అరుంధతీవ్రతం

        వివాహపరమైన దోషాలు తొలగిపోడానికి,సంతానము కొరకు,సంతానము సుఖసంపదలతో ఉండటానికి,స్తీల సౌభాగ్యము కళకళలాడుతూ ఉండటానికి ఎన్నో వ్రతాలు ఉన్నాయి. వాటిలో వైధవ్యం రాకుండా వుండటం కోసం అరుంధతి వ్రతాన్ని ఎక్కువగా స్త్రీలు ఆచరిస్తారు.

       వశిష్ఠ మహర్షి అర్ధాంగి అరుంధతి  తన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలను స్థంభింపజేయగల శక్తి సామర్ధ్యాలు కలది. అలాంటి అరుంధతి వ్రతాన్ని చైత్ర శుద్ధ విదియనాడు చేయాలని శాస్త్రం చెబుతోంది. ఆ రోజున తల స్నానం చేసి ఇంటిని పరిశుభ్ర పరచుకోవాలి. ఆ తరువాత పూజా మంటపాన్ని ... పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అరుంధతి - ధృవ - వశిష్ట మూర్తులుగా పసుపు ముద్దలను చేసుకుని మంటపంలో ఉంచాలి. ఈ ముగ్గురిని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా పూజ చేయాలి.

       ఆ తరువాత బెల్లంతో కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఏడుగురు ముత్తయిదువులకు ఒక్కొక్కరికి ఎనిమిది గాజులు ... ఏడు తమలపాకులు ... అయిదు అరటి పళ్లు ... రెండు వక్కలు ... ఒక రవికల గుడ్డను వాయనంగా సమర్పించి వారి ఆశీస్సులు పొందాలి. ఆ తరువాత ఈ వ్రతానికి కారణమైన కథ చదివించుకుని విని అక్షింతలు తలపై ధరించాలి.

వ్రత కథ

   

       పూర్వం కాశీనగరములో సర్వశాస్త్ర బ్రహ్మ అనే విప్రుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కలదు. పేరు సుబల. సుబలను గుణనిధికి యిచ్చి వివాహము చేశారు. గుణ్నిధి విధి నిర్వహణ కొరకు దేశాంతరము వెళ్ళాడు. అక్కడ వేరొక స్త్రీ వ్యామోహములో పడి సుబలను మరిచాడు. పెళ్ళినాడు చేసిన ప్రమాణాలు మరిచి ఆ స్త్రీని వివాహము చేసుకున్నాడు. కాని విధి వక్రించి కొన్ని నెలలలోపే గుణనిధి మరణించాడు. ఈ విషయము తెలిసిన సుబల కన్నీల్లు పెట్టుకుంది. కొన్ని రోజులకు దు:ఖము నుంచి కోలుకుంది. తాను వితంతువుగా ఏమిచేయాలో పెద్దలను సంప్రదించింది. ఈ జన్మలో వైధవ్యము మరో జన్మలోకూడ ప్రాప్తించ కూడదని శివపార్వతుల గురించి తపస్సు చేయాలని సంకల్పించుకుంది.

      ఒక శుభముహూర్తము చూసుకొని గంగానది వొడ్డున కూర్చొని పార్వతి పరమేశ్వరుల గురించి తపస్సు ప్రారంభించింది. శివపార్వతులు ఆమె తపస్సుకు మెచ్చి వరము కోరుకోమన్నారు. అందుకు సుబల " ఓ పార్వతీ పరమేశ్వరులారా! నేనె చేసిన పాపము ఏమిటో ఏమో నాకు తెలియదు. నాకీ జన్మలో భర్తను కోల్పోయాను. వచ్చే జన్మలోనైన నాకు వైధవ్యము ప్రాప్తించకుండ నేను ఏమి చేయాలో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను." అని విన్నవించుకుంది. ఆమె కోరిక విన్న పరమేశ్వరుడు ఆమెను ఆశీర్వధించి అరుంధతి వ్రతము ఆచరించమని చెప్పాడు. సుబల అరుంధతీ వ్రతమాచరించి మరుజన్మలో సౌభాగ్యవతిగా భర్త సేవలో తరించింది.