ఆది (సినిమా)

2002 సినిమా

ఆది సినిమా వి.వి.వినాయక్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, కీర్తి చావ్లా ముఖ్యపాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ఫ్యాక్షన్ సినిమా.

ఆది
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.వినాయక్
నిర్మాణం నల్లమలపు శ్రీనివాస్
తారాగణం జూనియర్ ఎన్టీఆర్
కీర్తి చావ్లా
చలపతిరావు
ఫిష్ వెంకట్
సంగీతం మణిశర్మ
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
భాష తెలుగు
 
చిత్ర సన్నివేశము.

ధనవంతుడైనా ఆది తండ్రి అమెరికా నుండి వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. అది ఆక్రమించిన మరొక భూస్వామి అతడిని హత్య చేస్తాడు. ఆ సమయంలో ఆదిని తీసుకొని పారిపోతాడు అతడి ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన అతడు.

పెరిగి పెద్దయిన ఆదికి ఊరి విశేషాలు చెప్పి తన ఆస్తిని తిరిగి తీసుకోమంటాడు. ఊరికి వెళ్ళిన ఆది తన ఆస్తిని రక్షించుకొని పేదలకు దానమివ్వడం, ప్రతినాయకుని కూతురిని వివాహం చేసుకోవడంతో కథ పూర్తవుతుంది.

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

స్విట్జర్లాండ్లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తై, యూనిట్ బయలుదేరుతున్నప్పుడు నల్లమలపు శ్రీనివాస్ ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వి.వి.వినాయక్ని పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. అంతకుముందు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కావడం, కథ అంటూ చాలామందే ఆయనని విసిగిస్తూండడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక కలవమని చెప్పి పంపేశారు. బుజ్జి ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చాలాసార్లు ఫోన్లు చేసి ఇబ్బందిపెట్టడంతో, ఓసారి కథ విని నచ్చలేదని చెప్పి వదిలించుకుందామని ఆయన నిర్ణయించుకుని వాళ్ళని రమ్మన్నారు. తర్వాతి రోజు వినాయక్, బుజ్జి వచ్చారు. "మొత్తం కథ వద్దు, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం చెప్పండి" అని ముందుగా చెప్పేశారు ఎన్టీఆర్, అందుకు వినాయక్ "ఒక్క ఇంట్రో మాత్రం చెప్తాను, నచ్చితేనే కూర్చోండి. మీ సమయం వృధా చేయదలుచుకోలేదు" అన్నారు. ఇంట్రో చెప్పడంతో బాగా నచ్చిన ఎన్టీఆర్ రెండు గంటల పాటు కథ విన్నారు. అదొక ప్రేమకథ. ఎన్టీఆర్ కి కథ నచ్చింది, మనం ఈ సినిమా చేస్తున్నామని నిర్ధారించారు. పరిశ్రమలో కూడా ఎన్టీఆర్, వినాయక్ సినిమా గురించి వార్త ప్రచారమైపోయింది.

సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని ఆ దశలో ప్రేమకథలు వద్దని, మాస్ సినిమాలపైనే దృష్టిపెట్టమని సలహాఇచ్చారు.[1] దాంతో వినాయక్, బుజ్జిలను పిలిచి ఆ విషయాన్ని చెప్పి మాస్ కథ ఏదైనా ఉంటే చెప్పమన్నారు ఎన్టీఆర్. ఈ విషయం తెలిసి డీలాపడ్డ వినాయక్ అప్పటికప్పుడు తన వద్ద అలాంటి మాస్ కథ ఏమీ లేకపోవడంతో ఎప్పుడో రాసుకున్న సీన్లు గుర్తుచేసుకున్నారు. ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసే సన్నివేశం కాగా మరొకటి గాల్లోకి సుమోలు లేచే సన్నివేశం. ఆ రెండు సన్నివేశాలూ చెప్పి, నచ్చితే కథ తయారుచేస్తానని వినాయక్ చెప్పగా, ఫ్యాక్షన్ కథ నాకు మరీ హెవీ అయిపోతుందంటూ దాటవేయబోయారు ఎన్టీఆర్. "వారంరోజులు సమయం ఇస్తే కథ రాసుకుని వస్తాను, నచ్చితేనే చేద్దాం లేదంటే వేరెవరికైనా డేట్స్ ఇచ్చేద్దురు" అంటూ ఒప్పించారు వినాయక్. ఆ రాత్రి వినాయక్ రూంకి వచ్చీరాగానే అలిసిపోయిన బుజ్జి నిద్రపోగా, వినాయక్ మాత్రం అనుకున్న కథని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. అర్థరాత్రి 3 గంటలకు బుజ్జిని నిద్రలేపి కథ మౌలికంగా పూర్తిచేశానని వినిపించేశారు. కథ విన్న బుజ్జికి బాగా నచ్చింది. తిండి నిద్ర కనీసం బ్రష్ చేసుకోవడం కూడా మానేసి వినాయక్ కథ అభివృద్ధి చేసే పనిలోనే ఉండిపోయారు. అలా రెండు రోజులు గడిచాకా 58 సీన్లతో ఆది కథని తయారుచేసి ఎన్టీఆర్ కి వినిపించారు. బాగా ఎగ్జైట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమాకి అంగీకరించారు.
బెల్లంకొండ సురేష్ సమర్పకునిగా, నాగలక్ష్మి నిర్మాతగా, బుజ్జి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా ప్రారంభించారు. అయితే ప్రారంభానికి ముందు మళ్ళీ ఎన్టీఆర్ మరో ప్రతిపాదన ముందుకుతెచ్చారు. బూరుగుపల్లి శివరామకృష్ణ తనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ సినిమానే ఆయనతో తీద్దామని ప్రతిపాదించారు ఎన్టీఆర్. అయితే తనని దర్శకుణ్ణి చేసేందుకు బుజ్జి ఎంతో తపించారని, ఇప్పుడు అవకాశం వచ్చాకా ఆయనను వదిలేయలేనని వినాయక్ చెప్పడంతో ఆయన నిజాయితీ నచ్చి ముందు అనుకున్న క్రూతోనే షూటింగ్ కి అంగీకరించారు ఎన్టీఆర్.[2]

చిత్రీకరణ

మార్చు

సినిమా చిత్రీకరణ విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగింది. 65 రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యింది.[2]

విడుదల

మార్చు

ఆది సినిమా మార్చి 28, 2002న విడుదలైంది. సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ కి గొప్ప స్టార్ డం సంపాదించిపెట్టింది. మొదటి సినిమాతోనే వి.వి.వినాయక్ స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు.[2]

పాటలు

మార్చు

ఈ చిత్ర సంగీతం ఎంతగానో విజయవంతమైనది.

  • అయ్యో రామా ఆంజనేయా - బాలు, గోపిక పూర్ణిమ - రచన: భువనచంద్ర
  • చికుచికు బంబం - టిప్పు - రచన: పోతుల రవికిరణ్
  • నీ నవ్వులను నాగమల్లి - మల్లికార్జున్, సునీత - రచన: చంద్రబోస్
  • తొలి పిలుపే - బాలు, చిత్ర - రచన: చంద్రబోస్
  • సున్నుండ తీస్కో - మురళీధర్, రాధిక - రచన: చంద్రబోస్
  • పట్టుకో ఒకటో సారి - మురళీధర్, రాధిక - రచన: చంద్రబోస్

ఇతర విశేషాలు

మార్చు
  • ఎన్.టి.ఆర్., వి.వినాయక్ కాంబినేషన్లలో పెద్ద హిట్ ఈ సినిమా.

మూలాలు

మార్చు
  1. "NTR: ఆ కథ ఎన్టీఆర్‌తో చేస్తానంటే కొడాలి నాని ఒప్పుకోలేదు: వినాయక్‌". EENADU. Retrieved 2022-09-10.
  2. 2.0 2.1 2.2 పులగం, చిన్నారాయణ. "అమ్మ తోడు... రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు!". సాక్షి. Retrieved 10 August 2015. సినిమా వెనుక స్టోరీ - 5