అల్లాడి కుప్పుస్వామి

జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి బి.ఏ., బి.ఎల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి.

అల్లాడి కుప్పుస్వామి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
పదవీ కాలం
1980 – 1982
ముందు చల్లా కొండయ్య
తరువాత కె.మాధవరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1920-03-23)1920 మార్చి 23
మరణం 2012 మార్చి 12

ఆయన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కుమారుడు. 1920, మార్చి 22న జన్మించాడు. ఈయన లయోలా కళాశాలలోనూ, మద్రాసు లా కళాశాలలోనూ విద్యాభ్యాసం చేశాడు. గణితంలో ఆచార్యుడవ్వాలనే ఆసక్తితో కుప్పుస్వామి 1939లో గణితంలో బి.ఏ హానర్స్ పట్టభద్రుడయ్యాడు. గణితంలో ఉన్నత విద్య అభ్యసించటానికి కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కళాశాలలో అవకాశం వచ్చినా, తండ్రి ప్రోద్బలంతో ఆ అవకాశాన్ని కాదని, 1939 నుండి 1941 వరకు న్యాయశాస్త్రం చదివాడు. ఈయన మామ ప్రముఖ న్యాయవాది ఉమామహేశ్వరం వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేశాడు. వి.గోవిందరాజాచారి వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేసి, 1942లో అడ్వకేటుగా నమోదు చేసుకున్నాడు. 1946 డిసెంబరులో ఆయన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై ఢిల్లీలో నివాసమేర్పరచినప్పుడు, ఆయన అభ్యర్ధన మేరకు కుప్పుస్వామి మద్రాసులోని న్యాయవాద వృత్తి వదిలి, ఢిల్లీలో తండ్రికి సహాయకుడిగా నాలుగు సంవత్సరాలు ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నకాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, బి.ఆర్.అంబేద్కర్, కె.ఎం.మున్షీ వంటి ప్రముఖులలో సాంగత్యం ఏర్పడింది. తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవటం వలన కుప్పుస్వామి, రాజ్యాంగ పరిషత్తు చర్చలు జరిగే గది బయటే కుర్చీలో కూర్చుని తండ్రికి సహాయపడటానికి సిద్ధంగా ఉండేవాడు. ఆలా రాజ్యంగ పరిషత్తులో జరిగిన చర్చలు అన్నీ విని, అవగాహన చేసుకున్నాడు. ఈ కాలంలో ఏర్పడిన రాజ్యాంగ అవగాహన ఆ తర్వాత తన న్యాయవాద వృత్తిలో రాజ్యాంగ సమస్యలు తీర్చటానికి ఎంతో ఉపయోగపడిందని ఆయన చెప్పుకున్నాడు. కుప్పుస్వామి రాజ్యాంగ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించటానికి హిందూ వంటి అనేక పత్రికలో వ్యాసాలు ప్రచురించాడు.

ఆంధ్రరాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గుంటూరులో ప్రారంభమైన తర్వాత, కుప్పుస్వామి గుంటూరుకు తరలి వచ్చి అక్కడ కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేశాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో, హైకోర్టుతో పాటు హైదరాబాదు వచ్చి అక్కడ న్యాయవాదిగా పనిచేశాడు. 1961 నుండి 1967 వరకు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. 1967, ఆగస్టు 21న అదనపు న్యాయమూర్తిగా నియమించబడి, 1967, నవంబరు 27న శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1980, జూన్ 26న ఆపద్ధర్మ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడై, ఆ తర్వాత 1980 నవంబరు 23న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.

1970లో పార్లమెంట్ హౌస్ ఎదురుగా ఎస్.ఎస్.పి సభ్యులపై లాఠీఛార్జీ చేసిన సంఘటనపై విచారించేందుకు నియమించిన ఏకసభ్య కమిషన్ కు ఈయన నియమించబడ్డాడు 1973లో హైదరాబాదులో అవ్రో విమానప్రమాదంపై దర్యాప్తు చేయటానికి, 1974లో నాగార్జునసాగర్ కాలువ నిర్మాణ కాంట్రాక్టుల విషయంలో అవకతవకలను విచారించేందుకు ఈయనను నియమించారు.

సామాజిక సేవ

మార్చు

కుప్పుస్వామి తన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ శతజయంతి స్మారకార్ధమై 1983లో అల్లాడి స్మారక ట్రస్టు ప్రారంభించాడు. ఈ ట్రస్టు యొక్క ప్రధాన లక్ష్యం పేద కక్షిదారులు, పేద న్యాయ విద్యార్థులకు సహాయం చేయటం, న్యాయం చేకూరేలా సహాయం చేయటం. భారత రాజ్యాంగ సంబంధిత విషయాలపై ప్రతిసంవత్సరం అల్లాడి స్మారక ఉపన్యాసాలు ప్రముఖ న్యాయవాదులచే ఇవ్వబడుతున్నాయి.[1] ఈ ఉపన్యాసకులలో వి.ఆర్.కృష్ణ అయ్యర్, వి.చంద్రచూడ్, పి.సి.రావు, పావని పరమేశ్వరరావు, నందితా హస్కర్, రమాదేవి, ఎం. జగన్నాథరావు తదితరులు ఉన్నారు.

కుప్పుస్వామి పదవీ విరమణానంతరం అనేక సాంఘిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లో సంస్కృత భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సురభారతి సమితికి పాతికేళ్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. హైదరాబాద్ లిటరరీ సొసైటీకి చైర్మన్

రచనలు

మార్చు

కుప్పుస్వామి అనేక న్యాయశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలను రచించాడు. ఈయన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ జీవితచరిత్రను ప్రచురించాడు. 2009లో 98 చిన్ననీతి కథలు ఉన్న టేల్స్ రీటోల్డ్ అనే కథా సంపుటిని ఆంగ్లంలో ప్రచురించారు. ఈ పిల్లల పుస్తకాన్ని భార్గవీ రఘురాం, సరస్వతీ బాలసుబ్రమణ్యం తెలుగు మాత్రమే చదవగల్గిన పిల్లలకు అందించేందుకు తెలుగులోకి అనువదించడం జరిగింది.

కుప్పుస్వామి 2012, మార్చి 12న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. Alladi Memorial Lectures by M. Hidayatullah and S. Ranganathan, 2009 Archived 2015-09-23 at the Wayback Machine ISBN 978-81-89487-56-0