ప్రముఖ కథారచయిత, సినీరచయిత పాలగుమ్మి పద్మరాజు రచించిన కథ గాలివాన. ధనికుడు, సంఘంలో పేరుప్రతిష్టలు ఉన్నవారు అయిన రావుగారికీ, దొంగ, బిచ్చగత్తె అయిన ఓ స్త్రీకి నడుమ గాలివానతో రైల్వేస్టేషనులో చిక్కుకుపోయిన రాత్రిని గాలివానలో చిత్రీకరించారు. ఈ కథకు పద్మరాజు చేసిన అనువాదం ద రెయిన్కు 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. అలా ప్రపంచస్థాయిలో తెలుగు కథని నిలిపినదిగా గాలివాన తెలుగు సాహిత్యరంగంలో సుప్రఖ్యాతమైంది.

1952 ఆంధ్రసచిత్రవారపత్రిక ప్రచురణలో లోగో

కథా నేపథ్యంసవరించు

గాలివాన కథ తొలుత ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలో 1951 మే 13న ప్రచురితమైంది, తిరిగి 1952 మార్చి 19 న అదే పత్రికలో పున:ప్రచురణ పొందింది.[1] న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పురస్కారం పొందినాకా ప్రపంచంలోని పలు భాషల్లోకి కథ అనువాదమైంది.

గాలివాన కథని పాలగుమ్మి పద్మరాజు ప్రముఖ రష్యన్ రచయిత గోర్కీ రాసిన ద ఆటమ్ నైట్ కథ నుంచి స్వీకరించారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ కథలో లేని దృక్పథాల వైరుధ్యం, మార్పు వంటివి చేరుస్తూ కథను అద్భుతంగా మలిచారని భావించారు.[2] 1949లో పద్మరాజు భీమవరంలో ఉండగా విపరీతమైన గాలివాన వచ్చి ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉందామా, బయటకు పారిపోదామా అని ఊగిసలాడుతూన్న సమయంలో పద్మరాజు బయటకి రావడం, భార్య ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు ఆమెపై కూలిపోయింది. కాపాడేందుకు వచ్చిన ఆయన విద్యార్థుల సహాయంతో ఆమెను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఆమె బతికిందో లేదో, బ్రతికేవుంటే బతుకుతుందో బతకదో కూడా తెల్లారేవరకూ తెలియని దుస్థితిలో ఆ రాత్రి గడపాల్సివచ్చింది. ఆమె శరీరమంతా గాయాలతో చాన్నాళ్ళు కోలుకోలేని స్థితిలోకి వెళ్లారు. ఈ దుర్భరమైన అనుభవం నుంచే కథలోని గాలివాన చిత్రణ, గాలివాన రాత్రి ప్రధాన పాత్ర పొందిన వేదన, భయం వంటివాటి చిత్రణను స్వయంగా తన జీవితం నుంచే స్వీకరించివుండొచ్చని సాహిత్యకారుడు, పాత్రికేయుడు నరిశెట్టి ఇన్నయ్య పేర్కొన్నారు. [3]

ఇతివృత్తంసవరించు

కథలోని ప్రధాన పాత్రల్లో ఒకటి రావుగారి పాత్ర. ఆయన సంఘంలో గౌరవమర్యాదలు, పేరుప్రతిష్టలు కలిగినవారు. వకీలుగా పనిచేసి కొడుకు వకీలు పరీక్షలు నెగ్గాకా తన ప్రాక్టీసును అతనికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నవారు ఆయన. ఆయన జీవితంలో ప్రతీ విషయంపైనా ఒక నియమాన్ని ఏర్పరుచుకుని అందుకు అనుగుణంగా జీవిస్తూంటారు. కుటుంబంలోని ప్రతివారినీ తన క్రమశిక్షణకు అనుగుణంగా నడుపుతూంటారు, చివరకు కూతుళ్ళ తలకట్టు ఎలావుండాలో కూడా రావుగారే నిర్ణయించేది. తత్త్వవేత్తగా తనను తాను భావించుకునే రావుగారికి ఉపన్యాసాలపై ఆసక్తి ఎక్కువ. దానితో వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు "సత్వము-తత్త్వము", "ప్రకృతి-పరిష్కృతి" లాంటి పేర్లతో ఉపన్యాసాలు ఇస్తూంటారు.(అయితే శీర్షికలను విషయాన్ని బట్టి కాకుండా శబ్దాలంకారాలపై మోజుతో నిర్ణయించుకుంటూంటారని వారి స్నేహితుల వేళాకోళం) కథ ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఆస్తిక సమాజం వారి ఆహ్వానం మేరకు "సామ్యవాదము-రమ్య రసామోదము" అన్న అంశంపై ప్రసంగించేందుకు రైలు ప్రయాణంలో ఉంటారు. వారున్న బెర్తుల వద్దకు అడుక్కునేందుకు వచ్చిన బిచ్చగత్తెను అసహ్యించుంటారు. అయితే ఆ రాత్రి మెల్లగా ప్రారంభమైన వాన అత్యంత తీవ్రమైపోతుంది. తాను దిగాల్సిన స్టేషన్లో బెడ్డింగు, సామాన్లతో సహా రావుగారు దిగుతారు. అయితే ఆ తీవ్రమైన గాలివానలో, రైల్వేస్టేషన్లో తాను అసహ్యించుకున్న బిచ్చగత్తెతో పాటుగా చిక్కుకుంటారు.

అంతటి వేదాంతి అయిన రావుగారు ఆ స్టేషన్లో గాలివాన బీభత్సానికి భయపడిపోతారు. అయితే జరుగుతున్న క్షణంతోనే తప్ప గడిచిన గతం, రానున్న భవిష్యత్తులతో ఏ సంబంధం పెట్టుకోని 30ఏళ్ళ బిచ్చగత్తె మాత్రం ధైర్యంగా ఉంటుంది. అతనికి చలివేస్తుంటే తన చుట్టూ చేతులు వేసుకొమ్మంటుంది, ధైర్యం చెప్తుంది. ఆ రాత్రి ప్రాణాలు కాపాడుతుంది. అయితే తెల్లవారేసరికి ఆమెకి ఏమైంది, తద్వారా తన జీవితంలో ఇన్నాళ్ళూ కాపాడుకుంటూ వచ్చిన విలువలు, నమ్మకాలు, తాత్త్వికత, ధర్మం వంటివన్నిటినీ రావుగారు ఎలా పునర్నిర్వచించుకున్నారు అన్నది కథాంతాన్ని బట్టి తెలుస్తుంది.[4]

శైలిసవరించు

శీర్షికసవరించు

గాలివాన అన్న కథాశీర్షికను చాలా ప్రతీకాత్మకంగా ఉపయోగించారని విమర్శకులు భావించారు. కథలో ప్రధానపాత్ర అయిన రావుగారు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు, నమ్మకాలు, విలువలు వంటివన్నీ ఒక్కరాత్రి అనుభవంతో కదిలిపోతాయి. అలా కదల్చగలిగిన సంఘటనలన్నీ గాలివానలేనన్న అభిప్రాయంతో కథకు శీర్షికగా గాలివానను ఉంచారని భావించారు.[5] కథాగమనాన్ని హఠాత్తుగా వచ్చే గాలివాన మార్చడం, గాలివానే కథలో కీలకం కావడం కూడా శీర్షిక సంబద్ధత సూచిస్తోంది.

వర్ణనలుసవరించు

వర్ణనలు విస్తారంగా ఉండే ఈ కథలో అవన్నిటినీ కథాగమనానికి, పాత్రచిత్రణకు వినియోగించుకున్నారు. రైల్లో ప్రయాణికుల వివరాలు, వర్ణనలను ప్రధానపాత్ర అయిన రావుగారి మనస్తత్వ చిత్రీకరణ కోసం వినియోగించుకున్నారు. ఆయన దృక్పథాన్ని, దృక్కోణాన్ని వివరించేందుకు ఆ వర్ణనలన్నీ పనికివచ్చాయి.[5] బిచ్చగత్తె మరణించినప్పుడు 'ఆయన హృదయం తుపానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది.' వంటి వాక్యాలతో వర్ణించారు.[6] ఇక గాలివాన బీభత్సాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ప్రతీకలుసవరించు

ప్రభావాలుసవరించు

గాలివాన కథపై గోర్కీ రచించిన కథ ద ఆటమ్ నైట్ ప్రభావం ఉందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. గోర్కీ రాసిన ఆటమ్ నైట్ కథలో ప్రధానపాత్ర ఓ పేదకుర్రాడు. దివాలాతీసిన నగరంలో చలికాలంలో వానపడుతున్న ఆ రాత్రి అతను ఆకలితో నకనకలాడుతూంటాడు. వ్యవస్థపైనా, జీవితంపైనా నమ్మకాన్ని కోల్పోతాడు. అలాంటి స్థితిలో ఓ బిచ్చగత్తె అతన్ని అక్కునచేర్చుకుని వెచ్చదనాన్ని కలగజేసి జీవితంపై నమ్మకాన్ని చిగురింపజేస్తుంది. ఈ కథను దృక్పథాల మధ్య వైరుధ్యం సృష్టించి పెంచి గాలివాన అంతటి కథగా మలిచారని సాహిత్యకారుడు ఖదీర్ బాబు ప్రతిపాదన. [2] అయితే మాక్సిం గోర్కీ రాసిన ద ఆటం నైట్ కథ మీద ఫ్రెంచి రచయిత గుస్తావ్ ఫ్లోవేర్ సెయింట్‌గా మారాలనుకునే ఓ దొంగ చలికాలం రాత్రి చలికి చనిపోయేలావున్న కుష్టురోగిని కౌగలించుకునే ఘటన నమోదుచేసిన కథ స్ఫూర్తగా వుందని ఖదీర్ పేర్కొన్నారు.[2]

మూలాలుసవరించు

  1. "రచయిత:పాలగుమ్మి పద్మరాజు". కథానిలయం. ఎం.వి.రాయుడు, కాళీపట్నం సుబ్బారావు, టి.శ్యామనారాయణ, వివిన మూర్తి, ఎం.వి.రమణమూర్తి. Retrieved 5 June 2015. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 2.2 ఖదీర్, బాబు (11 ఏప్రిల్ 2015). "గాలివానకు ముందు తర్వాత." సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 5 June 2015. CS1 maint: discouraged parameter (link)
  3. నరిశెట్టి, ఇన్నయ్య. "సాహిత్యపరులతో సరసాలు". నా ప్రపంచం. నరిశెట్టి ఇన్నయ్య. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 5 June 2015. CS1 maint: discouraged parameter (link)
  4. నెమలికన్ను, మురళి. "గాలివాన". నెమలికన్ను. మురళి. Archived from the original on 29 జూన్ 2015. Retrieved 5 June 2015. CS1 maint: discouraged parameter (link)
  5. 5.0 5.1 మురళీ, శారదా. "కథాసాగరం II". పుస్తకం.నెట్. సంపాదకులు. Retrieved 5 June 2015. CS1 maint: discouraged parameter (link)
  6. డా.ఎ., రవీంద్రబాబు. "గాలివాన కథ". తెలుగు వన్. Retrieved 5 June 2015. CS1 maint: discouraged parameter (link)