థిక గుండెకాయ మాత్రమే కాదు, సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులను వీలైనంతగా మెరుగు పరిచే బాధ్యత ఉన్న సంస్థ - ఎ.సుబ్బారావు పాయ్.
వ్యవస్థాపక సూత్రాలుసవరించు
- మూఢాచారాలను, అజ్ఞానాన్ని తొలగించడం
- అందరికీ విద్యను వ్యాప్తి చేయడం తొలి సూత్రం.
- పొదుపు అలవాటును జనాల్లో పెంచడం
- ఆర్థిక సంస్థను ఆర్థిక గుండెకాయగా మాత్రమే కాకుండా సామాజిక గుండెకాయగా కూడా మార్చడం.
- ఆర్తులకు సాయపడటం.
- సేవాభావంతో, అంకితభావంతో పని చేయడం
- తోటి మనిషి వృద్ధి పట్ల బాధ్యతతో మెలగడం, బాధలను, కష్టాలను తొలగించడం ద్వారా పరిసరాల్లో మార్పులు తీసుకురావడం కోసం బాధ్యతగా ఉండటం.
ఇలాంటి మంచి సూత్రాలు, అద్భుత నాయకత్వం, తిరుగులేని పని సంస్కృతి, మారుతున్న బ్యాంకింగ్ వాతావరణానికి తగ్గట్టుగా మార్పులకు అలవాటు పడే నైజం కెనరా బ్యాంకును ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బ్యాంకుగా మార్చాయి.
మంగళూరులో విద్యావ్యాప్తికి కృషిసవరించు
నలుగురు యువ బీఏ గ్రాడ్యుయేట్లు (యు.శ్రీనివాసరావు, బి.పద్మనాభ బలిగ, బి.వామన్ బలిగ, అర్కల్ వాసుదేవరావ్) చెన్నైలో ఉండగా మంగళూరులో తమ గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజం మేలు కోసం విద్యా సంస్థలను ప్రారంభించాలని ఎంతగానో అనుకునేవారు. ఆ సమాజంలోని చాలామంది దక్షిణ కన్నడ జిల్లాలో ఆ సమయంలో నిరక్షరాస్యులుగా ఉండేవారు. ఈ నలుగురికి మరో టీచర్ కూడా కలిశారు. ఆయన ఎ.పద్మనాభయ్య. 1891 జూన్‌లో వారు మంగళూరులో కొడైబైల్ చాపెల్‌కు ఎదురుగా ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకుని, కెనరా హైస్కూలును మొదలుపెట్టారు. వారే సొంతదారులుగా, తొలి టీచర్లుగా విద్యా బోధనకు తెర తీశారు.
ఇలా కొత్తగా మొదలైన స్కూలుకు ఎంతోమంది వ్యతిరేకులు తయారయారు. వారంతా కలిసి, ఈ స్కూలుకు ప్రజా మద్దతు లేదని, టీచర్లు తమ ఉద్యోగాల కోసమే దాన్ని నడుపుతున్నారని విద్యా శాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో 1893 ఏప్రిల్‌లో సొంతదారుల్లో ఒకరు తన హక్కులను తమ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్కు వదులుకున్నారు. ఆ ప్రముఖుల్లో ఒకరే అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. అప్పటికే ఆయన మంగళూరులో ప్రఖ్యాత లాయర్.
1894 జూన్‌లో ప్రస్తుత కెనరా గర్ల్స్ స్కూల్ మొదలైంది. ఒకటి నుంచి ఐదో తరగుతులు జరిగేవి. దాన్ని ఉన్నత విద్య స్థాయికి పెంచేందుకు 25 ఏళ్లు పట్టింది. 1932లో 8వ తరగతి వచ్చింది. ఈ రెండు సంస్థలనూ ఒకటే బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ 1922 దాకా నిర్వహించింది. ఆ ఏడాది కెనరా ఉన్నత పాఠశాల అసోసియేషన్‌ను ఒక సొసైటీగా మొదలు పెట్టారు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1860 కింద అది నమోదైంది. అప్పటి నుంచి రెండు స్కూళ్లనూ అదే చూసుకుంది.
ఈ సంస్థ జీఎస్బీ సామాజిక వర్గాన్ని విద్యావంతం చేసే ఉద్దేశంతో పనిచేసింది. కానీ అనంతరం లౌకిక రూపు సంతరించుకుంది. సమాజంలోని అన్ని వర్గాలకూ జాతి మత, కుల విభేదాలకు అతీతంగా విద్యను అందించింది.
ఈ సామాజిక వర్గం విద్యావసరాలను తీర్చేందుకు ఏర్పాటైన విద్యా సంస్థలు:సవరించు
- కెనరా ఉన్నత పాఠశాల మెయిన్ (1891)
- కెనరా గర్ల్స్ ఉన్నత పాఠశాల (1894)
- కెనరా ఉన్నత పాఠశాల (ఉర్వ) (1944)
- కెనరా హయ్యర్ ప్రైమరీ స్కూల్ (1947)
- కెనరా నర్సరీ స్కూల్ (1969)
- కెనరా ఇంగ్లిష్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ (1970)
- కెనరా ప్రీ యూనివర్సిటీ కాలేజ్ (1972)
- కెనరా కాలేజ్ (1973)
- కెనరా బలవాదీ స్కూల్ (1978)
- కెనరా ఇంగ్లిష్ హయ్యర్ ప్రైమరీస్కూల్, ఉర్వా (1989)
- కెనరా నర్సరీ స్కూల్, ఉర్వా (1991)
- కెనరా గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ (1998)
- కెనరా ఇంజనీరింగ్ కాలేజ్ (2001)
- కెనరా స్కూల్ (సీబీఎస్ఈ) (2009)
- కెనరా మాంటెసొరీ (2009)
దార్శనికుడుసవరించు
శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ అద్భుత దీర్ఘదృష్టి రెండు సంస్థలకూ మంచి నేతృత్వాన్ని అందించింది. మరణించేదాకా ఆయన రెండు సంస్థలనూ సన్మార్గంలో నడిపించారు. ఆయన సమర్థ నాయకత్వం వల్ల ఆయనను దక్షిణ కన్నడలో విద్యా విప్లవానికి స్థాపకునిగా చెబుతారు.