చిత్తూరు జిల్లా చరిత్ర

చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో ఒకటి. 1953లో మద్రాసు నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1959 లో సరిహద్దు గురించి కొంత వివాదం నెలకొంది. ఈ వివాదాలను పటాస్కర్ కమీషన్ పరిష్కరించింది. దీని ప్రకారం తిరుత్తణి చిత్తూరు జిల్లా నుండి మద్రాసు రాష్ట్రానికి, పొన్నేరి, తిరువళ్ళూరు తాలూకా నుండి కొన్ని గ్రామాలను మద్రాసు రాష్ట్రం నుండి చిత్తూరు జిల్లాలోకి మార్పు చేశారు.[1] దీనికి ఉత్తరాన అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాలు, తూర్పు దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

జిల్లా వైశాల్యం సుమారు 15,763 చ.కి.మీ. చిత్తూరు పట్టణం ఈ జిల్లా యొక్క ముఖ్యకేంద్రం.[2]

చరిత్ర మార్చు

తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో నవీన శిలా యుగం నుంచి మానవులు నివసించినట్లు అక్కడక్కడ కనిపించే పాండవుల గుళ్ళ వలన విశ్వసించబడుతోంది. సా. శ 3వ శతాబ్దంలో ఈ జిల్లా పల్లవుల రాజ్యపాలనలో ఉండేది. కొంతకాలం తర్వాత చోళ రాజుల ఆధీనంలోకి వచ్చింది. వీరి ఏలుబడి చాలాకాలం సాగింది.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం మార్చు

సా. శ 11వ శతాబ్దం చోళుల నాటి అనేక శాసనాలు శ్రీకాళహస్తీశ్వర ఆలయ గోడలపై చెక్కబడ్డాయి. ఈ శాసనాలు ఆనాటి రాజులు ఆలయంలో దీపారాధన మొదలైన కైంకర్యాలకు ఏర్పాటు చేసిన సొమ్మును సూచిస్తున్నాయి.[3] 12వ శతాబ్దంలో కంచి నుంచి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజేంద్ర చోళుడు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించాడు.

సా. శ 13వ శతాబ్దంలో చోళుల శకం అంతరించింది. దాంతో ఈ ప్రాంతం కొన్నాళ్ళు సాళువ రాజుల ఆధీనంలోకి వచ్చింది. సాళువ రాజులలో ఒకడైన అక్కరాజు కూతురు పద్మావతిని శ్రీవేంకటేశ్వరుడు వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. చోళులకు సామంత రాజుగా ఉన్న యాదవరాజులు జిల్లాలోని చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ వంశానికి చెందిన ఇమ్మడి నరసింహుడు సా. శ 10వ శతాబ్దంలో చంద్రగిరి కోటను నిర్మించాడు. చోళుల పతనానంతరం యాదవులు స్వతంత్రులై నారాయణ వనం కేంద్రంగా పరిపాలించారు. సా. శ 1324లో ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనలు ఈ ప్రాంతంపైకి దండెత్తి స్వాధీనం చేసుకున్నాయి. కానీ వీరిపాలన ఎంతో కాలం సాగలేదు. సుల్తానుల పాలనను ధిక్కరించి హరిహర రాయలు, బుక్క రాయలు స్థాపించిన విజయనగర సామ్రాజ్యంలో ఈ జిల్లా కలిసిపోయింది. శ్రీకాళహస్తి జమీందారులు విజయనగర రాజులకు సామంతులుగా ఉంటూ చిత్తూరు జిల్లాలోకి కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఈ జమీందారు పరిపాలన ఉత్తర ఆర్కాట్, చెంగల్పట్టు, నెల్లూరు జిల్లాలోకి వ్యాపించింది.

ఆంగ్లేయుల రాక మార్చు

విజయనగర సామ్రాజ్య పతనానంతరం శ్రీరంగరాయలు చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇమ్మడి నరసింహుడు కట్టిన కోటను విజయనగర రాజుల కాలంలో బాగా కట్టుదిట్టం చేశారు. మూడవ రంగరాయలు పరిపాలిస్తున్న సమయంలో ఆయన దగ్గర దామెర్ల వెంకటాద్రి అనే సామంతుడు ఉండేవాడు. ఈయన ఆంగ్లేయులు తమ వస్త్ర కార్మాగారం కోసం అనువైన స్థలం వెతుకున్న సమయంలో చంద్రగిరి రాజ్యంలో ఉన్న మద్రాస పట్టణం వారికి అనువుగా ఉంటుందనీ వారిని ఆహ్వానించాడు. ఆ సమయంలో వెంకటాద్రి సోదరుడు అయ్యప్ప మద్రాసుకు పశ్చిమంగా ఉన్న పూనమలైలో నివసిస్తూ తీర ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు. ఈ ఇద్దరు సోదరులు శ్రీకాళహస్తిలోని వెలుగోటి వంశానికి చెందినవారు. ఈ ప్రాంతంలో వస్త్రాల ఉత్పత్తి అధికంగా ఉండటంతో ఆంగ్లేయులు పరిశ్రమ స్థాపిస్తే తమకు కూడా లాభదాయంగా ఉంటుందని వీరు భావించారు. 1639 వేసవి కాలంలో ఆంగ్లేయుడైన ఫ్రాన్సిన్ డే మద్రాసు, దాని పరిసర ప్రాంతాల్ని సందర్శించి అక్కడ నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకే దొరుకుతుండటం గమనించాడు. దామెర్ల సోదరులతో సంప్రదింపులు జరిపి 1639 జులై 2 వ తేదీన మద్రాసులో కోటను నిర్మించేందుకు చంద్రగిరి రాజు నుండి అనుమతి పొందారు. ఈ అనుమతి ప్రకారం ఆంగ్లేయులు స్వయంగా నాణేలు ముద్రించుకోవచ్చు. నౌకా కేంద్రంలో లభించే ఆదాయం లోనూ, పన్నుల ద్వారా లభించే ఆదాయంలోనూ సగభాగాన్ని ఆంగ్లేయులు పొందవచ్చు. అం తే కాకుండా నేతగాండ్రు తగినంత వస్త్రోత్పత్తి చూపించని ఎడల వారికి ముందస్తుగా ఇచ్చిన సొమ్మును వాపసు ఇస్తామని చంద్రగిరి రాజు హామీ ఇచ్చాడు.[4] తర్వాతి కాలంలో ఈ నిర్మాణమే దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయుల పెత్తనానికి నాంది పలికింది.

నవాబుల పరిపాలన మార్చు

1646లో చిత్తూరు జిల్లా గోల్కొండ నవాబుల వశమైంది. కడప నవాబు మదనపల్లి, వాయల్పాడు, పుంగనూరు తాలూకాలను, మిగతా తాలూకాలను ఆర్కాటు నవాబు గోల్కొండ నవాబు అనుచరులుగా పరిపాలించారు. గోల్కొండ రాజ్యం అంతమైన తర్వాత చిత్తూరు జిల్లాను కర్ణాటక నవాబులు పరిపాలించారు. 1758లో ఆర్కాటు నవాబు తమ్ముడైన అబ్దుల్ వాహెల్ భాను చంద్రగిరి కోట నుంచి పరిపాలించాడు. మహారాష్ట్రులు ఆర్కాటు నవాబైన దోస్త్ ఆలీఖాన్ ను దామల్ చెరువు వద్ద చంపివేశారు. వారి తర్వాత మైసూరు పరిపాలకుడైన హైదర్ ఆలీ చిత్తూరు జిల్లాను ఆక్రమించి కొద్దికాలం పరిపాలించాడు. మైసూరు యుద్ధాలలో హైదరాలీ ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయాడు. 1792లో జరిగిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం మదనపల్లి, వాయల్పాడు, చంద్రగిరి తాలూకాలు నైజాం నవాబుకు, మిగతా తాలూకాలు ఆర్కాటు నవాబుకు ఆంగ్లేయులు జిల్లాను పంచి ఇచ్చారు. బ్రిటిష్ సైన్యాల ఖర్చుల కింద సైనిక సహకార పద్ధతిని అనుసరించి నైజాం నవాబు రాయలసీమ జిల్లాలతో బాటు చిత్తూరు జిల్లాను కూడా 1801 లో ఆంగ్లేయులకు కట్టబెట్టాడు.

చిత్తూరు ఉత్తర ఆర్కాటు జిల్లాకు కేంద్రంగా ఉండేది. కొంతకాలం తర్వాత అక్కడ తీవ్ర అలజడులు ప్రబలగా జిల్లా కార్యస్థానాన్ని ఆంగ్లేయులు చిత్తూరు నుంచి వెల్లూరుకు మార్చారు. అయినా 1874 వరకు చిత్తూరు ఆంగ్లేయుల సేనలకు కేంద్రంగా ఉండేది. 1911లో కడప జిల్లా నుండి మదనపల్లి, వాయల్పాడు తాలూకాలను, మైసూరు జిల్లా నుండి పుంగనూరు, కుప్పం తాలూకాలను, చెంగల్పట్టు జిల్లా నుండి తిరుత్తణి తాలూకాలను విడదీసి చిత్తూరు జిల్లా అని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయబడింది. ఆంగ్లేయుల వశమయ్యే నాటికి జిల్లా అంత జమీందారుల ఆధీనంలో ఉండేది. కొందరు జమీందారులు ఆంగ్లేయులను ఎదిరించి తిరుగుబాటు లేవదీశారు. ఇట్టివారిలో శ్రీకాళహస్తి, కార్వేటినగరం సంస్థానాలు ముఖ్యమైనవి. కానీ ఈ జమీందారీలు నిర్వహణ సరిగా లేక అప్పులపాలై అంతరించిపోయాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమీందారీ విధానం పూర్తిగా రద్దయి రైతు వారీ విధానం అమల్లోకి వచ్చింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 20 జిల్లాల్లో ఒకటిగా ఆ రాష్ట్రంలో భాగమైంది.

మూలాలు మార్చు

  1. బూదరాజు, రాధాకృష్ణ (1983). తెలుగు మాండలికాలు :చిత్తూరు జిల్లా. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 3.
  2. వై. వి., కృష్ణారావు; ఏటుకూరు, బలరామమూర్తి (1976). ఆంధ్రప్రదేశ్ దర్శిని. విజయవాడ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. pp. 1062–1068.
  3. కె. జి., కృష్ణన్ (1964). South Indian Inscriptions Vol.17. మద్రాసు: ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. p. 159.
  4. పి., రఘునాథరావు (1997). ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. కొత్త ఢిల్లీ: స్టెర్లింగ్ పబ్లిషర్స్. p. 42.