కొలిమంటుకున్నది

కొలిమంటుకున్నది ప్రముఖ రచయిత అల్లం రాజయ్య విప్లవ పోరాట నేపథ్యంలో రచించిన నవల

నవల నేపథ్యం మార్చు

1971లో ఆంధ్రదేశంలో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, కె.వి.రమణారెడ్డి వంటి పేరొందిన కవిరచయితలు ఆ సంఘానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుంచి అనేకమంది కవులు, రచయితలు విప్లవ నేపథ్యాన్ని సాహిత్యీకరించడం ప్రారంభించారు. వాటిలో సింహభాగం కవిత్వానిదే ఐనా కథలు, నవలల్లో కూడా ఈ భావజాలం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలోనే వచ్చిన అల్లం రాజయ్య తొలి నవల కొలిమంటుకున్నది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన అల్లం రాజయ్య అప్పటికే కొన్ని కథలు రాసి ఉన్నారు. 1970 దశకంలోని కల్లోల తెలంగాణ ప్రాంతాన్ని రూపుకట్టించేందుకు నవలలో ఆయన ప్రయత్నం చేశారు.
దానికి కాస్త ముందుగానే తెలంగాణా ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో విప్లవ భావాలు వ్యాపించడం ఆరంభమైంది. విప్లవ కమ్యూనిస్టుల సారధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉధృతంగా పోరాటం సాగుతున్న రోజులు. బెంగాల్ లోని నక్సల్బరీ తరువాత శ్రీకాకుళం, ఆపైన తెలంగాణలో ఆ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటిదాకా గ్రామంపై అధికారాన్ని చెలాయించిన దొరలందరూ ఉద్యమధాటికి తట్టుకోలేక పల్లెను వదిలి పట్టణానికి వలసపోయారు. వారి పొలాలన్నీ రైతులు దున్నుకోవడం ప్రారంభించారు. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు నక్సలైట్లకూ ప్రభుత్వానికీ హోరాహోరీగా పోరాటమూ జరుగుతోంది. వందలమందిని అరెస్టు అయ్యారు. డజన్లకొద్దీ హతులయ్యారు.
ఈ రాజకీయ, సామాజిక నేపథ్యంలో రచించిన నవల కొలిమంటుకున్నది.[1]

ఇతివృత్తం మార్చు

కథాకాలం, నవలారచన కాలం కూడా 1974-79 మధ్యలోనిది. కథా ప్రాంతం ఆదిలాబాద్-కరీంనగర్. జీవితం తెలంగాణలోని అట్టడుగు వ్యవసాయదార్ల ఇక్కట్లు, నిస్సహాయ పరిస్థితులు. కొలిమంటుకున్నది నవలలోని పరిస్థితులు విడిగా చూస్తే చాలా సామాన్యమైనదిగా అనిపిస్తుంది.
సర్సింహం చిన్న చెల్క ఉన్న బక్క రైతు. బాయి నీళ్లతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న నర్సింహంకి ఊరికి కరెంటు రావడం ఆశ పుట్టించింది. కోమటాయన దగ్గర అప్పు చేసి నీళ్ళు తోడుకునే ఇంజన్ కొనుక్కుని బిగించాడు. కరెంటు వాళ్ళతో తంటాలు పడ్డాక, స్తంభాలు పాతి వైరుబిగించారు. కరెంటు వాళ్ళతో తంటాలు పడ్డాక, స్తంభాలు పాతి వైరు బిగించారు. ఇక కనెక్షన్ ఇవ్వాలి. అది మిర్చి పంట మంచి అదును మీద ఉన్న సమయం. నీరు పంటకు ప్రాణాధారం. నీరు అందకుంటే పంట నాశనం అవుతుంది.
వసతులన్నీ ఉన్నా, ఆ ఊరి దొర ప్రతాపరెడ్డికి అదనంగా నీరు కావాలి. కరెంట్ వాళ్ళతో కుమ్మక్కయి, తన అధికారానికి తిరుగులేదన్నట్టు, రాత్రికి రాత్రి నర్సింహం పొలంలోని స్తంభాలు, వైరు పీకించి తన వందల ఎకరాల పొలానికి అమర్చుకొన్నాడు.
విషయం గ్రహించిన నర్సింహం తిరగని వ్యక్తి లేడు, చెయ్యని ప్రయత్నం లేదు. చిన్నదొర ముకుందరెడ్డి దగ్గరకి, పట్వారి దగ్గరకి, పోలీసుల దగ్గరకి, కరెంటు వాళ్ల దగ్గరకి, కాళ్లల్లో సత్తువ నశించే వరకు, తిండీతిప్పలు లేకుండా తిరిగాడు. ఒక్కరూ అతనికి సాయం చేయలేదు. నీదే న్యాయం అన్నవారూ లేరు. అందరికీ ప్రతాపరెడ్డి అంటే భయం. అతని డబ్బుకు, అధికారానికి లొంగినవారే వారంతా. అన్యాయమని తెలిసినా ఏం చెయ్యలేని స్థితి. మనసు కుతకుతలాడుతున్నా చివరికి ఆ ప్రతాపరెడ్డి దగ్గరకే వెళ్ళి "నీ బాంచెను"(బానిసను) అంటూ కాళ్ళావేళ్ళా పడ్డా ఆయన ఆగ్రహమే తప్ప అనుగ్రహం దక్కలేదు.
నర్సింహాన్ని మరో రకంగా దెబ్బతీయాలని ఎంకమ్మని భయపెట్టే నర్సింహం ఆమెను బలాత్కారం చేశాడని తప్పుడు పంచాయితీ పెట్టి, తప్పుగా 500రూపాయలు జరిమానా కట్టమన్నారు. నర్సింహం కట్టనందుకు తన్నారు. అయినా దొర అక్కసు తీరలేదు. తనవాళ్లతో ఇంజన్ దొంగతనం చేయించాడు. నర్సింహం పంట తగులపెట్టించాడు. నర్సింహాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడు. ఇంజన్ కోసం కోమటి దగ్గర తెచ్చిన అప్పును తప్పుడు వడ్డీ లెక్కలతో కలిపి నర్సింహంను భూమిలేని వాణ్ణి చేసింది. మోసంగా కోమటి కాజేసిన ఆ పొలాన్ని ప్రతాపరెడ్డి భయపెట్టి తనకి అనుకూలమైన ధర ఇచ్చి తన పొలంలో కలిపేసుకున్నాడు. గ్రామం అంతా తన సొంతం.
పొలంలో పోగొట్టుకొని, అన్ని రకాలుగా అన్యాయాల పాలైన నర్సింహం రైతు నుంచి కూలీగా మారాడు. అతను, అతని భార్య, కూతురు పట్టెడు తిండి కోసం ప్రతాపరెడ్డి పొలంలో ఒళ్ళు విరుచుకుని పనిచేస్తే, పాత పగని మనసులో పెట్టుకుని కూలీ ఇవ్వక, "నీ దిక్కున్న చోట చెప్పుకో" అన్నాడు. అది చూసి నర్సింహంతోటి వాళ్లు దొరకి ఎదురు తిరగకపోయినా, ఆ అన్యాయాన్ని నర్సింహం ఒక్కడిదిగా భావించ లేదు. తమలో తామే బాధపడ్డారు. దొరను అన్ని రకాలుగా తిట్టుకొన్నారు. పులి మీద పుట్రలా ఈ సంఘటన వెనుకే, దొర కొట్టిన దెబ్బలకి రాయపోశడు చచ్చిపోయాడు. వాడు చేసిన తప్పల్లా ఆకలికి ఆగలేక నాలుగు గింజలు తినటమే. చంపిందే కాక, వాడు బాయిలో పడి చచ్చాడన్న అబద్ధం ఒకటి.
అది చూసిన ఊరి జనానికి సహనం చచ్చిపోయింది. ఉక్రోషం ఆవేశంగా మారింది. దొర గడీ మీదకి దండెత్తారు. వీళ్లకి చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు, రైతు సంఘం వాళ్ళు తోడయ్యారు.
దొర గడీ నాశనం చేశారు. అతని అధికారాన్ని బద్దలు కొట్టారు. ఎందరో చచ్చినా వాళ్లు వెనకాడలేదు. ఆడ, మగ, చిన్న, పెద్ద భేదం లేని ఉప్పెన అది. కొద్ది సేపైతే దొర నశించేవాడే. కానీ కబురందిన పోలీసులు వచ్చారు. దొరకి అండగా నిలిచారు. అందినవాళ్ళని అందినట్టు పోలీసువేన్లోకి ఎక్కించారు.
నర్సింహం, బొత్తయ్య, చెంద్రయ్య, ఆనందం లాంటి కీలకవ్యక్తులు పోలీసులకు దొరక్క తప్పించుకున్నారని తెలిసి, వారి కొత్త శక్తికి జడిసి ప్రతాపరెడ్డి కుటుంబంతో సహా పట్టణానికి మకాం మార్చాడని నవల ముగుస్తుంది.[2]

శైలి-శిల్పం మార్చు

పేదవాళ్ళ మీద ధన, మాన, ప్రాణ దౌర్జన్యం, భూ కామందులు, దొరలు.. ఇలా వేర్వేరు ప్రాంతాల కథలు 1979నాటికే వచ్చాయి. కొలిమంటుకున్నది నవల ప్రచురణ కాలం నవంబర్ 1978 నుంచి జూలై 1979. పుస్తకప్రచురణ కాలం 1979. కథగా ఇది స్వల్ప భేదాలతో ఇదివరకటిదే అనిపిస్తుంది. ఐతే కథావస్తువు రీత్యా విశిష్టతను సాధించింది.
నర్సింహం కథలోని బాధ జాలిగా కాక వ్యవస్థకు సంబంధించి మౌలికప్రశ్నలు రేకెత్తిస్తుందని నవలా హృదయం పుస్తకంలో రామమోహనరావు విశ్లేషించారు. కొలిమంటుకున్నది నవలలోని జనం భాష, వారి నిస్సహాయ ఆవేదనను రూపుకట్టించిన తీరు, పైన చెప్పిన భావాలకు ప్రాణం పోసి మన ముందు ప్రశ్నలవుతాయి అంటారాయన. నాగరికత, నవీన ఆవిష్కరణలు ముందుగా ఎవరికి మేలు చేస్తాయో చెప్పే అంశం కథాంశంలోని భాగం.

ప్రభావం మార్చు

కొలిమంటుకున్నది మొత్తం కరీంనగర్ జిల్లా మాండలికంలో రాయబడిన నవల. ప్రచురణ పొందిన కొత్తలో మాండలిక రచనల ప్రయోజనం గురించి పెద్ద చర్చ సాగింది. తెలుగులో మాండలిక రచనలు విస్తృతంగా రావడానికి దోహదం చేసిన నవలగా కొలిమంటుకున్నది నవలకి విశిష్ట స్థానం ఉందని సాహితీవేత్తలు గుర్తించారు.

ప్రాచుర్యం మార్చు

కొలిమంటుకున్నది నవలకు ఉద్యమ నేపథ్యం అమరడంతో చాలా ప్రాచుర్యం పొందింది. చదువుకోవడానికే కాక శ్రవ్యనవలగా విశిష్టత సాధించుకున్న నవల ఇది. ఈ నవలని రాజయ్య తదితర రచయితలు కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, రాత్రిపూట మీటింగులు పెట్టి మరీ వినిపించేవారు.

మూలాలు మార్చు

  1. వి.రాజారామమోహనరావు రచించిన నవలాహృదయంలో కొలిమంటుకున్నది పరిచయం:పేజీలు.25, 26
  2. అల్లం రాజయ్య రచించిన కొలిమంటుకున్నది నవల

ఇవి కూడా చూడండి మార్చు

.