గోళ్ళమూడి రత్నమ్మ
గోళ్ళమూడి రత్నమ్మ స్వాతంత్ర్య సమర యోధురాలు.
గోళ్ళమూడి రత్నమ్మ | |
---|---|
జననం | 1886 గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలు |
తండ్రి | వాసిరెడ్డి సాంబయ్య, |
తల్లి | పార్వతమ్మ |
బాల్యం, విద్య
మార్చుగోళ్ళమూడి రత్నమ్మ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలు గ్రామములో ఒక సంపన్న కర్షక కుటుంబములో వాసిరెడ్డి సాంబయ్య, పార్వతమ్మ దంపతులకు 1886లో జన్మించింది[1]. బాల్యంలో చదువు పట్ల అమిత శ్రద్ధ చూపింది. ఆనాడు ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. అదీగాక వాసిరెడ్డి వారింట్లో ఘోషా పద్ధతి ఉండేది. అయినా తల్లిదండ్రులు రత్నమ్మ చదువుకోడానికి సహకరించారు.
స్వాతంత్ర పోరాటం లో
మార్చు1921లో మహాత్మా గాంధీ స్వరాజ్య యాత్ర చేస్తూ చేబ్రోలు వచ్చాడు. గాంధీజీ ఉపన్యాసాలు విన్న తను కూడా దేశసేవలో నిమగ్నమవ్వాలనుకుంది. రాట్నం వడకడం, నూలు తయారు చేయడం, ఖాదీ ధరించడం మొదలు పెట్టింది. 1928లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు వెళ్ళింది. 1930లో ఉప్పు సత్యాగ్రహములో పాల్గొంది. ఈమెను విప్లవ వనితగా భావించి బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి పలు నేరాలు ఆరోపించారు. ఆరు నెలల కారాగార శిక్ష వేశారు. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక వల్ల జైలు నుండి విడుదలై, తన ప్రచార కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేసింది.
1932లో శాసనోల్లంఘనం, పికెటింగ్ కారణంగా ఆమెను అరెస్ట్ చేసి వదిలారు. మళ్ళీ కొంత మంది స్త్రీలతో కలిసి సత్యాగ్రహం చేసింది. పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరిపి ఆరు నెలలు కఠిన కారగార శిక్ష విధించారు. ఆంధ్ర మహిళా సభ 1935లో గుంటూరులో జరిగింది. ఈ సభకు రత్నమ్మ అధ్యక్షత వహించింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం వారు రత్నమ్మను మహిళా దళాధిపతులకు ప్రధాన నేతగా నియమించారు. రత్నమ్మ మహిళలను కూడగట్టుకొని ఎలా శాసనధిక్కారం చేయగలదో గ్రహించిన ప్రభుత్వం ఆమెను మరలా అరెస్ట్ చేసి పది నెలలు జైలు శిక్ష విధించింది.
1936లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గుంటూరు జిల్లా బోర్డుకు అత్యధిక మెజారీటీతో గెలిచింది. 1939లో పొన్నూరు నియోజకవర్గం నుండి గుంటూరు జిల్లా బోర్డుకు గెలుపొంది పార్టీ గౌరవం కాపాడింది. 1939లో చేబ్రోలులో మహిళా గ్రంథాలయం స్థాపించింది. అలాగే 1940లో స్త్రీలకు ప్రత్యేకముగా హిందీ విద్యాలయం స్థాపించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమములో మరలా అరెస్ట్ అయ్యింది. 1944 జనవరి 26న స్వతంత్రదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. 1945లో చేబ్రోలులో ఆంధ్రరాష్ట్ర మహిళా రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించింది.
మూలాలు
మార్చు- ↑ గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 256