అహ్మద్ మొహియుద్దీన్

అహ్మద్ మొహియుద్దీన్ (1898, అక్టోబరు 101966, జనవరి 5) ఆర్థికవేత్త, పాలనాధికారి, భారతీయ రాజకీయనాయకుడు. ఈయన 1952 నుండి 1957 వరకు, తొలి లోక్‌సభలో హైదరాబాదు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈయన రెండవ, మూడవ లోక్‌సభలకు సికింద్రాబాదు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. నెహ్రూ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశాడు.

అహ్మద్ మొహియుద్దీన్
అహ్మద్ మొహియుద్దీన్


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం హైదరాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం 10 అక్టోబరు 1898
హైదరాబాదు
మరణం 1966 జనవరి 5(1966-01-05) (వయసు 67)
కొత్త ఢిల్లీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
జీవిత భాగస్వామి అయేషా సుల్తానా
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

అహ్మద్ మొహియుద్దీన్, 1898, అక్టోబరు 10న హైదరాబాదులో జన్మించాడు. ఈయన తండ్రి నూరుల్లా హుస్సేనీ. మొహియుద్దీన్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించాడు. హైదరాబాదు సంస్థానం యొక్క ప్రభుత్వ సేవలో పనిచేసి విరమణ పొందాడు. ఈయన హైదరాబాదు సంస్థానపు జాతీయ పునర్నిర్మాణ శాఖలో కొంతకాలం పనిచేశాడు. 1927 నుండి 1930 వరకు నిజాం కళాశాలలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశాడు.[1] సంస్థానంలో బ్యాంకింగు వ్యాపారం పరిస్థితిని గురించి దర్యాప్తు చేయడానికి హైదరాబాదు ప్రభుత్వం ఏర్పాటుచేసిన విచారణ సంఘాలకు కార్యదర్శిగా పనిచేశాడు. 1938 నుండి 1943 వరకు వాణిజ్య పరిశ్రమల శాఖ డైరెక్టరుగా పనిచేశాడు. 1939లో కాంగ్రేసు ఏర్పాటుచేసిన జాతీయ ప్రణాళికా సమితిలో హైదరాబాదు ప్రతినిధిగా నియమించబడ్డాడు. ఆ తరువాత కొంతకాలం బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు కార్యదర్శిగా, కార్మిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడు.[2]

1958 నుండి 1962 వరకు కేంద్ర పౌరవిమానయాన శాఖకు సహాయమంత్రిగా పనిచేశాడు. 1962 నుండి మరణించే వరకు కేంద్ర సమాచార ప్రసరణ, రవాణ శాఖకు ఉపమంత్రిగా పనిచేశాడు.

అహ్మద్ మొహియుద్దీన్, 1966, జనవరి 5న కొత్త ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు.[3] ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

మూలాలు మార్చు

  1. "Third Lok Sabha - Member Profile". Retrieved 12 December 2017.
  2. "మొహియుద్దీన్ మృతి" (PDF). ఆంధ్రభూమి. 6 January 1966. p. 6. Archived from the original (PDF) on 24 సెప్టెంబరు 2020. Retrieved 13 December 2017.
  3. "అహమ్మద్ మెహిద్దీన్ మృతి" (PDF). ఆంధ్రపత్రిక. 6 January 1966. p. 1. Archived from the original (PDF) on 25 సెప్టెంబరు 2020. Retrieved 13 December 2017.