ఇంగ్లీషు లిటరేచర్ లో ఎలిజీ (Elegy) ఒక కవితా ప్రక్రియ. ఈపదం గ్రీకు సాహిత్యం లోంచి వచ్చింది. గ్రీక్ లో ఎలిగాస్ అంటే శోకం అని అర్ధం. శోకభరితమైన కవిత ఎలిజీ.ఇది మరణించిన వారి పైనే వ్రాయ బడనక్కరలేదు, యుద్ధలనూ, రక్తపాతాలనూ గురించి, రాజకీయ పరిస్థితుల గురించి, తగాదాల గురుంచి కూడా వ్రాయవచ్చును. అది విషాదాన్ని ధ్వనించే ఎలిజాయిక్ (Elegiac) ఛందస్సులో నడిస్తే చాలు, ఏ పద్యమైనా ఎలిజీ అవుతుంది. ప్రాచీనకాలంలో టిర్టియస్ (Tyrtaeus), మిన్మెర్స(Mimnernius), సాలన్ (Solon), వంటి గ్రీకు కవులూ, గాలస్ (Gallus), ఒవిడ్ (Ovid), ప్రాపర్టిస్ (Propertius) వంటి రోమన్ కవులూ వ్రాసిన ఎలిజీ ఈకోవకు చెందినవే.

ఆధునిక సాహిత్యంలో ఎలిజీసవరించు

16వ శతాబ్దం ఇంగ్లాండులో సాంస్కృతిక పునరుజ్జీవనం (Renaissance) ప్రారంభమైనప్పుడు, గ్రీక్ రోమన్ సాహిత్యాలను అధ్యయనం చేసిన వారిద్వారా ఎలిజీ అనే పదం ఇంగ్లీషులోకి వచ్చింది. వచ్చిన తరువాత చాలాకాలం పాటు ఇంగ్లీషు సాహిత్యంలో కూడా ఎలిజీ పరిధి ప్రాచీన గ్రీక్ సాహిత్యంలో ఉన్నంత విస్తృతంగా ఉండేది. 17వ శతాబ్డంలో డాన్ అనే ప్రసిద్ద ఆంగ్ల కవి తను రచించిన ప్రేమ గీతాలను (Love Poems), హేళన కావ్యాలను (Satires), లేఖకావ్యాలను (Epistles) చాలా భాగం ఎలిజీలుగానే పేర్కొనాడు.

18వ శతాబ్దంలో ధామస్ గ్రే రచించిన "ఎలిజీ ఇన్ కంట్రీ చర్చ్ యార్డ్" (Elegy in a country Chruch yard) కూడా ఇలా విస్తృతపరిధిలో వ్యాయబడినది.కాని 16వ శతాబ్దం నుంచీ మరొక వైపు ఎలిజీ శోకకావ్యం గా కూడా ప్రాముఖ్యం గడించుకో సాగింది. 1579లో రిచర్డ్ పుట్టెంహాం (Richard Puttenham) అనే విమర్సకుడు ఎలిజీని దీర్ఘశోకం (A song of long lamentation) గా నిర్వచించాడు. కాలక్రమేణ మిల్టన్, షెల్లీ, ఆర్నాల్డ్ మొదలగు ప్రముఖ కవులు ఎలిజీలను మరణించిన వ్యక్తులపైన వ్రాయటం వలన ఎలిజీ అంతవరకే పరిమితమైనది. ఆధునిక సాహిత్యంలో ఎలిజీ మామూలుగా ఎవరైనా మరణించినప్పుడు వ్రాయబడే కవితాఖండిక, ఆ మరణించిన వ్యక్తి కవికి మిత్రుడైనా కావచ్చు, ఆత్మబంధువైనా కావచ్చు; ఒక ప్రసిద్ద వ్యక్తి లేక జీవతంలో దెబ్బతిన్న ఏ అపరిచితుడైనా కావచ్చును.

తెలుగు సాహిత్యంలో ఎలిజీసవరించు

ఎలిజీ వ్రాసే కవికి ముఖ్యంగా కావలసింది జీవన విషాదాన్ని గురుంచిన స్మృతి, మానవ హృదయావేశాలను బలవత్తరంగా చిత్రించగల శక్తి. ఇంగ్లీషు కవితతో పోలిస్తే పూర్వపు తెలుగు కవితలలో ఇవి తక్కువనే చెప్పుదురు. అంటే అది లేదని కాదుగాని, ఇంగ్లీశ్హు సాహిత్యంలో వలే అదే ప్రధానలక్ష్యం కాదు. తెలుగు సాహిత్యంలో పెద్దన కాలం వరకు ఎలిజీలేదు. అంతకుపూర్వం వ్రాసిన పోతన భాగవతంలో శ్రీకృష్ణ నిర్యాణ వార్తను అర్జునుడు ధర్మరాజుకు చెప్పున పద్యం కొంత ఎలిజీ ధోరణలో ఉన్నా అది కధా సందర్భంలో వచ్చినదే కావున దానిని ఎలిజీ అనరు.శ్రీనాధుడు తన అవసానంలో వ్రాసినా కాశికా విశ్వేశుగలసె వీరారెడ్డి అనే పద్యం కూడా విస్తృత పరిధిలో ఎలిజీ అవుతుంది. కాని ఆధునిక దృష్ట్యా కాదు. ప్రబంధయుగంలో పెద్దన తప్ప మరెవ్వరూ ఎలిజీ వ్రాయలేదనే చెప్పవచ్చును.సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవ రాయలు మరణం తన హృదయాన్ని రగిలించగా ఆయనతో తన సాన్నిహిత్యాన్ని ఆయన తనకు జరిపిన గౌరవాలను తలచుకొని పెద్దన రచించిన ఎలిజీ తెలుగుసాహిత్యానికి అపూర్వమైన ఎలిజీని పెద్దన మనకి బహూకరించాడు.

అటుపై ఆధునిక యుగంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనేమో, ఆధునిక సాహిత్యంలో ఎందరో ప్రముఖ కవులు ఎలిజీలు వ్రాసారు. వీరిలో ముఖ్యంగా విశ్వనాధ సత్యనారాయణ గారి వరలక్ష్మీ త్రిశతి, నాయని సుబ్బారావు గారి మాతృగీతాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చును. విశ్వనాధ వారిది భార్య వియోగంపైన వ్రాసిన ఎలిజీ. నాయని వారిది తల్లిపై వ్రాసిన ఎలిజీ. అటుపై కొంపెల్ల జనార్ధనరావు పై శ్రీ శ్రీ వ్రాసిన ఎలిజీ. అందులో ఒకచోట ఇలా అంటాడు:

ఎన్ని ఆశలు నీమీద పెట్టుకొని
ఎన్ని కలలు నీచుట్టూ పోగు చేసుకొని
అన్నీ తన్నివేస్తావా నేస్తం?

ఇంకోచోట

చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్క్దడికో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి
ఎన్నెన్ని దుస్తరవిఘ్నాలు కల్పించి
కలలకు పొగలనూ కాటుకలనూ కప్పి
శపించిందో, శపించిందో మనల్ని!

ఇంకోచోట

ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వుచనిపోతే
ఏదో నేనూ ఆరుగురు స్నేహితులూ తప్ప!
ఆకాశం పడి పోకుండానే వుంది
ఆఫీసులకు సెలవు లేదు
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది.

      • **** *****

ఎవరి పనుల్లో వాళ్ళు
ఎవరి తొందరలో వాళ్ళు.

అలాగే మరొక పేరొన్న ఎలిజీ డాక్టర్ పి. శ్రీదేవి మరణవార్త విని నాయని కృష్ణకుమారి వ్రాసిన ఏం చెప్పను నేస్తం అన్న గేయం షెల్లీ, శ్రీ శ్రీ ల ఎలిజీలలో వలె ఇక్కడ కూడా కవయిత్రి చనిపోయిన వ్యక్తీ-ఇద్దరూ రచయిత్రులు.

అలాగే దేవరకొండ బాలగంగాధర తిలక్ నెహ్రూ మరణవార్త విన్నాక వ్రాసిన ఎలిజీ.

[1]

మూలాలుసవరించు

  1. * 1966 భారతి మాస పత్రిక- వ్యాసం తెలుగు కవిత్వంలో ఎలిజీ- వ్యాస కర్త శ్రీ పణతుల రామచంద్రయ్య.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎలిజీ&oldid=2607116" నుండి వెలికితీశారు