కారము ఒక ప్రధానమైన రుచి. ఇది షడ్రుచులులో ఒకటి.

కారం తింటే పొట్టలో పుండు పుడుతుందనే గాథ ఒకటి ఆధ్రేతర రాష్ట్రాలలోనూ – ముఖ్యంగా తమిళనాడులో – ఇతర దేశాలలోనూ చలామణీలో ఉంది. ఇది ఎంత వరకు వచ్చిందంటే తమిళ సోదరులు చెప్పిన మాటలని విని కాబోలు తెలుగు డాక్టర్లు కూడా సై అంటే సై అంటున్నారు. ఇవన్నీ పునాదులు లేని పేకమేడలని డాక్టర్‌ గ్రేం అంటున్నారు. ఈయన టెక్సస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగరంలో ఉన్న బేలర్‌ కాలేజ్‌ అఫ్‌ మెడిసిన్‌ లో ఒక పేరు మోసిన ఘనాపాటీ. టెక్సస్‌ మెక్సికో దేశపు సరిహద్దులో ఉంది కాబట్టి కాబోలు మెక్సికో దేశపు కారం తినే అలవాటు టెక్సస్‌లోనూ కనిపిస్తుంది. అందుకని ఈయనకి కారం అంటే ఇష్టమో ఏమో నాకు తెలియదు కాని ఈయన కూడ ఈ పుకారులూ వదంతులూ విన్నాడు. విసిగెత్తే వరకూ విన్నాడు. తాడో, పేడో తేల్చేద్దామని ఒక ప్రయోగం చేసేడు.

ఆరోగ్యంగా ఉన్న మనుష్యులని కొంతమందిని కూడ గట్టి వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టేడు. అందులో ఒక జట్టుకి కారం ఏమీ లేని చప్పిడి తిండి పెట్టేడు. రెండవ జట్టుకి అదే చప్పిడి తిండిలో అరడజను ఏస్పిరిన్‌ మాత్రలు కలిపి పెట్టేడు. మూడవ జట్టుకి బాగా కారం కలిపిన తిండి పెట్టేడు. మరునాడు ఒక బుల్లి విడియో కేమెరాని ఒక గొట్టానికి తగిలించి ఆ గొట్టాన్ని ఈ మూడు జట్ల వాళ్ళ పొట్టలలోకి దింపి క్షుణ్ణంగా పొట్ట గోడలని పరిశీలించేడు. ఏస్పిరిన్‌ తిన్న రెండవ జట్టు వాళ్ళ పొట్ట గోడలలో చిన్న చిన్న చిల్లుల గుండా రక్తం స్రవించడం చూసేడు తప్ప కారం తిన్న వాళ్ళ పొట్టలు, చప్పిడి తిండి తిన్న వాళ్ళ పొట్టలు ఒక్క లాగే, ఏ దోషం లేకుండా ఉన్నాయిట.

ఇలాంటి ప్రయోగమే భారత దేశంలో కూడ ఎవరో రెండు జట్ల మీద చేసేరుట. ఓకరి తిండిలో మిరప పొడి బాగా జల్లేరుట. మరొక జట్టు తిండిలో మిరప పొడి పొడ కూడా లేదుట. ఈ రెండు జట్ల మధ్య ఏమీ తేడా కనిపించ లేదుట.

ఈ రెండు ప్రయోగాల వల్ల తేలిందేమిటంటే మిరపకాయల వల్ల పొట్టలో పుండు పుట్టదని.[1] నేను కూర్చున్న కుర్చీ లోంచి కదలకుండా స్పురణ ప్రయోగం (థాట్‌ ఎక్స్పరిమెంట్‌) ఒకటి చేసేను. దాని సారాంశం ఇది. సర్వ సాధారణంగా వేడి దేశాలలో ఉన్న ప్రజలు కారం ఎక్కువ తినడం నేను గమనించేను. వేడి దేశాలలో ఉన్న వాళ్ళకి చర్మం నల్లగా ఉండడం వల్ల ఉపయోగం ఉన్నట్లే, కారం తినాలనే కోరిక ఉండం వల్ల కూడా మనుగడకి పనికొచ్చే లాభం ఏదైనా ఉందేమో? డార్విన్‌ ని అడిగి చూడాలి.[2]


ఒక వివరణ:

దీనికి ఒక చక్కని వివరణ ఒకసారి నేను టెలివిజన్ కార్యక్రమములో విన్నాను - వేడి ప్రాంతాలలో ప్రజలు కారము ఎక్కువగా తినడం వల్ల తప్పనిసరిగా మంచినీరు ఎక్కువగా త్రాగుతారు. ఇది వారికి చాలా అవసరం. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుదు మన శరీరం లోంచి నీరు ఎక్కువగా ఆవిరి అయి పోతు ఉంటుంది.

  1. మిరపకాయల కారం వల్ల ఉపయోగాలు
  2. కారం వల్ల ఉపయోగం
"https://te.wikipedia.org/w/index.php?title=కారము&oldid=2203982" నుండి వెలికితీశారు