జయకృష్ణ (ఆగష్టు 18, 1941 - మార్చి 29, 2016) భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు ప్రధానంగా నిర్మాతగా సేవలనందించారు.[1] ఆయన 1978 లో మనఊరి పాండవులుకు నిర్మాతగా కెరీర్ ప్రారంభించి తెలుగులో ఉత్తమ ఫిలిం పేర్ అవార్డును అందుకున్నారు. ఆయన ఇతర సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు (1983), వివాహ భోజనం, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్ళంట, కృష్ణార్జునులు, 420 మొదలగు సినిమాలను తెలుగులో నిర్మించారు. తమిళంలో ఆయన "ఆలవందం" సినిమాను నిర్మించారు.[2] 15 పైగా తెలుగు చిత్రాలు నిర్మించారు. మరో 20కిపైగా డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.[3][4]

కాకిత జయకృష్ణ
జననం
జయకృష్ణ

ఆగష్టు 18, 1941
పశ్చిమగోదావరి జిల్లా, కొమ్మర
మరణంమార్చి 29, 2016
వృత్తినిర్మాత
తల్లిదండ్రులుసత్యనారాయణ, శేషమ్మ
పురస్కారాలుఫిల్మ్‌ఫేర్ అవార్డు (దక్షిణాది)

జీవిత విశేషాలు మార్చు

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి సమీపంలోని కొమ్మర గ్రామానికి చెందిన జయకృష్ణ, తన బావ లైన ఎడిటర్ గోపాలరావు, మేకప్‌మ్యాన్ సురేశ్‌బాబుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. తొలుత కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అటుపైన మేకప్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రయాణం మొదలుపెట్టారు. మేకప్ వృత్తిపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న జయకృష్ణ ఎన్నో మెళకువలు నేర్చుకుని పరిశ్రమకు వచ్చిన ఎనిమిదేళ్లకే చీఫ్ మేకప్‌మ్యాన్ స్థాయికి ఎదిగారు. ‘బంగారు తల్లి’ సినిమా సమయంలో కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడి ఆయన పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా చేరారు. ఆ తర్వాత జయప్రదకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించారు. అటుపై సినీ నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగానూ మారారు. ‘కృష్ణవేణి’, ‘భక్త కన్నప్ప’, ‘అమర దీపం’ తదితర చిత్రాలకు భాగస్వామిగా ఉంటూనే నిర్మాణ నిర్వహణ చేశారు. ప్రముఖ పంపిణీదారు ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగ మూర్తి ప్రోత్సాహంతో 1977లో జేకే మూవీస్ సంస్థను స్థాపించి, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్ తదితరులతో ‘మనవూరి పాండవులు’ నిర్మించారు. దాసరి దర్శకత్వంలో ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’, జంధ్యాల దర్శకత్వంలో ‘ముద్దుల మనవరాలు’, ‘రాగలీల’, ‘వివాహభోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’, క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్రవంతి’ తదితర చిత్రాలను నిర్మించారు.[5]

కెరీర్ మార్చు

కృష్ణం రాజు, జయసుధలకు మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఆయన విద్యార్థి. ఆయన వద్ద మేకప్ ఆర్టిస్టుగా చేరి తరువాత నిర్మాతగా స్థిరపడ్డారు.[6] ఆయన ప్రముఖ సినిమా నటుడు చిరంజీవికి మొట్టమొదటిసారిగా పారితోషకాన్ని (రూ.1116/-) అందించిన నిర్మాత. ఆయన ప్రొడక్షన్ బానర్స్ లో ముద్దు ఆర్ట్ మువీస్, జయకృష్ణ మువీస్ కూడా ఉన్నాయి.[7]

గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా 'దాసు'. సుదీర్ఘ విరామం తరువాత సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై 'ఒక తార' అనే సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ అది తెరకెక్కలేదు. జయకృష్ణ ఒక్కగానొక్క కొడుకు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం జయకృష్ణ జీవితంలో అత్యంత విషాదాత్మక ఘటన.[8]

మూలాలు మార్చు

  1. "Jaya Krishna". IMDb.
  2. "Andhravilas - Telugu cinema news - Telugu cinema - Telugu Movies - Telugu cinema reviews - Telugu movie reviews - Tollywood - Telugu Movies Gossips - Telugu Movie schedules - Telugu Cinema - Telugu Movies - India News - World News - Bollywood - Telugu Movie Songs - Gossips". Andhravilas. Archived from the original on 2011-07-07. Retrieved 2016-03-29.
  3. హరికృష్ణ ఇకలేరు
  4. "Veteran producer Jayakrishna passes away". THE HANS INDIA. 30 March 2016. Retrieved 30 March 2016.
  5. నిర్మాత జయకృష్ణ కన్నుమూత Sakshi March 30, 2016
  6. "Vijay C Kumar - Telugu Cinema interview - Telugu film cinematoghrapher".
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-12-27. Retrieved 2016-03-29.
  8. "చిరుని గుర్తించిన నిర్మాత ఇకలేరు". Archived from the original on 2016-03-31. Retrieved 2016-03-30.

ఇతర లింకులు మార్చు