కె.శివారెడ్డి

తెలుగు రచయిత

కె.శివారెడ్డి సుప్రసిద్ధ వచన కవి. అభ్యుదయ కవి. విప్లవకవి. 1943, ఆగష్టు 6 వ తేదీ గుంటూరు జిల్లా లోని కార్మూరివారిపాలెం గ్రామంలో జన్మించాడు. కూచిపూడి లోని హైస్కూల్‌లో ఎస్.ఎస్.ఎల్.సి దాక చదివాడు. తెనాలి లోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో పి.యు.సి., డిగ్రీ, ఆంధ్రయునివర్సిటీలో ఎమ్.ఏ. (ఆంగ్లం) చదివాడు.[1] 1967 నుంచి వివేకవర్థిని కళాశాల హైదరాబాదులో లెక్చరర్‌గా పనిచేసి 1999లో ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు[2]. 2006 బుక్‌ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరపున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా వెళ్లి వివిధ నగరాలలో, వివిధ సమావేశాలలో కవిత్వం వినిపించాడు. తన విప్లవకవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు. ఈయన కవితలు సుదీర్ఘంగా వుంటాయి. పునరుక్తుల్ని కూడా బాగా కలిగి వుంటుంది. సామాజిక అంశాల్ని ఆయన పదేపదే ఆలోచించి కవితాబద్దం చేస్తాడు. వేకువ అనే త్రైమాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు.

కె.శివారెడ్డి
జననంకె.శివారెడ్డి
(1943-08-06) August 6, 1943 (age 79)
India కారుమూరివారి పాలెం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
ప్రసిద్ధికె.శివారెడ్డి
మతంహిందూ
తండ్రివెంకట సుబ్బారెడ్డి
తల్లితులశమ్మ
హైదరాబాదులో 2012 డిసెంబరు 29న పూర్తి రచనల సంపుటాల పుస్తక విడుదల కార్యక్రమంలో శివా రెడ్డి

రచనలు[3]సవరించు

 1. రక్తంసూర్యుడు (1973) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 2. చర్య (1975) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 3. గాథ
 4. ఆసుపత్రిగీతం (1976) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 5. భారమితి (1983) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 6. ఆమె ఎవరైతే మాత్రం (2009) - పాలపిట్ట బుక్స్
 7. వృత్తలేఖిని (2003) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 8. నేత్ర ధనస్సు (1978) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 9. మోహనా! ఓ మోహనా! (1988) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 10. అజేయం (1994) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 11. నా కలల నది అంచున (1997) -ఝరీ పొయెట్రీ సర్కిల్
 12. వర్షం వర్షం (1999) -ఝరీ పొయెట్రీ సర్కిల్
 13. జైత్రయాత్ర (1999) - శివారెడ్డి మిత్రులు హైదరాబాదు
 14. కవిసమయం (2000) - సాహితీమిత్రులు విజయవాడ
 15. గగనమంత తలతో
 16. అంతర్జనం (2002) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 17. పొసగనివన్నీ (2008) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 18. అతను చరిత్ర (2005) - ఝరీ పొయెట్రీ సర్కిల్
 19. శివారెడ్డి పీఠికలు (సంకలనకర్తలు: గుడిపాటి, పెన్నాశివరామకృష్ణ) (2014) - పాలపిట్ట బుక్స్
 • ఇతని కవితాసంపుటాలన్నీ శివారెడ్డి కవిత పేరుతో 3 వాల్యూములలో సమగ్రంగా వెలువడ్డాయి.
 • మోహనా! ఓ మోహనా! ఇంగ్లీషు భాషలోకి, అంతర్జనం కన్నడ భాషలోను అనువదించబడ్డాయి.

అవార్డులుసవరించు

 • కబీర్ సమ్మాన్‌ (జాతీయ పురస్కారం) - (2017, నవంబర్ 10న భోపాల్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా) ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు కవి శివారెడ్డి.[4]
 • ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు - 1974 రక్తసూర్యుడు కవితా సంకలనానికి.
 • తెలుగు యునివర్సిటీ అవార్డు
 • విశాల అవార్డు
 • కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం -1990 లో మోహనా! ఓ మోహనా! కవితా సంకలనానికి.
 • సరస్వతీ సమ్మాన్‌’ 2016లో ఆయన రాసిన ‘పక్కకు ఒత్తిగిలితే’ అనే కవితా సంపుటిని పురస్కారానికి ఎంపిక చేశారు.[5]

రచనల నుండి మచ్చుతునకసవరించు

ఆమెకలదు
ఏం చేస్తావు ఆమెని
ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా
నీ రెండు కళ్లను పీకి
ఆమె అరచేతుల్లో పెట్టగలవా
ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న
ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా
ఏం చేస్తావు ఆమెని
నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా
గుండెలో విరిగిన ముల్లును
మునిపంటితో బయటికి లాగగలవా
భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న
ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా
చిన్నపిల్లలా భుజానెక్కించుకుని
విశ్వమంతా ఊరేగించగలవా
ఏం చేయగలవు నువ్వు
చెదిరిన ముఖంగలవాడివి
చీలిన నాలుకలవాడివి
తలాతోకా తెలియని
మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి
రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను
ఛేదించగలవా చదవగలవా
చిరుమువ్వల పువ్వులు ధరించి
తిరుగుతున్న ఆమెను వినగలవా
వీనులతో చూడగలవా
ఆమెనేం చేయగలవు
‘అడవి ఉప్పొంగిన రాత్రి’లాంటి ఆమెను
అందుకోగలవా అనువదించగలవా
ఆరుబయట వెన్నెట్లో
అమోఘంగా చలించే ఆమెను
తాకగలవా, తాకి తరించగలవా -
ఆమె ముందొక శిశువై
దిగంబరంగా నర్తించగలవా
ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా
ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా
నీ అస్తిత్వాన్ని మర్చిపోయి
ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా
ఏం చేయగలవు
ఏం చేయలేని వెర్రిబాగులాడా
వెదకటం తెలియాలిరా
మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా
నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను
ఆమె రక్షించగలదు
ఆమె కలదు, నువ్వు లేవు.
(ఆమె ఎవరైతే మాత్రం కవితా సంకలనం నుండి)

మూలాలుసవరించు

 1. [1] Archived 2014-03-22 at the Wayback Machine తెలుగు పొయెట్రీ
 2. [2][permanent dead link] కదిలించే కలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
 3. [3] Archived 2016-03-07 at the Wayback Machine పొయెట్రీ ఇంటర్నేషనల్
 4. ఆంధ్రజ్యోతి (7 November 2017). "ప్రముఖ కవి కె.శివారెడ్డికి జాతీయ పురస్కారం". Retrieved 2 December 2017.
 5. "కవి శివారెడ్డికి 'సరస్వతీ సమ్మాన్‌'".