కాగితం

(కాగితాలు నుండి దారిమార్పు చెందింది)

కాగితం (ఫ్రెంచ్, జర్మన్ Papier; స్పానిష్, పోర్చుగీస్ Papel; ఆంగ్లం Paper; ఇటాలియన్ Carta) ఒక బహుళ ఉపయోగకరమైన పలుచని వస్తువు. ఇవి ముఖ్యంగా వ్రాయడానికి, ముద్రించడానికి, పాకింగ్ కోసం వాడతారు. ఇవి ప్రకృతిలో మొక్కలనుండి లభించే సెల్యులోజ్ లేదా కణోజు పోగులతో తయారుచేయబడుతుంది. వీటిలో వెదురు అన్నింటికన్నా ముఖ్యమైనది. పత్తి, నార లైనిన్, జనపనార, వరి వంటి కూడా ఉపయోగిస్తారు.

కాగితపు దొంతు.

చరిత్ర మార్చు

క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది.[1] ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, ఎడారిలోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత నాగరికతల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక మేక తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. హాన్ వంశపు రాజులు సాహితీ, మత, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు వికసించడానికి ప్రోత్సహించారు. పరిపాలన ప్రయోజనాల కోసం కవిలెల్ని (రికార్డులను) అట్టే పెట్టుకోవడం అవసరమనిపించింది. ఆ కాలం ప్రమాణపత్రాలు పొడుగైన సన్నని కర్రముక్కలపైన, పట్టుగుడ్డ ముక్కలపైన లిఖించబడేవి. కాగితం చైనాలో సా.శ. 105లో కనుగొనబడింది. హూటై చక్రవర్తి వద్ద ఉద్యోగి అయిన చై లున్ దీనిని కనిపెట్టాడు. మల్బెరీ చెట్టు ఆకులు, ఇతర పీచులు, చేపల్ని పట్టే చిరిగిపోయిన వలలు, పాత గుడ్డ పీలికలు, జనపనార చెత్తలతో యితను ఒక కాగితాన్ని తయారుచేశాడు. పట్టుగుడ్డ మీదకంటే అలా చేయబడ్డ కాగితం పైన రాయడం చాలా సులువైంది. తక్కువ ఖర్చుతో ఏ కష్టమూ లేకుండా అది తయారైంది కూడా. అతి ప్రాచీనమైన చైనా కాగితంలో కనబడే ముక్కలు ముతకగా, దళసరిగా నేడు అనిపిస్తాయి.

టి.సైలున్‌ను చక్రవర్తి కానుకతో సత్కరించాడు. క్రొత్తగా కనుగొన్న కాగితం ఉత్పాదక ప్రక్రియకు అతని సహాయ ఉద్యోగి చాలా మెరుగులు దిద్దాడు. హాన్ వంశపు రాజుల కాలంలో వెలువడిన చైనీయ నిఘంటువులో కాగితాన్ని "పీచు చెత్తల చాప" (a mat of refuse fibres) అని నిర్వహించబడింది. చైనీయులకు కాగితం ఉపయోగకరమై చైనా దేశమంతటా ప్రయోగాత్మకమైంది. హాన్ రాజ వంశ కాలంలో ఈ కాగితంతో తయారైన తొలి గ్రంథం "వసంత, శరత్కాలాల వార్షిక సంఘటనలు - వాటిపై ట్సో వ్యాఖ్యానం" అనేది. తరువాతి కొన్ని శతాబ్దాల వరకూ కాగితాన్ని తయరుచేసే ప్రక్రియను చైనీయులు ఇతర దేశాల వారికి గోప్యంగా వుంచారు. సా.శ. 8వ శతాబ్దంలో కాగిత న్రిమాణం గురించి మధ్య ఆసియాకు వెల్లడయ్యింది. అరబ్ బంధనకర్తలు సమర్ఖండ్ వద్ద జరిగిన తలాస్ యుద్ధానంతరం సా.శ.768లో ఈ కాగితం నిర్మాణ రహస్యాన్ని చైనీయుల యుద్ధ ఖైదీల నుండి నేర్చుకున్నారు. సా.శ. 793లో చైనీయ పద్ధతిని అనుసరించి తొలి కాగితం బాగ్దాద్‌లో ఇస్లామియ సంస్కృతికి స్వర్ణయుగమైన కాలిఫ్ హరున్ అల్ రషీద్ రాజ్యంలో తయారైంది. మధ్య తూర్పు (పశ్చిమ ఆసియా) దేశాల అరబ్ ఉత్పాదకుల వద్ద నుండి, స్పెయిన్ దేశం నుండి 11వ శతాబ్దం మధ్య ప్రాంతంలో ఐరూపాలోని ఆగ్నేయ దేశంలోని బైజాంటైన్ సామ్రాజ్యానికీ, ఆసియా మైనర్ దేశాలకూ, తరువాత ఐరోపా ఖండమంతటికీ కాగితం వ్యాపించింది.

కాగితం నిర్మాణం స్పెయిన్‌లో 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ దేశంలో మూర్ అనే ముస్లిం దేశ ద్రిమ్మరులు కాగితం మిల్లులను నెలకొల్పారు. 13వ శతాబ్దంలో ఉత్తర భాగంలో పేపర్ నిర్మాణ యంత్రాంగశాలలు ఇటలీలో స్థాపించబడ్డాయి. 14వ శతాబ్దంలో ఫ్రాన్స్, జర్మనీలో కూడా ఈ యంత్రాంగాలు బయలుదేరాయి. ఐరోపాలో చాలా దేశాల్లో రాయడానికి కాగితం విరివిగా వాడబడింది. శతాబ్దాలు గడిచేటప్పటికి కాగితం నిర్మాణంలో వివిధ ప్రక్రియలు చాలా యాంత్రికమయ్యాయి. కాని దాని మౌలిక ప్రక్రియ మాత్రం మారలేదు. తడి పీచు, కర్ర, గుడ్డ పీలికలు మొదలైనవి మెత్తటి ముద్ద చేయబడి తరువాత పీచురేకుగా తయారవుతుంది. అది బాగా ఒత్తబడి దానిలో నీటిని వెలువరించాక దానిని ఆరబెట్టి వివిధ రసాయనిక పదార్ధాలతో అది వ్యవహరించబడ్డాక ఏ రకం కాగితం కావాలో దానికి అవసరమైనట్లు విభిన్న ప్రక్రియలలో అది పంపబడుతుంది. ఈ పీచుకు కర్ర ముఖ్యాధారమైనా, అత్యధికమైన గట్టితనానికీ, మన్నికకు స్థిరతకు గుడ్డ పీలికల నార యింకా ఉపకరిస్తోంది. గడ్డి, చెరుకుపిప్పి, వెదురు, జనపనార, గోగునార కూడా దీని వాడుకలో ఉన్నాయి. 1450లో ముద్రణా యంత్రం కనుగొనబడినప్పటి నుండి కాగితం యొక్క ఆవశ్యకత చాలా పెరిగింది. మొట్టమొదటి విజయవంతమైన కాగిత యంత్రశాల ఇంగ్లాండులో 1859లోనూ, అమెరికాలో 1690లోనూ ఫిలడెల్ఫియాకు చెందిన విలియం రిటెన్ హౌస్ చేత నెలకొల్పబడ్డాయి.

నికొలస్ లూయీ రాబర్ట్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త 1798లో మొట్టమొదటి కాగిత నిర్మాణ యంత్రాన్ని నిర్మించాడు. దీనిని కనుగొనడానికి ముందు కాగితాన్ని చేతితో తయారుచేసేవారు. రాబర్ట్ పనిని ఫ్రెంచ్ ప్రభుత్వం గుర్తించి అతనికి ప్రత్యేక హక్కును ఇచ్చింది. హెన్రీ, సీలీ ఫౌర్డ్రినియర్ సోదరులు ఇంగ్లాండులో 1803లో దీన్ని మెరుగుపరిచారు. 1875 నాటికి ఫొటో మలచబడే కొత్త ప్రక్రియలో యంత్రం చేత పూతపూయబడిన కాగితం అర్థ స్థాయిలలో వాడబడింది. నేడు ఫౌర్డ్రినెర్ యంత్రంలో దాదాపు కాగితమంతా తయారవుతుంది. కాగితం, గుజ్జు, కాగిత వస్తువులను తయారుచేసే ప్రముఖ దేశాలు కెనడా, రష్యా, అమెరికా, స్కాండినేవియా దేశాలు. ఇండియాలో కర్రకు కొరత ఉండడం వలన పచ్చగడ్డి, వ్యర్ధమైన కాగితం, తాళ్ళు, బియ్యం ఊక, ఎండుగడ్డి, గుడ్డ పీలికలు యింకా యితర వ్యవసాయక వ్యర్ధ పదార్ధాలతో కాగితం తయారవుతోంది. మన దేశంలోని అనేక కాగిత యంత్రాగారాలు కాగితపు గుజ్జుని దిగుమతి చేసుకుని, కాగితాన్ని తయారుచేస్తాయి.

ఉపయోగాలు మార్చు

  • చేతివ్రాత లేదా ముద్రించిన కాగితం ఒకరకమైన శాశ్వతమైన నిదర్శనము. ఉదా: సర్టిఫికేట్లు, స్టాంపులు, కోర్టు పత్రాలు మొదలైనవి.
  • కొన్ని రకాల కాగితం చాలా విలువైనది. ఉదా: ధనం, బ్యాంకు చెక్కు, టికెట్ మొదలైనవి.
  • కొన్ని రకాల కాగితం చాలా విలువైనది. ఉదా: పుస్తకాలు, వార్తాపత్రికలు, చిత్రపటాలు మొదలైనవి.
  • కాగితం పాకింగ్ కోసం ఉపయోగిస్తారు. ఉదా: కాగితపు సంచి మొదలైనవి.
  • కొన్ని రకాల కాగితం శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి. ఉదా: కాగితపు రుమాలు
  • ఇతర రకాల ఉపయోగాలు. ఉదా: లిట్మస్ కాగితం

కాగితం రకాలు మార్చు

కాగితం తయారీ మార్చు

కాగితం తయారీకి ముడిపదార్ధాలు సెల్యులోజ్, పీచు, నార, వాడతారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కాగితం&oldid=3676221" నుండి వెలికితీశారు