కోటేశ్వరదాసు ఆంధ్ర ప్రాంత వాగ్గేయకారుడు. ఎన్నో భక్తి కీర్తనలను రచించి ప్రచారం చేసాడు. ఈయన ప్రకాశం జిల్లా లో గల పెళ్ళూరుసీమ నందు 1870 ప్రాంతంలో జీవించారు. ఈయన ఇంటి పేరు తెలియదు. వెలుగోటి ప్రభువులేలిన వెంకటగిరి జమీందారీలోని ఒక చిన్న ఊరు పెళ్ళూరుసీమ. ఆ ఊరి రామాలయము నందు నిత్యం సాయంవేళ ప్రొద్దుపోయేవరకూ రామభజన చేస్తూండేవారు. అక్కడే ఈయన రామభక్తి ప్రచారం చేసిన మహానుభావుడు. ఈయన బ్రహ్మచారి, భక్తి ఉద్యమ కర్త, తాత్వికుడు, చాలా రామ కీర్తనలు రాసినట్లుగా ప్రతీతి. ఈయనను భక్తులు దేశికేంద్ర స్వామి గా పిలిచెడివారు. కాశీ ప్రయాగాది పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చి, స్వగ్రామంలో శివాలయాన్ని నిర్మించి, శివప్రతిష్ఠ చేసి, ఉత్సవాదులు జరిపించినారు. ఈ తిరునాళ్ళు సందర్భంలో తన ప్రియ శిష్యుడు అయిన మన్నేపల్లి కోటీశ్వర కవి చేత శివ కృతులు గానం చేయించేవారు.

కోటేశ్వరదాసు రామకీర్తనలు

మార్చు

దాసుగారి రచనలలో రామకీర్తనలు, శివ కీర్తనలు ఉన్నాయి. కృష్ణలీలలు (శృంగార పదముల), తత్వములు కూడా ఉన్నాయి.

కొన్ని రామకీర్తనలు:

  • రామ నా మొరాలంకించవేమి

నెరమేము తెల్పు
కొరవేడితేను కరుణ జాడకున్న
వాడవయ్య ||రామ||

భారమనుచు మదికి దోచెనా-
పరుడనుచు నీ
భావమనను దలచు యోచనా-
ఘోరమైన పాతకములు
పారద్రోలు వారీ భువిని
వెరెలేరు గదర ఎవరివాడ నౌదు
సారసాక్ష! ||రామ||

నిన్నె చాల నమ్మినానురా
నన్నేల నీకన్నపరులు
యిలను సున్నరా!

మున్ను తలచుకొన్న వారలెన్న
రాని సుఖముల-చే
కొన్నవారితోడ గూర్చుమన్నవాడ
కన్నతండ్రి! ||రామ||

ఏమిసేతు ఏమనందురా
శ్రీనాధ మనసు
కేమి దోచకున్న దేమిరా!

మోదమలర నీదుపాద సేవ చేసెదను
ఇనకులాధి నాధ-ఆదరించు వాడ
నీవే వేదవేద్య! ||రామ||

దాసజనుల గాసిమాంపవా
యిలుపావులూరి వాస శౌరి
మోసగింతువా!
భాసురముగ నేలు మనుచు
దోసిలొగ్గినాడ-శ్రీని
వాస-చిద్విలాస-కోటయ
దాసపోషక-భాసుతాధిప!
రామ-నా మొరాలకించవా!


  • ఎక్కడ చూచిన రాముడొక్కడే

నిక్కముగను మనసా, మనసా!
మక్కువతో శ్రీహరిపద భజనము
స్రుక్కజేయు మనసా, మనసా!

పల్లవి||
చక్కని శ్రీరఘువీరుని దలచిన
చిక్కులెల్లదీరు
నీ వెక్కన పడకను గ్రక్కున
సామిని మొక్కి మదినిగోరు ||మనసా||

మందరధరు నకు వందనమని
యానందించవే మనసా-
సందేహము లేకను గోవిందుని
పొందు గనవె-మనసా, మనసా ||మనసా||

సతతము మదిలో పతిత పావనుని
స్తుతి చేయకయున్నా
మతిహీనులకును నతులితముగ
సద్గతి గల్గుట సున్నా ||ఎ||

మరియుచు నదులకు పరుగిడి
మునిగిన దురితము లిడలేదు
పరమ పురుషునకు ప్రణమిల్లిన భువి
తిరుగుట పనిలేదు ||ఎక్కడ||

సరసిజోదరుని వరకధ లెప్పుడు
మరివక వినరాదా-
అరమర లేకను సిరివరునకు
దాసోహం బనరాదా ||ఎక్కడ||

పంకజనాభుని సంకీర్తన
యమకింకరులను కొట్టు-
శంకలేక భవసంకటములు
మొదలంట కొట్టు- మనసా-మనసా ||ఎక్కడ||

అలవైకుంఠుని వలగొని పలుమరు
విలసిల్లగ రాదా-
యిలలోపల యిలపావులూరి
శ్రీ నిలయుని గనరాదా-మనసా ||ఎక్కడ||

అండపిండ బ్రహ్మాండములన్నియు
నిండియున్నవాడు
ఖండితమగు కోటేశ్వరు కభయము
లిచ్చి బ్రోచినాడు-మనసా-మనసా||
ఎక్కడ చూచిన రాముడొక్కడే!!

ఆనందభైరవి రాగం:

  • రామా నీ సేవ జేసెదను

పరంధామ-పరుల గావుమని వేడలేను!

దశరధ తనయ-నీవేనా-దుర్దశ
బాపకున్న నే దరిజేరగలనా ||రా||

పరుడని విడనాడితేను-నన్నరసి బ్రోచేటి
వారలెవరూ యీ ధరను ||రా||

దురితము లెడ బాయలేను-ఘోర నరకములో
బడి భరియింపలేను ||రా||

వెరవు మరపు దీర్చలేవా-భక్తవరుల
రక్షించేటి దొరవీవే కావా ||రా||

లలిత సద్గుణ దివ్యా భరణా
యిల్పావులూరి పురవర సీతారమణా! ||రా||

నిటల తటాక్ష సన్నుత-కోటేశ్వరదాస
పాలక-ఘనపుణ్య చరితా!

రామా-నీ సేవ జేసెదను-
పురంధామ-పరుల గావుమని వేడలేను!

మూలములు

మార్చు
  • 1972 భారతి మాసపత్రిక-వ్యాసము కోటేశ్వరదాసుగారి అముద్రిత రామకీర్తనలు- వ్యాస కర్త శ్రీ గిరీంద్ర.