ఘంటసాల వెంకటేశ్వరరావు

సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.
(ఘంటసాల వెంకటేశ్వర రావు నుండి దారిమార్పు చెందింది)


ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 డిసెంబర్ 4 [1] - ఫిబ్రవరి 11, 1974) తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినది.

ఘంటసాల వెంకటేశ్వరరావు
ఘంటసాల
జననం
ఘంటసాల వెంకటేశ్వరరావు

డిసెంబర్ 4, 1922
మరణం1974 ఫిబ్రవరి 11(1974-02-11) (వయసు 51)
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఘంటసాల
వృత్తినేపథ్య గాయకుడు,
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సంగీత దర్శకుడు, గాయకుడు
పదవీ కాలం1942–1974
జీవిత భాగస్వామిసావిత్రమ్మ, సరళా దేవి (రెండో భార్య)
పిల్లలునలుగురు కుమారులు
(విజయ కుమార్, రత్న కుమార్, శంకర్ కుమార్, రవికుమార్)
కుమార్తెలు
(శ్యామల, సుగుణ, మీరా, శాంతి)
తల్లిదండ్రులు
  • సూర్యనారాయణ (తండ్రి)
  • రత్నమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttp://www.ghantasala.info/

బాల్యం

మార్చు

ఘంటసాల 1922 డిసెంబర్ 4గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.

సంగీత సాధన

మార్చు

తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమైనా తన తప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి అప్పటి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తోటివిద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే అతనే అనిచెప్పేవాడు.

శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా అతను పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.

వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.

సినీ ప్రస్థానం

మార్చు
 
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘంటసాల విగ్రహం

1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయన్ను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.

సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో అతనుకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.

తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

కీలుగుర్రం సినిమాలో ఘంటసాల ప్లేబాక్ పాడిన కాదు సుమా కల కాదు సుమా పాట

విజయ విహారం

మార్చు

1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలావాస శ్రీ వేంకటేశా పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే. ఏనోట విన్నా అతను పాడిన పాటలే.

చివరిదశ

మార్చు

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. 1970లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు.

వ్యక్తిత్వం

మార్చు

ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. అతను ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు. "నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది" అని ఎన్నోసార్లు చెప్పేవాడు.

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.

పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను అన్నా అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

ఘంటసాల జీవిత చరిత్ర ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా వచ్చింది. దీనికి ఆయన అభిమాని సి.హెచ్ రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో గాయకుడు కృష్ణచైతన్య, అతని భార్య మృదుల జంటగా నటించారు.[2] కానీ ఈ చిత్రం ఘంటసాల కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదు.[3]

చిత్రలహరి

మార్చు

పేరు పొందినవి

మార్చు
నేపథ్య గాయకునిగా, సంగీత దర్శకునిగా
నేపథ్య గాయకునిగా
ప్రైవేటు ఆల్బములు

మూలాలు

మార్చు
  1. ఘంటసాల భువన విజయము[permanent dead link], వి. ఎ. కె. రంగారావు, పుట 12
  2. Chowdhary, Y. Sunita (2019-11-07). "Ch Rama Rao on helming a biopic on legendary musician Ghantasala". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-12-14.
  3. "Amidst controversy, Ghantasala's biopic ready for release". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-12-14.

ఘంటసాలకు తప్పని సినిమా కష్టాలు!

బయటి లింకులు

మార్చు