ఉప్పులూరి గణపతి శాస్త్రి

ఉప్పులూరి గణపతి శాస్త్రి ప్రముఖ వేదపండితుడు. ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. హైదరాబాదులో నివాసమున్నారు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయనకు వేదభాష్య విశారద, వేదభాష్యాలంకార, సాంగ వేదార్థ వాచస్పతి, వేదభాష్యాచార్య, ఆమ్నాయ సరస్వతి, కళాసరస్వతి అనే బిరుదులు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన పేరుమీదుగా ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తు అనే సంస్థ ఉంది. వంశపారంపర్యంగా ఆయనకు పిఠాపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసుని పదవి దక్కడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆస్థాన వేదపండితునిగా ఆయనను నియమించుకున్నాయి.

ఉప్పులూరి గణపతి శాస్త్రి

ఖండవల్లి లక్ష్మీరంజనం ఆధ్వర్యంలో తయారయిన సంగ్రహాంధ్ర విజ్ఞానకోశములో యజుర్వేదానికి సంబంధించిన సమాచారాన్ని ఉప్పులూరి గణపతి శాస్త్రి అందించారు.

పి.వి.ఆర్.కె ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఓ సారి అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. అప్పుడు ఆయన గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో వరుణయాగం జరిపించడంతో తిరుమలలో వర్షం పడింది.[1]

ఆయన హైదరాబాదులో ఉండగా వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం నుండి రోజూ పన్నెండు మైళ్ళు నడచి చిక్కడపల్లిలోని వేద సంస్థలో జరిగే గణ స్వస్తి కొరకు వెళ్ళేవారు. శిష్యులతో కలిసి దారంతా వేదాలను వల్లె వేస్తూ వెళ్ళేవారు. కనీసం పాదరక్షలు కూడా ధరించేవాడు కాదు. పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. కానీ వేదంలోని ప్రతి అక్షరం వెనుక భావాన్ని చిన్నపిల్లలకు సైతం అర్థం అయ్యేలా వివరించగల ప్రతిభామూర్తి.

ఆయన అత్యంత నైష్ఠిక బ్రాహ్మణుడైనా అంటరానితనాన్ని ఎప్పుడూ పాటించలేదు. ఇతర కులాల వారిని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో కాదు జన్మసంస్కారంతో వస్తుందని ఆయన అభిప్రాయం. సత్యసాయిబాబా ఆయనమీద ఎంతో గౌరవంతో తన ఆశ్రమమైన ప్రశాంతి నిలయంలో యజ్ఞయాగాదులను నిర్వహించడానికి ఆహ్వానించేవాడు.[2] 1985లో భారతప్రభుత్వం పద్మభూషణ్ బహుమతితో సత్కరించింది. శత వసంతాలు చూసిన ఆయన జులై 17 1989 తేదీన తన భౌతికకాయాన్ని త్యజించారు.[3]

పుస్తకాలుసవరించు

వేదాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన కొన్ని పుస్తకాలను కూడా వ్రాశారు.

  1. వేదసార రత్నావళి

మూలాలుసవరించు

  1. నాహం కర్త: హరి కర్త: - పి.వి.ఆర్.కె. ప్రసాద్ అనుభవాలు
  2. http://www.indusladies.com/forums/snippets-of-life-non-fiction/22430-the-prostitutes-slipper.html
  3. http://srivgvp.in/sriganapathi.asp[permanent dead link]