కోట వీరాంజనేయశర్మ ప్రముఖ శతావధాని, ఆశుకవి[1].

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1913, అక్టోబరు 18వ తేదీన ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), మార్టూరు మండలం, నాగరాజుపల్లి అనే గ్రామంలో హనుమాయమ్మ, గురువంభొట్లు దంపతులకు జన్మించాడు. ఇతడిని ఇతని పెద్దనాన్న కోట రామయ్యశాస్త్రి దత్తత తీసుకున్నాడు. వీరాంజనేయశర్మ బాల్యంలో సంస్కృతాంధ్రాలలోని కావ్యాలను, వ్యాకరణాన్ని అధ్యయనం చేశాడు. మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతడు కొంతకాలం కాంగ్రెస్ వలీంటీరుగా ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. తరువాత కొంతకాలం ప్రైవేటు వ్యాపారసంస్థలలో గుమాస్తాగా పనిచేశాడు. కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ మేనేజరుగా పనిచేశాడు. తరువాత ఆరాధన పత్రికకు సహాయసంపాదకుడిగా ఉన్నాడు.

రచనలుసవరించు

ఇతడు ఈ క్రింది గ్రంథాలను రచించాడు.

 1. చిత్రాశ్వీయము
 2. చిరంజీవి (నాటకం)
 3. వేదనా నివేదనము (పద్యకావ్యం)
 4. మధురీ సుధాకరము
 5. ప్రణతి
 6. శకుంతల
 7. ఆర్య చారుదత్త
 8. సీతాకళ్యాణము
 9. జాలంధరము
 10. అశోకవనము
 11. ముందుదారి
 12. త్యాగమూర్తి

అవధానాలుసవరించు

ఇతడు రెండు శతావధానాలు, 20 శతఘంట ఆశుకవితా ప్రదర్శనలు, సుమారు 750 అష్టావధానాలు చేశాడు. ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలు మచ్చుకు కొన్ని:

 • సమస్య: మూవురుభార్యలున్న నొకముద్దియ యెక్కువె? జానకీపతీ

పూరణ:

 పావనమూర్తి రాజ్యమను భార్య యొకర్తుక నీకు కల్గె నా
పై విమలాంగి సీతయను భార్య యొకర్తుక నీకు గల్గె నా
పై విజిగీష పత్నివలె భాసిలె; నా కృతి పుత్రి నిచ్చునో
మూవురుభార్యలున్న నొకముద్దియ యెక్కువె? జానకీపతీ

 • సమస్య: రతికి సిద్ధము గండిక రమణులార

పూరణ:

 ఇంట గలిగిన పనులెల్ల యిట్టె సలిపి
మన్మథుని మించు భర్తల మనసు నిల్చి
పూజ సలుపంగ వెంటనే పూలతో వి
రతికి సిద్ధము గండిక రమణులార!

 • వర్ణన: నేటి దేశ స్థితి

పూరణ:

పరమార్థంబిడు వేద కర్మలకు దీపంబార్పినట్లయ్యె సు
స్థిర మర్యాదలు గోతద్రోయబడె సుశ్రీ పూర్ణులౌ వారలన్
పరిహాసమ్ముల పాలుజేసిరి వహవ్వా! భారతంబిప్పుడీ
దురితానేక విభిన్నమార్గముల యందున్ సాగి పాడై చనున్

 • దత్తపది: రండ - ముండ - బండ - కుండ అనే పదాలతో భాగవతార్థంలో పద్యం

పూరణ:

రండాలోచనలేల మిత్రవరులారా! చల్ది చిక్కాల రా
ముండాడన్, వడి గోప బాలకులు మూపుల్ పొంగగా వచ్చి, తిన్
బండారంబుల నాకు లందు నిడి, క్షుద్భాధన్ వెసన్‌దీర్చి, లే
కుండాడన్ దగదయ్య కృష్ణుగొని రమ్మో యుద్ధవా వెంటనే!

 • ఆశువు: విహారయాత్ర

పూరణ:

బడికొక రీతి దుస్తు; లటుపై లఘుభోజనపాత్ర, పొత్తముల్
తడియకయుందఁ బెట్టెలు, కలంబులు, బస్సుల రాకపోకకై
పిడికెడు పైస, లా పయిని విందు వినోద విహారయాత్రలున్
బుడుతల విద్య నేఁటి కిటు మూర్తి ధరించెను చిత్ర మెన్నఁగన్[2].

మూలాలుసవరించు

 1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 278–281. |access-date= requires |url= (help)
 2. "ఏల్చూరి మురళీధరరావు". Archived from the original on 2017-07-04. Retrieved 2016-09-10.