బాబా తమ భక్తుల కష్టాలు ,కోరికలూ తీర్చడమే గాక వారిని మంచి ప్రవర్తన కలిగి మంచి మార్గంలో జీవించేలా చేసేవారు . అందుకు ప్రజలందరికీ తారతమ్యాలు లేని ప్రేమానుబంధాలు ఏర్పరచడం ఆయన అవతారకార్యంలో ముఖ్యమైన అంశం . అందుకని ఆయన మసీదులో మసీదులో కులమత భేదాలు ,ధనిక -పేద భేదాలు లేవు. శిరిడీలో హిందువులు ,ముస్లిములూ అయిన భక్తులు కలిసి మెలిసి ఉండేలా బాబా ప్రోత్సహించేవారు . శ్రీరామనవమి ,ఉరుసు ఉత్సవము ఒకేరోజున చేసుకోవడము ,కులమత భేదాలు లేకుండా ఆరతులలోను ,చావడి ఉత్సవంలోను పాల్గొనడము ,ఫాతిహా చేయించడము ,ధునికి నైవేద్యమర్పించడమూ భక్తులకు అలవాటు చేశారు . అందువలన పరమత ద్వేషం లేకుండా పరస్పరం గౌరవించు కునేవారు భక్తులు.

ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వం మనదేశంలోని స్వాతంత్రోద్యమాన్ని అణచి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది . శిరిడీలో హిందూ ముస్లిం భేదం లేకుండా అందరూ కలసిమెలసి ఉంటే తమ అధికారం ఏమైపోతుందో ననే భయం బ్రిటిష్ వారికి కలిగింది . అంతేకాదు ,లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి దేశ నాయకులు ఆయనను దర్శించడము ,ఖాపర్దే లాంటి ప్రముఖులు సాయిని సేవించడమూ వారికి మరింత అనుమానం కలిగించింది . అందుకని శిరిడీలో సాయి వద్ద జరిగే కార్యకలాపాలు ,వచ్చి వెళ్ళే భక్తులు ,ఆయనకొచ్చే దక్షిణలు వీటిపై నిఘా ఉంచడానికి తెల్లప్రభుత్వం చక్రనారాయణ్ అనే పోలీసును నియమించింది . అతడు క్రైస్తవుడు . హిందువును గాని ,ముస్లిమును గానీ నియమిస్తే వారు సాయికి భక్తులైపోతారేమోనని భయపడింది ప్రభుత్వం .

బాబాపై నిఘా వేస్తున్న చక్రనారాయణ్ కు ఆయన దివ్యత్వం అర్ధమవ్వసాగింది . అతడు కూడా చివరకు ఆయన భక్తుడై పోయాడు .

చక్రనారాయణ్ ఎంతో అప్రమత్తంగా బాబాను గమనిస్తూ ఉండేవాడు . భక్తులు బాబాను దర్శించి ఆయనకు తాము ఇవ్వదలచు కున్నంత దక్షిణ సమర్పించుకునేవారు . ఆయన తన కొచ్చిన దక్షిణంతా తిరిగి పంచేసేవారు . ఆయన లెక్కపెట్టి ఎవ్వరికీ దక్షిణ యిచ్చేవారు కాదు . అయినా కొంతమందికి ప్రతిరోజూ సరిగ్గా అంతేపైకం ముట్టేది . ఒక్కొక్కసారి బాబాకు వచ్చిన దక్షిణ కంటే ఆయన పంచే దక్షిణ ఎంతో ఎక్కువ ఉండేది . అదెలా సాధ్యమో చక్రనారాయణ్ కు అర్ధం కాలేదు . ఎంత ప్రయత్నించినా ఆయన అదనపు పైకం ఎలా పంచగలుగుతున్నారో తెలుసుకోలేకపోయాడు . అందుకని బాబాకు దివ్యశక్తులున్నాయని తెలుసుకున్నాడు చక్రనారాయణ్ .

బాబా అన్ని మతాలనూ ,వ్యక్తులనూ గౌరవించేవారు . అప్పట్లో ప్రజలకు క్రైస్తవులంటే ఎంతో చులకన భావం ఉండేది . ఒకసారి బాబాతో ఒక భక్తుడు మరొకరి గురించి ,"బాబా అతను క్రైస్తవుడు !!" అన్నాడు . వెంటనే బాబా ,"క్రైస్తవుడయితే నేమి ? అతడు నా తమ్ముడే !" అన్నారు . అన్ని మతాలపట్ల బాబాకు ఉన్న ఉదారత ,ఉన్నతమైన జీవనవిధానము ,వైరాగ్యము ,ధర్మము ,చక్రనారాయణ్ ను ఎంతగానో ఆకర్షించాయి . అతడాయనకు మంచి భక్తుడయ్యాడు . అలాగే జోసెఫ్ అనే మరో క్రైస్తవుడు కూడా బాబాను సేవించేవాడు .