గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గొప్ప కవి. శతావధాని.

గాడేపల్లి వీరరాఘవశాస్త్రి
జననంగాడేపల్లి వీరరాఘవశాస్త్రి
1891, ఏప్రిల్ 30
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం గ్రామం
మరణం1945, మార్చి 5
ప్రసిద్ధిప్రముఖ కవి, శతావధాని
తండ్రిగాడేపల్లి శివరామదీక్షితులు
తల్లిసుబ్బమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఇతను తన 11వ యేట బ్రహ్మోపదేశమైన తరువాత తండ్రివద్దనే షోడశకర్మలు, యజుర్వేద సంహిత, అరుణపంచకము, ఉపనిషత్పంచకము మొదలైనవి అభ్యసించాడు. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద కావ్యపఠనము చేశాడు. నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు. ఇతడు గద్వాల సంస్థానంలో చాలా కాలం ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. అంతకు ముందు మార్కాపురంలో ఆంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశాడు. ఇతడు వ్రాసిన వ్యాసాలు త్రిలిఙ్గ,దివ్యవాణి(పత్రిక), కల్పవల్లి, గోలకొండ పత్రిక మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

అవధానాలు

మార్చు

ఇతడు మొదటిసారి 1913లో తన విద్యాగురువు రాళ్ళభండి నృసింహశాస్త్రి అధ్యక్షతన ఎఱ్ఱగొండపాలెంలో అష్టావధానం నిర్వహించాడు. తరువాత 1938 వరకు 25 సంవత్సరాలు సుమారు 200 అవధానాలు చేశాడు. ఇతడు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, బళ్లారి, చిత్తూరు జిల్లాలలోను, తెలంగాణా జిల్లాలలోనూ, మైసూరు రాష్ట్రంలోను అష్టావధానాలు, శతావధానాలు ప్రదర్శించాడు. ఇతడు ఘంటాశతము అనే అవధానాన్ని అంటే ఒక గంటలో ఒక శతకాన్ని ఆశువుగా చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పేరు గడించాడు.[1]

రచనలు

మార్చు
  1. త్రిపురాంతక స్థల మహాత్మ్యము (3 ఆశ్వాశముల కావ్యము)
  2. సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము (1947)
  3. అహోబల మహాత్మ్యము (1919)
  4. మార్కండేయ చరిత్రము (హరికథ)
  5. రామభూపతి శతకము (1914)
  6. దీనకల్పద్రుమ శతకము (1916)
  7. విశ్వేశ్వర శతకము (1916)
  8. సోమేశ్వర శతకము (1916)
  9. చెన్నకేశవ శతకము (1916)
  10. ఆర్యవిద్యా ప్రబోధిని
  11. ద్విపద భగవద్గీత
  12. ముకుందమాల(ఆంధ్రీకరణం)
  13. పింగళ హరికథ
  14. సాంబలక్షణ(శృంగారకావ్యము)
  15. హైమవతీ పరిణయము
  16. భూగంగాస్తుతి
  17. మార్కండేయ నాటకము
  18. సీతారామ కళ్యాణము(ద్విపద)
  19. సీతారామ కల్పద్రుమ శతకము
  20. వెంకటేశ్వర శతకము
  21. కుమార సుబ్రహ్మణ్య చరిత్ర
  22. మెదకు సంస్థానాధీశుల చరిత్ర
  23. హరివంశము (అసంపూర్ణము)
  24. ఐరావత వ్రతకథ
  25.  
    గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గారి చమత్కార కవిత్వము
    చమత్కార కవిత్వము-1949[2]

రచనలనుండి ఉదాహరణలు

మార్చు
1.ధర మధురాధర ధర సుధారస ధారలన్ ద్వజించి యే
యిరవుననో సుధల్ దొరకు నెంతయునంచు దలంచు టెంచగా
దొరికిన పెన్ని ధానమును దొంగల కిచ్చుచు రిత్త నేల యం
దరయ ధానాప్తికై వెదకునట్టి తెరంగగుగాదె ధీమణి!
2.అన్నా!విద్దెల నెల్ల నేర్చితివె, నెయ్యం బార నీ యొజ్జలున్
సన్నాహంబున నేర్పిరే,యిపుడికే సందేహమున్ లేక నీ
విన్నాళ్ళున్ బఠియించు శాస్త్రమున నేదే నొక్క పద్యంబు సం
పన్నార్థంబుగ నీ సుధా మధుర వాక్ప్రావీణ్యతన్ చెప్పుమా!
(అహోబల మహాత్మ్యము నుండి)
3.సకల జీవులలోని చైతన్యమును గన్న
నానంద పారవశ్యంబు గాంచు
నలుసంత బాధ యేనా డెవ్వడందిన
దా బాధపడి దాని దలగ జూచు
పరుషోక్తులే పసిపాపలు పల్కిన
హరిహర యని చెవుల్ దరియ మూయు
రాజసంబన్న దొఱల జేరగా నీక
బీద సాదల మైత్రి బెం పొనర్చు
అక్షరాభ్యాస మపుడె పంచాబ్ద మాత్ర
బాలుడై కూడ నిటువంటి లీల బొదలె
నద్దిరే ధృవు విజ్ఞాన మడుగవలనె
పూవునకు తావి సహజమై పొసగుటరుదె!
(శ్రీ సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము నుండి)

అవధానాల నుండి ఉదాహరణలు

మార్చు
  • సమస్య: పతి తల గోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్

పూరణ:

కుతకము మీఱ కకుంఠిత భక్తిని బోవుచుండి వి
స్తృత నవపల్లవావృత దిదృక్షుముదావహ తింత్రిణీకుజా
ప్రతిమపు నీడలో విడిసి, పప్పుడుకెత్తెడునంత నాకురు
ట్పతి తలగోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్

  • సమస్య: భీష్ముని పెండ్లికి ఏగిరట పిన్నలు పెద్దలు బంధులందఱున్

పూరణ:

  గ్రీష్మములోన లగ్న మరిగెన్ - సమకూర్చెద నన్న బార్గవా
ర్చిష్మ దనూన కోపమతిశీతలమయ్యె బ్రతిజ్ఞ చూడగా
భీష్మముగాగ మాఱె; దలపెట్టని వన్నియు దాపురించె నా
భీష్ముని పెండ్లికి; ఏగిరట పిన్నలు పెద్దలు బంధులందరున్

పండిత ప్రశంసలు

మార్చు
పటుతరధారణా పటిమ పండిత మోద మెసంగు వాణి, రా
ట్చటుల సభాంతరాళ కవి సంఘ పరిస్తుత, కీర్తి, సర్వది
క్తటముల దాండవింపగను గౌరవమున్, బ్రతివాది దుర్థమ
తృటనము నిర్వహించు కొనుతోరపు శక్తియు నీకె రాఘవా!
-బుక్కపట్టణము శ్రీనివాసాచార్యులు

మూలాలు

మార్చు
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016-07-23). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. pp. 159–164.
  2. వీరరాఘవశాస్త్రి, గాడేపల్లి. చమత్కార కవిత్వము.
  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయగ్రంథమాల, హిందూపురం
  2. కర్నూలు జిల్లా రచయితల చరిత - కె.ఎన్.ఎస్.రాజు, కర్నూలుజిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం,కర్నూలు