ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రం కూసుమంచి గ్రామానికి ఉత్తరం వైపున ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఊరిబయటి పొలాల్లో ఈ దేవాలయం ఉంది. కాకతీయ, ముసునూరి కాలపు శివాలయాల వాస్తు పద్ధతికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రామప్పదేవాలయం వంటి నక్షత్రాకార పునాది ప్రణాళికతో అద్భుతంగా నిర్మించిన ప్రాచీన కట్టడం ఇది. ప్రాచీనతే కాకుండా నిర్మాణంలో సిమెంటు సున్నం వాడకుండా ఇంటర్ లాకింక్ పద్ధతిని వాడటం లాంటి అదనపు ప్రత్యేకతలెన్నో ఈ దేవాలయ నిర్మాణంలో నేటికీ గమనించవచ్చు.

చరిత్ర

మార్చు
 
కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తక ముఖచిత్రం

దేశ రక్షణ కోసం తప్పనిసరిగా నైనా యుద్ధాలను చేయడం ఎందరో శత్రుసైనికుల ప్రాణాలను తీయడం రాజులకు తప్పనిసరి విధిగా వుండేది. అంతేకాకుండా న్యాయనిర్ణయంలోసైతం తెలిసీ తెలియక పొరపాట్లు చేసే అవకాశం వుండటంతో అటువంటి పాపపరిహారార్ధం వెయ్యి శివాలయాలను కట్టిస్తానని కాకతీయ గణపతిదేవుడు మొక్కకున్నాడట. ఈ కథనమే కాక మొదటి నుంచి కాకతీయులు జైనాన్ని వదిలి శైవంలోకి వచ్చిన తర్వాత శివాలయాల నిర్మాణం చేపడుతూ వచ్చారు. కాకతీయ ప్రతాపరుద్రుడి పాలన అంతమైన తరువాత డిల్లీ సుల్తానులు చాలా హిందు దేవాలయాలను కోటలను నాశనము గావించరు. కాకతీయుల వారసులు అయిన ముసునూరి వంశీయులు డిల్లీ సుల్తానులను ఓడించి మల్లి ఎన్నో దేవాలయాలను కోటలను పునరుద్ధరించారు వాటిల్లో ఈ ఆలయం ఒకటి. విలస, అన్నితల్లి, గురుజ దధితర ఎన్నో శాసనాలు వీరు చేసిన ప్రజాసేవ దేవాలయ నిర్మాణాల గురించి తెలుపుతాయి. దేవాలయం అంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక ఊరుమ్మడి తత్త్వాన్ని పెంచే కేంద్రగానూ, సాంస్కృతిక కేంద్రం, బ్యాంకు, పాఠశాల, వైద్యాలయం, సలహాకేంద్రాలుగా అన్నిటికీ వాడుకునేందుకు ఊరుమ్మడి పవిత్ర ఆస్తిగా వీటి నిర్మాణం చేపట్టారు. ఆఖరుకు వరదలు వంటి పకృతి విపత్తులు సంభవించినప్పుడు తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా ఈ దేవాలయాలు పనిచేసేవి. నిస్సహాయులకు పొట్టకూటికి సమకూర్చేవి. నేడు చెప్పుకుంటున్న చలి ఎండ లకు తట్టుకోలేని బడుగుల ఉపశమన కేంద్రాలుగా ఈ దేవాలయాలే పనిచేసేవి. రాజ్యపు ఖజానాను దాచుకునేందుకు, రహస్య విషయాలపై వేగులతో మంతనాలు చేసేందుకు కూట వీటిని వినియోగించేవారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మనుషులకే కాకుండా పక్షులు ఆహారం సంపాదించుకుటూ గూళ్ళు నిర్మించుకునేందుకు, చాలా రకాల చిన్న జంతువులు బ్రతికేందుకు ఇవి కేంద్రాలుగా వుండేవి. అదే పద్ధతితో కాకతీయులు రాజ్య అవసరాల కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం నిర్మించిన ఆలయాలలో ఒకానొక పురాతన చారిత్రక ఆధారమే ఈ కూసుమంచి గణపేశ్వరాలయం.

గర్భాలయం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలారూపంగా శివలింగం, కింద మూడు అడుగుల విస్తీర్ణంతో పానవట్టం నిర్మించబడింది. ఈ శివ‌లింగం ఎత్తులో యావత్తు ఆసియాఖండంలోనే మూడ‌వ స్తానంలో ఉంది.[1]

ఇలా వెలుగులోకి వచ్చింది

మార్చు
 
కూసుమంచి గణపేశ్వరాలయం ఆవరణకు దగ్గరలో వున్న వీరగల్లులు

కాకతీయ, ముసునూరి కాలంలో ఒక వెలుగు వెలిగిన శివాలయాలు తదనంతర కాలంలో అవసాన దశకు వచ్చాయి. థంసావంటి దాడుల వల్లనో గ్రామాలకు గ్రామాలు తరలి వెళ్ళటం వల్లనో ఈ ప్రసిద్ధ ఆలయం ఊరికి దూరమై పిచ్చిమొక్కల మధ్య మిగిలిపోయింది.అలా ఎన్నోళ్ళు మిగిలిపోయిందో. 2001 ప్రాంతంలో కూసుమంచి రక్షకభట నిలయంలో వృత్తలాధికారిగా పనిచేస్తున్న శ్రీ సాధు వీరప్రతాప్ గారి చొరవతో దేవాలయంలో మళ్ళీ దీపం వెలిగింది. గ్రామస్తుల సహకారంతో నిధులను సమకూర్చుకుని ఆలయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. 2015 కట్టా శ్రీనివాస రావు దేవాలయం వివరాలను తెలియజేస్తూ చరిత్రకందని శైవక్షేత్రం కూసుమంచి గణపేశ్వరాలయం పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణా ఏర్పాటు తర్వాత చారిత్రక ప్రాముఖ్యత వున్న ఆలయాలకు నిధుల కేటాయింపులు పెరగటం దానితో పాటు వివిధ ప్రసార ప్రచార సాధనాలలో ఆలయం ప్రశస్తి నలుదిశలా వ్యాపించింది. 13 ఆర్థిక సంఘం నిధులతో ఈ ఆలయానికి ఉపాలయమైన ముక్కంటేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఒక అమూల్యమైన శిలాశాసనం లభించింది. దీనివల్ల ఈ దేవాలయాల నిర్మాణానికి సంబంధించి ఎన్నో విలువైన సంగతులు మరింతగా వెలుగులోకి వచ్చాయి. ఆలయప్రాచీనతపై ఆధారపూర్వకమైన విశిష్టత స్వంతం అయ్యింది.

ఆలయ శిల్పరీతి

మార్చు

ఈ ఆలయ శిల్పరీత ప్రాచీనమైనదే కాక అత్యంత విశిష్టమైనది కూడా ఆలయ నిర్మాణ సందర్భంలో సిమ్మెంటు సున్నం వంటి పదార్దాలతో రాళ్లను అతికించడం కాకుండా అనుసంధానం (ఇంటర్ లాకింగ్) విధానంలో పెద్దపెద్దరాళ్ళకు గాడులూ, కూసాలు పద్ధతిలో బిగింపు చేయడం ద్వారా నిర్మించారు.

కాకతీయుల ట్రిపుల్ టి పద్దతి

మార్చు

కాకతీయులు అత్యంత ఎక్కువగా అనుసరించిన ట్రిపుల్ టి అంటే టౌన్ (నగరం), టెంపుల్ (దేవాలయం) ట్యాంక్ (నీటివసతి) అనే పద్ధతి ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తుంది. ఆలయానికి ఈశాన్య దిశలో గంగాదేవి చెరువు వుంటుంది. ఇది చుట్టుపక్కల పొలాలను సస్యశ్యామలం చేస్తూ ఊరికి అన్నాన్ని అందించేందుకు అనుకూలంగా వుంటుంది.

ఉపాలయాలు

మార్చు

త్రికూటాలయం

మార్చు

ఈ ఆవరణలో ప్రధానమైన గణపేవ్వరాలయమే కాక త్రికూటాలయ పద్ధతిలో నిర్మించిన మరోగుడి ఉత్తరదిశకు తిరిగి వుంటుంది. త్రికూటమూ అంటే మూడు గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన గుడి అని అర్ధం. దీనిలోని మూడు గర్భాలయాలలోనూ శివలింగాలే నిర్మించారు. ఈ మూడు శివలింగాలతో కలిసిన మొత్తం గుడి ప్రధాన ఆలయం వైపుగా తిరిగి వుంటుంది.

వేణుగోపాల స్వామి ఆలయం

మార్చు
Rani rudrama Devi

ఎలా చేరుకోవాలి

మార్చు

ఖమ్మం హైదరాబాదు రహదారిపై ఖమ్మం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపుకి 40 కిలోమీటర్ల రావలసి వుంటుంది. హైదరాబాదు నుంచి 170 కిలోమీటర్లు, వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా 130 కిలో మీటర్లు, విజయవాడనుంచి 126 కిలోమీటర్ల దూరంలోనూ వుంటుంది. భక్తరామదాసుకు పుట్టినిల్లు, ఒకప్పటి అత్యంత పురాతన నగరం, పురాతన వ్యాపార కేంద్రం, అనేక ప్రాచీన రాజ్యాలకు రాజధానిగా వ్యవహరించిన ప్రదేశం అయిన నేలకొండపల్లికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనూ వుంటుంది. చాళుక్యవంశంలోని ఒకశాఖకు పేరునిచ్చిన ప్రాచీన రాజధాని నగరం ముదిగొండకు కూడా కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ కూసుమంచి ప్రాంతం వుంటుంది.

ఉత్సవాలు - వేడుకలు

మార్చు

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పార్వతి, పరమేశ్వరుల కళ్యాణం జరుగుతంది. ఈ ఉత్సవానికి 50వేల నుంచి 60వేల మంది భ‌క్తులు వస్తారు.[2] [1]

చిత్రమాలిక

మార్చు

శాసనాధారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, ప్రాంతీయం (22 February 2017). "మహాశివరాత్రికి సిద్ధమవుతున్న కూసుమంచి గణపేశ్వరాలయం". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "మహాశివరాత్రికి సిద్ధమవుతున్న కూసుమంచి గణపేశ్వరాలయం" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. నవతెలంగాణ, ఖమ్మం (4 March 2019). "శివరాత్రికి గణపేశ్వరాలయం ముస్తాబు". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.

బయటి లింకులు

మార్చు