జాతీయ చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగింది.

జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవం
భారత చేనేత లోగో
జరుపుకొనేవారుభారతదేశం
ప్రారంభం2015
జరుపుకొనే రోజు7 ఆగష్టు
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రారంభంసవరించు

2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72 మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది.[1]

 
భారత చేనేత లోగో ఆవిష్కరిస్తున్న మోడీ

చరిత్రసవరించు

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. భారత స్వాతంత్రోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యర్రమాద వెంకన్న నేత చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని పిలుపునిచ్చాడు.[2][3][4]

అప్పటి భారత రాష్ట్రపతిప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వెంకన్న ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. 2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి వచ్చాడు. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో వెంకన్న సారధ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. 2012, ఆగస్టు 7న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ చేసి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు.2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది.2015,ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు.[5]

ఇతర వివరాలుసవరించు

  1. చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు.
  2. 2018లో యాదాద్రి - భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టులేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టులేకుండా మగ్గంపై తయారుచేశారు.[6]

మూలాలుసవరించు

  1. సాక్షి (13 August 2015). "ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  2. ఆంధ్రజ్యోతి (6 August 2015). "చేనేతకూ వచ్చింది ఒక రోజు..." Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  3. ఆంధ్రజ్యోతి (7 August 2017). "చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర..." Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  4. ఆంధ్రజ్యోతి (భీమారం(వరంగల్ అర్బన్)) (7 August 2017). "చేనేతన్నకు కష్టకాలం...కడుపు నింపని మగ్గం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
  5. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్-జనవాక్యం (6 August 2018). "వస్త్రం అస్త్రమైన రోజు". www.andhrajyothy.com. యర్రమాద వెంకన్న నేత. Archived from the original on 19 September 2019. Retrieved 19 September 2019.
  6. ఆంధ్రజ్యోతి (4 August 2018). "కుట్టు లేని త్రివర్ణ పతాకం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.