చార్లెస్ శోభరాజ్

ఫ్రెంచి సీరియల్ కిల్లరు

చార్లెస్ శోభరాజ్ (జననం 1944 ఏప్రిల్ 6), దొంగ, మోసగాడు, సీరియల్ కిల్లరు. భారత, వియత్నామ్ మూలాలు కలిగిన ఫ్రెంచి వ్యక్తి. 1970 లలో ఆగ్నేయాసియాలోని హిప్పీ ట్రెయిల్ అంతటా పాశ్చాత్య పర్యాటకులను - ప్రధానంగా బీట్నిక్‌లను - వేటాడాడు. అతడు చంపినవారి వేషధారణ కారణంగా అతణ్ణి బికినీ కిల్లర్ అనీ, స్ప్లిట్టింగ్ కిల్లర్ అనీ అంటారు. మోసం, తప్పించుకోవడాల్లోని అతని నైపుణ్యం కారణంగా అతణ్ణి పాము అని కూడా అంటారు. శోభరాజ్ కనీసం డజను హత్యలు చేశాడనే నేరంపై ే ఆరోపణలపై దోషిగా నిర్ధారణై 1976 నుండి 1997 వరకు భారతదేశంలో జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తరువాత పారిస్‌ వెళ్ళాడు. అక్కడ అతడొక ప్రముఖుడిగా వెలిగాడు. 2003 లో మళ్ళీ నేపాల్ వెళ్ళాడు. అక్కడ అతన్ని అరెస్టు చేసి, విచారించి, జీవిత ఖైదు విధించారు.[1]

చార్లెస్ శోభరాజ్
జననం.హాత్‌చంద్ భావ్‌నాని గురుముఖ్ చార్లెస్ శోభరాజ్
(1944-04-06) 1944 ఏప్రిల్ 6 (వయసు 80)
హోచిమిన్ సిటీ
అలియాస్బికినీ కిల్లర్, స్ప్లిట్టింగ్ కిల్లర్, సర్పెంట్
జీవిత భాగస్వామిచాంటాల్ కాంపాగ్నాన్
తల్లిదండ్రులుహాత్‌చంద్ శోభరాజ్ (తండ్రి)
ట్రాన్ లొవాంగ్ ఫున్ (తల్లి)
పిల్లలు1

శోభరాజ్ ఒకమానసిక రోగి అని భావిస్తారు. అతనికి హిప్పీలంటే తీవ్రమైన ద్వేషం. అతడు చేసిన అనేక హత్యలు దీనిని ప్రతిబింబిస్తాయి. అతను అందమైనవాడు. నేర వృత్తిలో తన ఆకర్షణను ఉపయోగించుకోడానికి వెనకాడలేదు. ఇదీ, అలాగే అతని మోసపూరిత, సంస్కారాన్ని ప్రదర్శించే వ్యక్తిత్వం వలన జైలు నుండి విడుదల కావడానికి చాలా కాలం ముందే అతనికి సెలెబ్రిటీ హోదా వచ్చింది. అతను తన కీర్తిని ఆస్వాదించాడు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, చిత్ర హక్కుల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశాడు. అతని గురించి నాలుగు జీవిత చరిత్రలు, మూడు డాక్యుమెంటరీలు, మై ఔర్ చార్లెస్ అనే బాలీవుడ్ సినిమా వచ్చాయి. నేపాల్లో అతడి కోసం పోలీసు అధికారులు ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ అతడు అక్కడికి వెళ్ళడానికి కారణం, ప్రచారంపై అతడి కున్న యావే ననీ, తన తెలివితేటలపై మితిమీరిన నమ్మకమేననీ భావిస్తారు.[2]

ఛార్లెస్ శోభరాజ్ కు పెట్టిన పేరు హాత్‌చంద్ భావ్‌నాని గురుముఖ్ చార్లెస్ శోభరాజ్. దుకాణంలో పనిచేసే వియత్నాం అమ్మాయి ట్రాన్ లొవాంగ్ ఫూన్ కు, సైగాన్‌లో స్థిరపడ్డ భారతీయ సింధీ వ్యాపారవేత్త శోభరాజ్ హాత్‌చంద్ భావ్‌నాని కీ అతడు జన్మించాడు.[3][4] అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలేసాడు. కొన్నాళ్ళపాటు అతడు ఏ దేశానికీ చెందనివాడిగా మిగిలిపోయాడు.[5] ఆ తరువాత, అతని తల్లి కొత్త ప్రియుడు, ఫ్రెంచ్ ఇండోచైనాలో ఉన్న ఫ్రెంచ్ ఆర్మీ లెఫ్టినెంటు అతణ్ణి దత్తత తీసుకున్నాడు. ఆ దంపతులకు పిల్లలు పుట్టిన తరువాత శోభరాజ్‌ను వాళ్ళు నిర్లక్ష్యం చేసాడు. అయితే, ఆ కుటుంబంతో పాటు శోభరాజ్ కూడా ఇండోచైనా, ఫ్రాన్స్ల మధ్య తిరుగుతూ ఉండేవాడు. యుక్తవయసులో, అతను చిన్నచిన్న నేరాలకు పాల్పడటం ప్రారంభించాడు. 1963 లో పారిస్ సమీపంలోని పాయిసీ జైలులో తన మొదటి జైలు శిక్ష (దోపిడీకి గాను) అనుభవించాడు.[6] జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు, తన సెల్‌లో పుస్తకాలను అనుమతించడం వంటి ప్రత్యేక సహాయాలను పొందేందుకు జైలు అధికరులను లోబరచుకున్నాడు. అదే సమయంలో, అతను ఒక సంపన్న యువకుడు, జైలు వాలంటీర్ అయిన ఫెలిక్స్ డి ఎస్కోగ్నేను కలుసుకున్నాడు, అతనికి దగ్గరయ్యాడు.[7]

పెరోల్‌పై విడుదలయ్యాక, శోభరాజ్ డి ఎస్కోగ్నేతో కలిసి జీవించాడు. పారిస్ సమాజంలోని ఉన్నత వర్గాల తోను, నేర సామ్రాజ్యం లోనూ కలుపుగోలుగా తిరుగుతూ తన సమయం గడిపాడు. వరుస దోపిడీలు, మోసాల ద్వారా ధనాన్ని కూడబెట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో, శోభరాజ్ సంప్రదాయవాద కుటుంబానికి చెందిన పారీసియన్ యువతి అయిన చాంటల్ కాంపాగ్నోన్‌తో అన్యోన్యమైన సంబంధాన్ని మొదలుపెట్టాడు. శీభరాజ్ కాంపాగ్నోన్‌తో వివాహ ప్రతిపాదన చేసాడు. కాని అదే రోజున దొంగిలించిన వాహనాన్ని నడుపుతూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు అరెస్టయ్యాడు. అతనికి ఎనిమిది నెలల జైలు శిక్ష పడింది. చాంటల్ తన శిక్షాకాలం మొత్తం అతడికి మద్దతుగా నిలిచింది. అతను విడుదలైన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. [8]

1970 లో శోభరాజ్, అరెస్టు నుండి తప్పించుకోవడానికి గర్భవతి అయిన ఛాంటల్‌తో కలిసి ఫ్రాన్సు నుండి ఆసియాకు వెళ్ళాడు. నకిలీ పత్రాలతో తూర్పు యూరప్ గుండా ప్రయాణించే సమయంలో, వారు పర్యాటకులతో స్నేహంగా చేసుకుని వారిని దోచుకున్నారు. అదే సంవత్సరం చివరలో శోభరాజ్ ముంబై వెళ్ళాడు. అక్కడ చాంటల్, ఉష అనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈలోగా, శోభరాజ్ తన నేర జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు. కారు దొంగతనాలు, స్మగ్లింగ్ పనులు మొదలుపెట్టాడు. ఈ పనుల్లో వస్తున్న లాభాలు శోభరాజ్‌ను జూద వ్యసనం వైపు తీసుకు వెళ్ళాయి. [8]

1973 లో, హోటల్ అశోకా లోని ఆభరణాల దుకాణంలో విఫల సాయుధ దోపిడీ ప్రయత్నం చేసిన తర్వాత శోభరాజ్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. శోభరాజ్ నకిలీ అనారోగ్యం వంక చూపి చాంటల్ సహాయంతో తప్పించుకోగలిగాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకే తిరిగి పట్టుబడ్డాడు. బెయిల్ కోసం శోభరాజ్ తన తండ్రి నుండి డబ్బు అప్పు తీసుకున్నాడు. ఆ వెంటనే కాబుల్‌ పారిపోయాడు.[9] అక్కడ, ఈ జంట హిప్పీల దారిలో వెళ్ళే పర్యాటకులను దోచుకోవడం ప్రారంభించారు. మరోసారి అరెస్టయ్యారు. భారతదేశంలో చేసిన విధంగానే - అనారోగ్యం నటించడం, హాస్పిటల్ గార్డుకు మత్తుమందు పెట్టడం - చేసి శోభరాజ్ మళ్ళీ తప్పించుకున్నాడు. సోభ్రాజ్ కుటుంబాన్ని వదిలి ఇరాన్‌కు పారిపోయాడు. చాంటాల్, ఇప్పటికీ శోభరాజ్‌కు విధేయురాలిగానే ఉన్నప్పటికీ, తమ నేర జీవితాన్ని విడిచిపెట్టే ఉద్దేశంతో ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్ళిపోయింది. మళ్లీ అతని ముఖం చూడనని ప్రతిజ్ఞ కూడా చేసింది. [8][10]

శోభరాజ్ తర్వాతి రెండు సంవత్సరాలు పరారీలో ఉన్నాడు. దొంగిలించిన పది పాస్‌పోర్ట్‌లను ఉపయోగించాడు. అతను తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలో వివిధ దేశాల్లో ప్రయాణించాడు. శోభరాజ్‌ తమ్ముడు ఆండ్రే ఇస్తాంబుల్‌లో అతడితో చేరాడు. శోభరాజ్, ఆండ్రేలు త్వరలోనే నేరాల్లో భాగస్వాములయ్యారు. టర్కీ, గ్రీసుల్లో పలు నేరాలు చేసారు. చివరికి ఇద్దరూ ఏథెన్స్‌లో అరెస్టయ్యారు. గుర్తింపులు మార్చుకునే ప్రయత్నం విఫలమయ్యాక, శోభరాజ్ తప్పించుకోగలిగాడు. కానీ అతని సవతి సోదరుడు కైల్లోనే ఉండిపోయాడు. గ్రీకు అధికారులు ఆండ్రేను టర్కీ పోలీసులకు అప్పగించారు. అతడు అక్కడ 18 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించాడు. [8] [11]

హత్యలు

మార్చు

మళ్ళీ పరారీలో ఉన్న శోభరాజ్ వజ్రాల వ్యాపారిగానో, మాదక ద్రవ్యాల డీలరుగానో నటిస్తూ పర్యాటకులను ఆకట్టుకుని వారితో స్నేహం చేసి మోసం చేసేవాడు. కెనడా దేశం, క్యూబెక్‌ రాష్ట్రం లోని లెవిస్ నుండి సాహస కృత్యాల కోసం థాయ్‌లాండ్‌ వచ్చిన పర్యాటకురాలు మేరీ-ఆండ్రీ లెక్లెర్క్ (1945-1984) ను శోభరాజ్ కలిశాడు. శోభరాజ్ మాయలో పడిన ఆమె, అతనికి పూర్తిగా లొంగిపోయింది. అతని నేరాలు, స్థానిక మహిళలతో అతనికున్న సంబంధాలు ఇవేవీ ఆమెకు కనిపించలేదు.

శోభరాజ్ ప్రజల్లో తన పట్ల విశ్వాసాన్ని సాధించుకుని వారిని అనుచరులుగా చేసుకునేవాడు. తాను లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని క్లిష్ట పరిస్థితుల నుండి బైట పడవెయ్యడంలో సహాయపడటం ఒక పద్ధతి. ఒక సందర్భంలో, అతను, స్వయంగా తానే దొంగిలించిన పాస్‌పోర్ట్‌లను వెతికి కనుక్కోవడంలో యానిక్, జాక్వెస్‌ అనే ఇద్దరు మాజీ ఫ్రెంచ్ పోలీసులకు సహాయం చేసాడు. మరో పన్నాగంలో శోభరాజ్, విరేచనాలతో బాధపడుతున్న డొమినిక్ రెన్నెలూ అనే ఒక ఫ్రెంచి వ్యక్తికి ఆశ్రయం ఇచ్చాడు; వాస్తవానికి శోభరాజే రెన్నెలూకు విరేచనాలయ్యేలా మందు ఇచ్చాడు. చివరకు, యువ భారతీయుడైన అజయ్ చౌదరి అనే నేరస్థుడు సోభ్రాజ్‌తో చేతులు కలిపి, అతడి తరువాత రెండవ స్థానంలో నిలిచాడు. [12] [13]

శోభరాజ్, చౌదరిలు కలిసి 1975 లో మొదటి (బహిరంగంగా తెలిసినంతవరకు) హత్యలు చేశారు. చాలా మంది బాధితులు వారి మరణానికి ముందు వారితో కొంత సమయం గడిపారు. పరిశోధకుల ప్రకారం, తమ నేరాలలో భాగమయ్యేందుకు వారిని శోభరాజ్, చౌదరిలు నియమించుకున్నారు. తాను చేసిన హత్యలు చాలావరకు ప్రమాదవశాత్తు ఎక్కువ మోతాదులో వాడిన మత్తుమందులే నని శోభరాజ్ వాదించేవాడు.[14] కానీ దర్యాప్తు అధికారులు మాత్రం - బాధితులు అతడి నేరాలను బయటపెడతామని బెదిరించినందునే అతడు వారిని హత్య చేసాడని వాదించారు. మొదటి బాధితురాలు సీటెల్‌కు చెందిన యువతి. తెరాస నోల్టన్ (సెర్పెంటైన్ పుస్తకంలో జెన్నీ బొల్లివర్ అని పేరు పెట్టబడింది) థేయిలాండ్ గల్ఫ్‌లోని టైడల్ పూల్‌లో పూల బికినీ ధరించి మునిగిపోయి కనిపించింది. కొన్ని నెలల తర్వాత నోల్టన్‌పై జరిపిన శవపరీక్ష, ఫోరెన్సిక్ సాక్ష్యాల తర్వాత మాత్రమే ఆమె మరణించినది ప్రమాదవశాత్తూ మునిగి చనిపోవడం వల్ల కాదనీ, అది హత్య అనీ [15] తేలింది.

తరువాతి బాధితుడు ఒక యువ సంచార సెఫార్డిక్ యూదు, విటాలి హకీం. కాలిపోయిన అతని మృతదేహాన్ని పట్టాయా రిసార్ట్‌కి వెళ్లే దారిలో కనుగొన్నారు. అక్కడే శోభరాజ్, అతని పెరుగుతున్న ముఠా ఉండేవి. డచ్ విద్యార్థులు హెంక్ బింటాన్యా (29) అతని కాబోయే భార్య కర్నేలియా హెమ్‌కర్ (25), శోభరాజ్‌ను హాంగ్ కాంగ్లో కలిసినపుడు వారిని థాయిలాండ్ ఆహ్వానించాడు. వారు, చాలా మందిలాగే, శోభరాజ్ చేతిలో విషప్రయోగానికి గురయ్యారు. తర్వాత అతనే వారికి స్వస్థత చేకూర్చి వాఇ అభిమానాన్ని, కృతజ్ఞతనూ చూరగొన్నాడు. వారు కోలుకుంటూండగా, శోభరాజ్‌ చేతిలో మిఉనుపు ప్రాణాలు కోల్పోయిన హకీమ్ గర్ల్‌ఫ్రెండు ఛార్మైన్ కార్రో వచ్చింది. ఆమె తన ప్రియుడి అదృశ్యంపై పరిశోధిస్తూ అక్కడికి వచ్చింది. తన బండారం బయటపడుతుందనే భయంతో, శోభరాజ్, చౌదరిలు ఆ దంపతులను హడావుడిగా బయటకు పంపించారు. 1975 డిసెంబరు 1 న వారిద్దరి గొంతులు పిసికి చంపబడ్డారు. వారి మృతదేహాలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే, కార్రో కూడా నీటిలో మునిగి చనిపోయి కనిపించింది. శోభరాజ్ బాధితురాలైన తెరెసా నోల్టన్‌ లాగానే ఈమె కూడా ఈత దుస్తులు ధరించి ఉంది. ఆ సమయంలో జరిపిన దర్యాప్తులు ఇద్దరి మహిళల హత్యలకు సంబంధం ఉందని భావించనప్పటికీ, తరువాతి కాలంలో ఆ హత్యలు శోభరాజ్‌కు "ది బికినీ కిల్లర్" అనే మారుపేరు రావడానికి కారణమయ్యాయి. [16]

బింతంజా, హేమ్‌కర్ మృతదేహాలను గుర్తించిన రోజునే, డిసెంబర్ 18 న, సోభ్రాజ్, లెక్లెర్క్‌లు మరణించిన ఆ జంట పాస్‌పోర్ట్‌లను ఉపయోగించుకుని నేపాల్‌లోకి ప్రవేశించారు. డిసెంబరు 21-22 న వారు, నేపాల్ లో లారెంట్ క్యారియరె (26, కెనడా దేశస్థురాలు), కొన్నీ బ్రోంజిక్ (29, అమెరికా) లను హత్య చేసారు. కొన్ని వనరులు ఈ ఇద్దరు బాధితులను లాడీ డుపర్, అన్నబెల్లా ట్రెమోంట్ అని తప్పుగా గుర్తించాయి. వారి మృతదేహాలను గుర్తించే లోపే, ఆ ఇద్దరి పాస్‌పోర్ట్‌లను ఉపయోగించుకుని శోభరాజ్, లెక్లెర్క్‌లు థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చారు. థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, హతులకు సంబంధించిన పత్రాలు తనవద్ద దొరికడంతో, తన ముగ్గురు ఫ్రెంచి సహచరులు తనను హంతకుడిగా అనుమానించడం మొదలుపెట్టారని శోభరాజ్ గ్రహించాడు. వారు ఈ సంగతిని స్థానిక అధికారులకు తెలియపరచి, పారిస్‌కు పారిపోయారు.

శోభరాజ్ తదుపరి గమ్యస్థానంగా వారణాసి గాని కలకత్తా గానీ చేరాడు. అక్కడ అతను ఇజ్రాయెల్ పండితుడు అవోని జాకబ్‌ను హత్య చేశాడు. కేవలం జాకబ్ పాస్‌పోర్ట్ కోసమే శోభరాజ్ అతణ్ణి హత్య చేసాడు. లెక్లెర్క్, చౌదరిలతో కలిసి ప్రయాణించడానికి సోభ్రాజ్ ఆ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాడు. మొదట సింగపూర్, తరువాత ఇండియా వెళ్ళారు. 1976 మార్చిలో, బ్యాంకాక్‌కు తిరిగి వచ్చారు, అక్కడి అధికారులు తనను వెతుకుతున్నారని తెలిసినప్పటికీ. హత్యలకు సంబంధించి ముఠాను థాయ్ పోలీసులు విచారించారు. కాని హత్య విచారణ వలన వచ్చే ప్రతికూల ప్రచారం వలన దేశ పర్యాటక పరిశ్రమకు హాని కలుగుతుందని భయపడి అధికారులు అతణ్ణి విడుదల చేసారు.

ఇదిలా ఉండగా, డచ్ దౌత్యవేత్త హెర్మన్ నిప్పెన్‌బర్గ్, బింటాంజా, హేమ్‌కర్‌ల హత్యలపై దర్యాప్తు చేస్తున్నాడు. నిప్పెన్‌బర్గ్‌కు సోభ్రాజ్ గురించి కొంత పరిజ్ఞానం ఉంది. బహుశా అతన్ని కలిసాడు కూడా. అయితే అప్పటికి శోభరాజ్ నిజమైన గుర్తింపు అప్పటికి ఆ దౌత్యవేత్తకు తెలియదు. అతను సాక్ష్యాలను సేకరించడం కొనసాగించాడు. శోభరాజ్ ఇరుగు పొరుగుల సహాయంతో, నిప్పెన్‌బర్గ్ అతనిపై కేసును నిర్మించాడు. చివరికి అనుమానితుడు దేశం విడిచి వెళ్లిన నెల రోజుల తర్వాత శోభరాజ్ అపార్ట్‌మెంట్‌లో సెర్చ్ చేయడానికి అతనికి పోలీసు అనుమతి లభించింది. నిప్పెన్‌బర్గ్ బాధితుల పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, అలాగే విషాలు, సిరంజిలతో సహా ఆధారాలను కనుగొన్నాడు.

ఈ ముగ్గురి తదుపరి మజిలీ మలేషియా. ఇక్కడ చౌదరిని రత్నాల దొంగతనం కోసం పంపారు. చౌదరి రత్నాలను శోభరాజ్‌కు ఇవ్వడం వరకూ ప్రపంచానికి తెలుసు. అతన్ని చూడడం ఇదే చివరిసారి. ఆ తరువాత చౌదరి గానీ, అతని అవశేషాలు గానీ కనబడలేదు. జెనీవాలో రత్న వ్యాపారులుగా తన, లెక్లెర్క్ పాత్రలను కొనసాగించేందుకు మలేషియాను విడిచిపెట్టే ముందు శోభరాజ్ తన మాజీ సహచరుడిని హత్య చేశాడని భావిస్తున్నారు. [12] చౌదరిని పశ్చిమ జర్మనీలో చూసినట్లు ఒకరు పేర్కొన్నప్పటికీ, ఆ వాదన రుజువు కాలేదు. చౌదరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. [13]

త్వరలోనే ఆసియాకు తిరిగివచ్చిన శోభరాజ్ బొంబాయిలో కొత్త నేర కుటుంబాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. కనిపించకుండా పోయిన బార్బరా స్మిత్, మేరీ ఎల్లెన్ ఈథర్‌ అనే ఇద్దరు పాశ్చాత్య మహిళలతో ఇది మొదలుపెట్టాడు. శోభరాజ్ తదుపరి బాధితుడు జీన్-లూక్ సోలమన్ అనే ఫ్రెంచి వ్యక్తి. ఒక దోపిడీ చేసే సమయంలో అతడిని స్పృహ కోల్పోయేల అచేసేందుకు చేసిన విషప్రయోగం, అతడి ప్రాణాలను బలిగొంది.

1976 జూలైలో న్యూఢిల్లీలో, శోభరాజ్, తన ముగ్గురు మహిళా నేర కుటుంబంతో కలిసి, ఫ్రెంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల పర్యటన బృందాన్ని మాయజేసి, తమను టూర్ గైడ్‌లుగా తీసుకునేట్లు ఒప్పించాడు. విరేచనాలను తగ్గించే మందు అని చెప్పి శోభరాజ్, వారికి మత్తుమందు ఇచ్చాడు. శోభరాజ్ ఊహించిన దాని కంటే ముందే ఆ మత్తుమందులు పనిచేసి ఆ విద్యార్థులు స్పృహ కోల్పోవడం మొదలుపెట్టారు. ముగ్గురు విద్యార్థులు శోభరాజ్ చేసిన పనిని గ్రహించారు. వారు అతడిని బంధించి, పోలీసులను సంప్రదించారు, దాంతో అతడు పట్టుబడ్డాడు. విచారణ సమయంలో, శోభరాజ్ సహచరులైన స్మిత్, ఈథర్‌లు లొంగిపోయి, తప్పులను ఒప్పుకున్నారు. సోలమన్ హత్య కేసులో సోభ్రాజ్‌పై అభియోగాలు మోపారు. ఆ నలుగురినీ అధికారిక విచారణలో ఉండగా, న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు పంపారు. 

జైలు సమయం

మార్చు

స్మిత్, ఈథర్‌లు విచారణకు మొదలవడానికి రెండు సంవత్సరాల ముందు జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించారు. శోభరాజ్ తన శరీరంలో విలువైన రత్నాలను దాచిపెట్టుకుని జైల్లోకి వెళ్ళాడు. కాపలాదార్లకు లంచాలిచ్చి జైలులో హాయిగా జీవించడంలో అతడికి అనుభవం ఉంది. శోభరాజ్ తన న్యాయవాదులను ఎడాపెడా మార్చేస్తూ, ఇటీవలే పెరోల్‌పై విడుదలైన తన సోదరుడు ఆండ్రీని సహాయంగా తెచ్చుకుని, చివరికి నిరాహార దీక్షకు దిగీ, అతను తన విచారణను ఒక ప్రహసనంగా మార్చాడు. అతనికి పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. లెక్లెర్క్ ఫ్రెంచ్ విద్యార్థులను మత్తులో ముంచెత్తినట్లు తేలింది, కానీ ఆమెకు అండాశయ క్యాన్సర్‌ రావడంతో పెరోల్‌పై విడుదలై, కెనడాకు తిరిగి వెళ్ళింది. ఆమె ఇంకా తన నిర్దోషిత్వాన్ని చెప్పుకుంటూనే ఉండేది. 1984 ఏప్రిల్ లో తన ఇంట్లో మరణించినప్పుడు కూడా ఆమె, శోభరాజ్‌కు విధేయతతోనే ఉంది. [8] [11]

తీహార్‌లో జైలు సిబ్బందికి సోభ్రాజ్ క్రమపద్ధతిలో లంచం ఇవ్వడం దారుణమైన స్థాయికి చేరుకుంది. అతను జైలు లోపల విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కాపలాదార్లు, ఖైదీలతో స్నేహం చేసి, టెలివిజన్, పసందైన ఆహారం సంపాదించేవాడు. అతను 1970 ల చివరలో ఓజ్ మ్యాగజైన్ కు చెందిన రిచర్డ్ నెవిల్లే, 1984 లో అలాన్ డాసన్ వంటి పాశ్చాత్య రచయితలకు, పాత్రికేయులకూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాను చేసిన హత్యల గురించి స్వేచ్ఛగా మాట్లాడాడు. వాస్తవానికి ఆ హత్యలు చేసినట్లు అతను ఎప్పుడూ ఒప్పుకోలేదు, తన చర్యలు ఆసియాలో "పాశ్చాత్య సామ్రాజ్యవాదాని" కి ప్రతీకారంగానే చేసినట్లు బొంకేవాడు. [8] [11]

శోభరాజ్ శిక్షాకాలం ముగిసేటప్పటికి, అతనిపై ఇరవై సంవత్సరాల థాయ్ అరెస్ట్ వారెంట్ ఇంకా చెల్లుబాటు లోనే ఉండేది. తద్వారా అతడిని థాయ్‌కి అప్పగించడం, అక్కడ అతడికి మరణశిక్ష పడడం దాదాపుగా ఖాయంగా ఉన్న పరిస్థితి అది. అంచేత 1986 మార్చిలో, జైలు జీవితంలో పదవ ఏట, శోభరాజ్ తన కాపలాదారులకు, తోటి ఖైదీలకూ పెద్ద పార్టీని ఏర్పాటు చేశాడు. వారికి నిద్రమాత్రలు, మత్తుమందు ఇచ్చి జైలు నుండి తప్పించుకుని పారిపోయాడు. ముంబై పోలీసు ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే, గోవాలోని ఓకాక్యూరో రెస్టారెంట్‌లో శోభరాజ్‌ను పట్టుకున్నాడు. శోభరాజ్ ఆశించిన విధంగానే అతని జైలు శిక్ష పదేళ్లు పొడిగించబడింది. 1997 ఫిబ్రవరి 17 న, 52 ఏళ్ల శోభరాజ్ విడుదలయ్యాడు. అతడిపై ఉన్న అనేక వారెంట్లు, సాక్ష్యాలు, అతనికి వ్యతిరేకంగా సాక్షులు కూడా లేకుండా పోయారు. అతడిని అప్పగించడానికి ఏ దేశమూ లేనందున, భారత అధికారులు అతడిని ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లనిచ్చారు. [8] [11]

సెలబ్రిటీ, తరిగి పట్టివేత

మార్చు

శోభరాజ్ సబర్బన్ పారిస్‌లో సౌకర్యవంతమైన విశ్రాంత జీవితం గడిపాడు. తనకొక పబ్లిసిటీ ఏజెంట్‌ను నియమించుకున్నాడు. ఇంటర్వ్యూల కోసం, ఫొటోల కోసం పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. అతని జీవితం ఆధారంగా తీసే సినిమా హక్కుల కోసం అతను $ 15 మిలియన్లకు పైగా వసూలు చేసాడు (ఈ కేసును దర్యాప్తు చేసిన న్యాయవాది, మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ బిశ్వ లాల్ శ్రేష్ట ప్రకారం, ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసి కోర్టులో కేసు నమోదు చేశారు).[17]

2003 సెప్టెంబరు 17 న, శోభరాజ్‌ను ఖాట్మండు వీధిలో ఒక పాత్రికేయుడు చూశాడు. ఆ పాత్రికేయుడు వెంటనే నేపాల్ అధికారులకు తెలియబరచాడు. రెండు రోజుల తరువాత యాక్ అండ్‌ యెతి హోటల్ క్యాసినోలో ఉండగా పోలీసులు శోభరాజ్‌ను అరెస్టు చేశారు. నేపాల్‌కు తిరిగి వెళ్ళడంలో శోభరాజ్ ఉద్దేశాలేంటో తెలియరాలేదు. 1975 లో బ్రోంజిక్, క్యారీర్ లను హత్య చేసినందుకు గాను 2004 ఆగస్టు 20 న ఖాట్మండు జిల్లా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఉపయోగించిన ఫోటోకాపీ సాక్ష్యాలలో ఎక్కువ భాగం నిప్పెన్‌బర్గ్ (డచ్ దౌత్యవేత్త), ఇంటర్‌పోల్ సేకరించినవే. సరిగా విచారణ చెయ్యకుండా తనకు శిక్ష విధించారని పేర్కొంటూ అతడు అప్పీల్ చేశాడు. ఫ్రెంచి ప్రభుత్వం అతనికి సహాయం అందించడానికి నిరాకరించినందున దానికి వ్యతిరేకంగా, ఫ్రాన్స్‌లో ఉన్న శోభరాజ్ భార్య చాంటాల్ యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం ముందు కేసు వేస్తున్నట్లు అతని న్యాయవాది ప్రకటించాడు. 2005 లో పటాన్ అప్పీల్స్ కోర్టు శోభరాజ్‌ను దోషిగా నిర్ధారించింది. 

ప్రస్తుత స్థితి

మార్చు

2007 చివరలో, నేపాల్‌తో మాట్లాడమని అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి శోభరాజ్ న్యాయవాది విజ్ఞప్తి చేసినట్లు వార్తల్లో వచ్చింది. 2008 లో, శోభరాజ్ నేపాలీ మహిళ నిహిత బిశ్వాస్ (తరువాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంది) తో నిశ్చితార్థం జరుపుకున్నట్లు ప్రకటించాడు. దంపతుల సంబంధం యొక్క ప్రామాణికత అమెరికన్ కండక్టర్ డేవిడ్ వుడార్డ్ ది హిమాలయన్ టైమ్స్కు రాసిన బహిరంగ లేఖలో నిర్ధారించబడింది.[18] 2008 జూలై 7 న, తన కాబోయే భార్య నిహిత ద్వారా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, తనను ఏ కోర్టూ హంతకుడిగా నిర్థారించలేదని, అంచేత తనను సీరియల్ కిల్లర్‌గా పేర్కొనవద్దనీ మీడియాను కోరాడు.[19]

శోభరాజ్ నిహితను 2008 అక్టోబరు 9 న నేపాలీ పండుగ అయిన బడా దశమి (దసరా) నాడు జైలులో పెళ్ళి చేసుకున్నాడు.[20] ఆ మరుసటి రోజున, నేపాల్ జైలు అధికారులు ఆ పెళ్ళి వార్తను తోసిపుచ్చారు. వందలాది ఇతర ఖైదీలకు చెందిన బంధువులతో పాటు, నిహిత, ఆమె కుటుంబాన్ని కూడా టికా అనే వేడుక చేసుకునేందుకు మాత్రమే జైలు లోకి అనుమతించామని వారు చెప్పారు. పెద్దలు తమ ఆశీర్వాదాలను తెలియజేయడానికి తమ కంటే తక్కువ వయస్సు ఉన్న వారి నుదిట తిలకం దిద్దే పండుగ అది. అది పెళ్లి కాదని, ఆ పండుగలో భాగమనీ వారు పేర్కొన్నారు.[21]

1975 లో అమెరికన్ బ్యాక్‌ప్యాకర్ కోనీ జో బ్రోంజిక్ హత్యకు గాను, శోభరాజ్‌కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై అతడు దాఖలు చేసిన అప్పీలుపై 2010 జూలైలో, నేపాల్ సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. జిల్లా కోర్టు తీర్పు అన్యాయమని పేర్కొంటూ, న్యాయమూర్తులు జాత్యహంకారానికి పాల్పడి శిక్షను ఖరారు చేశారని ఆరోపిస్తూ 2006 లో శోభరాజ్ ఈ అప్పీలు చేసుకున్నాడు.  

2010 జూలై 30 న, కానీ జో బ్రోంజిక్ హత్యకు గాను ఖాట్మండులోని జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. నేపాల్‌లో అక్రమంగా ప్రవేశించినందుకు రూ. 2,000 జరిమానా కూడా విధించింది. శోభరాజ్ ఆస్తులన్నింటిని జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. శోభరాజ్ "భార్య" నిహిత, "అత్తగారు" శకుంతల థాపా (ఆమె న్యాయవాది) ఆ తీర్పుపై అసంతృప్తి వెలిబుచ్చారు. శోభరాజ్‌కు న్యాయం "తిరస్కరించబడిందని", "న్యాయవ్యవస్థ అవినీతిమయమైంద"ని థాపా విమర్శించింది.[22] ఈ వ్యాఖ్యలకు గాను వారిపై కోర్టు ధిక్కార అభియోగాలను మోపి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు[23]

18 సెప్టెంబర్ 2014 న, భక్తాపూర్ జిల్లా కోర్టులో, కెనడియన్ టూరిస్ట్ లారెంట్ క్యారియర్ హత్య కేసులో శోభరాజ్ దోషిగా నిర్ధారించబడ్డాడు.[24]

2018 లో, శోభరాజ్ పరిస్థితి విషమంగా మారింది. అతడికి అనేకసార్లు శస్త్రచికిత్స జరిగింది. అతనికి అనేక ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసారు. మరికొన్ని సర్జరీలు చెయ్యాలని నిర్ణయించారు.[25][26]

ప్రజా బాహుళ్య సంస్కృతిలో

మార్చు
  • శోభరాజ్ విషయంగా రెండు నాన్ ఫిక్షన్ గ్రంధాలు వచ్చాయి: థామస్ థాంప్సన్ రాసిన సర్పెంటైన్ (1979),[27] రిచర్డ్ నెవిల్లె, జూలీ క్లార్క్ రాసిన ది లైఫ్ అండ్ క్రైమ్స్ ఆఫ్ చార్లెస్ శోభరాజ్ (1980).[28] నెవిల్లే, క్లార్క్ ల పుస్తకం 1989 లో టీవీ కోసం రూపొందించిన షాడో ఆఫ్ ది కోబ్రా సినిమాకి ఆధారం.[29]
  • 2015 లో ప్రవాళ్ రామన్ దర్శకత్వంలో సైజ్‌నూర్ నెట్‌వర్క్ వారి బాలీవుడ్ చిత్రం మెయిన్ ఔర్ చార్లెస్ వచ్చింది. చార్లెస్ సోభ్రాజ్ న్యూఢిల్లీలోని తీహార్ జైలు నుండి తప్పించుకోవడంపై ఇది ఆధారపడింది.[30][31] ఈ చిత్రాన్ని మొదట పూజా భట్ నిర్మించినా, షూటింగ్ మధ్యలో ఉన్న విభేదాల కారణంగా, ఆమె సినిమా నుండి తప్పుకుంది.[32]
  • TV సిరీస్ లా & ఆర్డర్: క్రిమినల్ ఇంటెంట్, ఒలివియా డి అబో పాత్ర పోషించిన నికోల్ వాలెస్ పాత్ర మేరీ-ఆండ్రీ లెక్లెర్క్‌పై ఆధారపడింది. " స్లిథర్ " ఎపిసోడ్‌లో (తొలుత దీనికి "సర్పెంటైన్" అనే పేరు పెట్టాలనుకున్నారు), మైఖేల్ యార్క్ వాలెస్‌కు మార్గదర్శకుడు, నేరాల్లో మాజీ భాగస్వామి అయిన బెర్నార్డ్ ఫ్రీమాంట్‌గా కనిపిస్తాడు. ఆ పాత్ర శోభరాజ్ మీద ఆధారపడినది.
  • 2019 లో, నెట్‌ఫ్లిక్స్, BBC కలిసి శోభరాజ్ పట్టుబడి, విచారణలపై దృష్టి సారించి ది సర్పెంట్ అనే ఎనిమిది భాగాల సిరీస్‌ను తయారు చేస్తున్నట్లు ప్రకటించాయి.[33]

ఇవి కూడా చూడండి

మార్చు
  • అద్నాన్ పాత్రవాలా హత్య కేసు
  • ఆటో శంకర్
  • గీత, సంజయ్ చోప్రా కిడ్నాప్ కేసు
  • జోషి-అభ్యంకర్ వరుస హత్యలు
  • జెస్సికా లాల్ హత్య
  • నీరజ్ గ్రోవర్ హత్య కేసు
  • నిరుపమ పాఠక్ మరణం కేసు
  • నితీష్ కటారా హత్య కేసు
  • 2008 నోయిడా డబుల్ మర్డర్ కేసు
  • నోయిడా వరుస హత్యలు
  • రామన్ రాఘవ్
  • స్నేహల్ గవరె హత్య
  • స్టోన్మాన్

మూలాలు

మార్చు
  1. "Sobhraj finally Convicted & Life-sentenced". Archived from the original on 25 జూన్ 2011. Retrieved 30 July 2010.
  2. "Bikini Killer". Archived from the original on 22 December 2015. Retrieved 23 January 2016.
  3. "SOBHRAJ – Or How To Be Friends With A Serial Killer (FULL FEATURE)". Retrieved 6 October 2018.
  4. "Bikini killer Charles Sobhraj and his complete life story! Where is he now?". Archived from the original on 7 అక్టోబరు 2018. Retrieved 6 October 2018.
  5. "Charles Sobhraj profile". Archived from the original on 30 జనవరి 2009. Retrieved 23 January 2016.
  6. "Charles Sobhraj: The Serpent – Famous Criminal – The Crimes". Archived from the original on 9 అక్టోబరు 2011. Retrieved 27 September 2009.
  7. Profile, trutv.com; accessed 1 February 2016.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 "12 Things You Didn't Know About The Infamous Charles Sobhraj". Retrieved 23 January 2016.
  9. Sobhraj profile, crimeandinvestigation.co.uk; accessed 1 February 2016.
  10. Gary Indiana. "It's a Secret: My Time with Charles Sobhraj, the Bikini Killer". VICE. Retrieved 23 January 2016.
  11. 11.0 11.1 11.2 11.3 Nandini Ramnath. "Charles Sobhraj hated India, but the country got to him in the end". Scroll.in. Retrieved 23 January 2016.
  12. 12.0 12.1 "Charles Sobhraj - Crime Library on truTV.com". Retrieved 27 September 2009.
  13. 13.0 13.1 "Hunt still on for Sobhraj's partner in crime". Archived from the original on 21 ఆగస్టు 2006. Retrieved 27 September 2009.
  14. "The Most Evil Person in the World - The Bikini Killer". 2018-07-01.
  15. Cissel, Jim. "Charles Sobhraj – The Serpent (Serial Killer Documentary)". National Geographic. Retrieved 13 December 2012.
  16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mammoth అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  17. "The 'bikini-killer' linked to murders throughout Asia". BBC News. 12 August 2004. Retrieved 27 September 2009.
  18. Singh, Rishi (21 July 2008). "Uneasy Silence" (Letters). The Himalayan Times. Retrieved 16 May 2021.
  19. "Press Release of Charles Shobhraj". Mysansar. Archived from the original on 24 July 2012. Retrieved 28 July 2012.
  20. "Charles Sobhraj ties the knot with Nihita Biswas". The Times of India. 9 October 2008.
  21. "Sobhraj wedding a farce: Nepal jail authorities". The Times of India. 10 October 2008. Archived from the original on 2011-08-11. Retrieved 2021-09-14.
  22. "Video of Shakuntala Thapa claiming "judiciary is corrupt". Mysansar. Archived from the original on 17 December 2011. Retrieved 3 October 2011.
  23. "SC orders judicial custody for Nihita, Shakuntala". The Himalayan Times. Archived from the original on 7 జనవరి 2015. Retrieved 1 February 2016.
  24. "Nepal court convicts 'Bikini killer' Charles Sobhraj of second murder". BBC News. 18 September 2014.
  25. Dr Raamesh Koirala (18 December 2018). "Testimony of a Surgeon Operating on Charles Sobhraj". Rediff News. Retrieved 30 January 2019.
  26. "'Bikini Killer' Charles Sobhraj Critical in Hospital, Says Mother-In-Law". News 18. 23 June 2017. Retrieved 30 January 2019.
  27. Thompson, Thomas (1979). Serpentine. New York: Knopf Doubleday Publishing Group. ISBN 9780385130172.
  28. Neville, Richard; Clarke, Julie (1980). The Life and Crimes of Charles Sobrhaj. Sydney: Pan Books. ISBN 0-330-27144-X.
  29. "Shadow of the Cobra (TV Movie 1989)". IMDb. 18 July 1989.
  30. "How Charles Sobhraj escaped Tihar". Retrieved 1 February 2016.
  31. "First Look: Randeep Hooda plays Charles Sobhraj in 'Main Aur Charles'". IBNLive. Archived from the original on 2014-01-25. Retrieved 2021-09-14.
  32. "Main Aur Charles Movie Review". The Times of India.
  33. Clarke, Elsa Keslassy,Stewart; Keslassy, Elsa; Clarke, Stewart (2019-07-15). "Netflix Boards BBC's 'The Serpent,' Starring Tahar Rahim as Serial Killer (EXCLUSIVE)". Variety (in ఇంగ్లీష్). Retrieved 2019-07-30.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)