అవ్యయము

(అవ్యయములు నుండి దారిమార్పు చెందింది)

లింగ విభక్తి వచనశూన్యమైన పదము అవ్యయములు. తెలుగులో ఆశ్చర్యార్ధకములు అవ్యయములు.

ఆశ్చర్యార్ధకములుసవరించు

ఒక మాట రెండు మారులు గాని అంతకు మించి గాని యవ్యవధానముగా చెప్పబడినపుడు రెండవసారి చెప్పబడిన శబ్దమును గాని, ఆకూటమిని గాని ఆమ్రేడితముగ వ్యవహరించుట వైయాకరణ సంప్రదాయము.శబ్దములు దీర్ఘాంతములైనను, హ్రస్వాంతము లైనను ఆమ్రేడితమున నిత్యముగా సంధి జరుగును.అది తెలుగులో మరి దీర్ఘాంత శబ్దముల కెచటను సంధి జరుగదు.

అమ్మ, అయ్య, అబ్బ, అక్క, అప్ప, అవ్వ, అన్న-ఇవి తెలుగు భాషలో కొన్ని సంబంధార్ధక వాచకములు.వీటి కన్నిటికిని ద్విత్వరహిత రూపములు కలవు. ఇట్టి రూపములకు ప్రత్యేక ప్రయోగము లేదు. ఆమ్రేడితమున ద్విత్వము లోపించదు. వ్యస్తరూపము ఆశ్చర్యార్ధకము లగుచో అవి అవ్యయములు అగును.

  • అమ్మ: సంస్కృతము అంబా; ప్రాకృతము:అమ్మా; తెలుగు-అమ్మ. అమ అనునది రూపాంతకము.దీనికి తల్లి, పూజ్యురాలను అర్ధములు కలవు. ప్రశంసాశ్చర్య సంతాపాదులను తెలుపును.

పూజ్యతకు: చెలికత్తె సత్యభామతో అనినమాటలు. అమ్మా! యేమని చెప్పుదు (పారి.1-75) ప్రశంసకు: అమ్మా! యీ రాజు ప్రతి గానమమ్మ యెచట (విజయ విలాసము 2-73)

ఈశబ్దము ద్విరుక్త మగునపుడు అమ్మ+అమ్మ= అమ్మమ్మ యగును.ఇది సంబంధార్ధకమగు నామవాచకముగా గ్రహించినపుడు తల్లి తల్లి అని అర్ధము నిచ్చును. అవ్యయమై ఆశ్చర్యార్ధకమును దెలియజేయును. ఉదా: ఈమె అమ్మమ్మ (ఇది నామ వాచకము.సంబంధార్ధము) అమ్మమ్మ! వాడెంత పని చేసినాడు (ఆశ్చర్యార్ధకము).

అమ్మరో-ఇది అవ్యయమై యాశ్చర్య ప్రశంసాదులను దెలుపును. అమ్మ+ఓ= అమ్మో-ఆశ్చర్యార్ధకము. అమ్మో+అమ్మో= అమ్మమ్మో- ఇది వ్యవహారములో ఆశ్చర్యార్ధకము.

  • అయ్య: సంస్కృతము ఆర్య. ప్రాకృతము: అయ్యఓ; తమిళము-అయ్య, తెలుగు-తండ్రి అని అర్ధము.

తండ్రి అనుటకు: మా యయ్యకు బాయక పనిచేయుచు. (ఆది 3-137). అన్నయు దమ్ములు దమకు నయ్య సగం బిలవేడి (ద్రోణ 5-32). ఆమ్రేడింపగా అయ+అయ్య=అయ్యయ్య అగును. దీనికి సంబంద్జార్ధకముగా తాత అని వ్యవహారము కలదు.

దీని ఆశ్చర్యార్ధక రూపాంతరములు: అయ్యో!, అయ్య+రో=అయ్యరో! అయ్యా+రే= అయ్యారే! (ఉదా: అయ్యారే! చెలు వెక్కడ!).

  • అప్ప: కన్నడము:అప్ప, తమిళము:అప్పన్. ఈ శబ్దమునకు అమ్మ, అయ్య, అక్క అను అర్ధములు కలవు. అప్పా అనునది రూపాంతరము.

దీని ఆశ్చర్యార్ధక రూపాంతరములు: అప్ప+అప్ప=అప్పప్ప!, అప్పా.

  • అబ్బ: సంస్కృతము:అంబః దీనికిని తండ్రి అను అర్ధము. దీనిని ఆమ్రేడింపగా అబ్బ+అబ్బ=అబ్బబ్బ (విసుగు) ఆశ్చర్యార్ధకము. అబ్బా! ప్రశంసాత్మక ఆశ్చర్యార్ధకము.
  • అవ్వ: సంస్కృతము:అంబాః, కన్నడము:అవ్వ, తమిళము:అవ్వై. ఈ శబ్దమునకు తల్లి, వృద్ధస్త్రీ అని అర్ధములు కలవు.

దీనిని ఆమ్రేడింపగా అవ్వ+అవ్వ=అవ్వవ్వ. అవ్వవ్వ! ఎంత దుర్మార్గపని చేసినాడు!

  • అన్న: జ్యేష్ఠుడు. తమిళము:అణ్ణన్, కన్నడ, మళయాళములు:అణ్ణ.

దీనిని ఆమ్రేడింపగా అన్న+అన్న=అన్నన్న. ప్రశంస, సంతాపము.

  • అక్క: సంస్కృతము. అక్కా=అమ్మ; ఆర్కా=జ్యేష్ఠ భగిని. ప్రాకృతము, కన్నడము:అక్క, తమిళము:అక్కళ్.

దీనిని ఆమ్రేడింపగా: అమ్మ+అక్క=అమ్మక్క. శతాంశము.

[1]

మూలాలుసవరించు

  1. 1972 భారతి మాస పత్రిక. వ్యాసము: ఆంధ్రభాష-ఆశ్చర్యార్ధకములు. వ్యాస కర్త: శ్రీ అయ్యగారి నరసింహమూర్తి.
"https://te.wikipedia.org/w/index.php?title=అవ్యయము&oldid=2607111" నుండి వెలికితీశారు