జోషినందివాలా
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా .ఏ.గ్రూపులోని 36వ కులం. జోతిష్యం హస్తసాముద్రికం. చిలుక జో„స్యం వీరి వృత్తి. అల్లం మురబ్బా డబ్బా పట్టుకుని వీధివీధికి వెళ్లి అమ్ముతారు. బట్టలు, పాత్రలు అమ్ము కోవటం వంటి చిరు వ్యాపారా లు చేస్తున్నారు. సంచార జీవులు. ఐదు కాళ్లు, ఆరు కాళ్ల ఎద్దులను వెంటపెట్టుకుని ఊరూరా తిరుగుతుంటారు. కనుక నందివాలాలు అయ్యారు. జోతిష్యం చెప్పటంవల్ల జోషి నందివాలాలు అయ్యారు. వీరు ఏ గ్రామానికైనా వెళ్లేముందు ముందుగా అక్కడి పోలీస్ పటేలునో, గ్రామపెద్దనో కలిసి తమ వివరాలు తెలియజేస్తారు. కుటుంబాన్ని ఆ గ్రామంలోనే ఉంచి చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలు తిరిగి వీరు జోతిష్యం చెప్పి వస్తారు. ఏ గ్రామంలోనూ మూడు నాలుగు రోజులకు మించి ఉండరు. జోషినంది వాలాల కుటుంబాలలో పెద్దవాళ్లు జోస్యం చెప్పటానికి ఊర్లు పట్టి తిరిగితే పిల్లలు `అక్షయ పాత్ర' పట్టుకుని గ్రామంలో యాచిస్తారు. సమీప గ్రామాలలో జోస్యం చెప్పడం పూర్తయ్యాక వేరొక గ్రామంలో విడిది చేయటానికి మళ్లీ ప్రయాణం కడతారు. అయితే, వెళ్లే ముందు తాము ఏ గ్రామానికి వెడుతున్నారో గ్రామపెద్దకు చెప్పి వెళ్లాలి. అక్కడ ఎన్నిరోజులు ఉండేది కూడా చెప్పాలి. తమ కుటుంబం ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరచుకున్నా జోతిష్యం చెప్పేవారు మాత్రం వారం పదిరోజులు గ్రామాలలో తిరిగి వెళుతుంటారు. పిల్లలకు 12, 13 ఏళ్ల వయసు వస్తే ఈ కుటుంబాలలో పెద్దవాళ్లు తమ విద్యను పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తారు. వీరు మహారాష్ర్ట నుంచి వలసవచ్చారు కాబట్టి `దాతే' పంచాంగాన్ని అనుసరిస్తారు. దీన్ని షోలాపూర్ పంచాంగం అని కూడా అంటారు. అయితే అక్షరజ్ఞానం ఉన్న పిల్లలకే పంచాంగం చూడటం, గ్రహస్థితులను లెక్కగట్టటం నేర్పిస్తారు. వీరు ఎక్కడ ఉన్నా తమ మాతృభాష మరాఠీని మాత్రం విస్మరించరు. పిల్లలకు మరాఠీని నేర్పిస్తారు. పిల్లల వయసు పెరిగే కొద్దీ ఫేస్ రీడింగ్ వంటి విద్యలు, వాటిలో మెళకువలను చెబుతారు. హస్తసాముద్రికం కూడా నేర్పిస్తారు. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదివిస్తారు. వాస్తు శాస్త్రం బోధిస్తారు. అయితే వీరిని వాస్తు అడిగేవారి సంఖ్య తక్కువే అయినా అందులో ఆదాయం ఎక్కువ కనుక దాన్ని కూడా పిల్లలకు నేర్పిస్తారు. చిలక జోస్యం కూడా చెబుతారు. జోస్యం చెప్పించుకోవటానికి వచ్చినవారి పేరుకు అనుకూలంగా ఉన్న రాశి తాలూకు కవర్‌ను తీయటంలో చిలకకు శిక్షణ ఇస్తారు. వారఫలాలలో వచ్చే పేపర్ కటింగ్‌లను వీరు ఆయా రాశులకు తగినట్టు కవర్లలో పెట్టి చిలక జోస్యం చెబుతారు. రెక్కలు విచ్చుకోని చిన్న చిలకలను పట్టుకుని దాదాపు రెండు సంవత్సరాలపాటు శిక్షణ ఇస్తారు. చిలుక ఆయుఃప్రమాణం ఐదున్నర ఆరేళ్లే కనుక కనీసం ఇవి వీరికి మూడేళ్లయినా సహకరిస్తాయి. చిలక చనిపోతే ఇసుకలోనో, నదిలోనో పూడ్చిపెడతారు. హస్తసాముద్రికం కన్నా, జోతిష్యం చెబితేనే ఎక్కువ రాబడి ఉంటుంది. కంప్యూటర్‌లో జోతిష్యం మొత్తం వివరాలను అందంగా ఫైల్ చేసి ఇవ్వటంతో ఎక్కువమంది అటువైపు మొగ్గుచూపుతున్నారు.