టాంక్ బండ్
టాంక్ బండ్ (Tank Bund) గా ప్రసిద్ధమైన ఈ రహదారి 1568లో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఊంది కాబట్టి, టాంక్ బండ్ (చెరువు గట్టు) గా ప్రసిద్ధి చెందింది. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది హుస్సేన్ సాగర్ మీద ఉన్న టాంకు బండ్. ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి (ముఖ్యంగా ఆదివారం, ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.
చరిత్ర
మార్చుచెరువు గట్టుమీద మార్గంలో పూర్వము చెరువు కనిపించకుండా ఎత్తైన ప్రహరీ గోడలు ఉండేవి. 1946లో ఇది నచ్చని అప్పటి హైదరాబాదు దీవాను సర్ మీర్జా ఇస్మాయిల్ గోడలను కూల్చివేయించి వాటి స్థానంలో ఇనుప కడ్డీలతో కూడిన ప్రాకారాన్ని (రెయిలింగు) ను కట్టించాడు. ఈ విధంగా చెరువు కట్టమీద నడిచే వారికి చల్ల గాలి పీల్చుకుంటూ, చెరువు యొక్క దృశ్యాన్ని అస్వాదించే విధంగా మార్పులు చేశాడు.[1]
మూసీ నది ఉపనది పైన ఈ కట్టను 1562లో ఇబ్రహీమ్ కులీ కుతుబ్‌షా హైదరాబాదు నగరానికి నీటి సరఫరా నిమిత్తం కట్టించాడు. తనను అనారోగ్యంనుండి కోలుకునేలా చేసిన హుస్సేన్ షా వలీ గౌరవార్ధం ఈ చెరువుకు హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టాడు.[2] అప్పటికి ఇంకా చరిత్రాత్మకమైన చార్మినార్ నిర్మాణం జరుగలేదు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు నగరానికి, బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న కంటోన్మెంట్‌కు మధ్య రాకపోకలకు ఈ కట్ట ఒక మార్గమయ్యింది. 1830లో తన కాశీయాత్రలో భాగంగా నగరాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ గట్టుగా నిర్మించిన బాట గురించి వ్రాశారు. ఆ కట్టమీద ఇంగ్లీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడిచి చెరచకుండా భాటకు ఇరుపక్కలా తమ పారా పెట్టియున్నారు. అని ఆయన వ్రాశారు. ఏనుగుల వీరాస్వామయ్య రాసిన ప్రకారం ఐరోపియన్లు మినిహా మిగిలిన వారికి ముందస్తుగా అనుమతి లేకుండా ఎక్కనిచ్చేవారు.[3]
అందచందాలు
మార్చుక్రమంగా హుస్సేన్ సాగర్ నీరు త్రాగు నీటి అవసరాలకు పనికిరాకుండా పోయింది. అయితే నగరం విస్తరిస్తున్న కొద్దీ టాంక్‌బండ్ రోడ్డుమీద వాహనాల రద్దీ బాగా పెరిగింది. రోడ్డును అభివృద్ధి పరుస్తూనే వివిధ ప్రభుత్వాలు దానిని, దాని పరిసరాలను సుందరంగా తీర్చి దిద్దారు. పార్కులు, విగ్రహాలు, మందిరాలు, భవనాల సముదాయంతో ఇది నగరంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నది.
బుద్ధ విగ్రహం
మార్చుటాంక్బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 మీటర్ల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కి.మీ. దూరంనుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకొంది. బార్జ్‌తో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్ఠించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.
33 మహానుభావుల విగ్రహాలు
మార్చునందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ రోడ్డుపై 33 విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. ఈ 33 మంది వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయులు. వారి చిత్రాలన్నిటిని, ఈ వ్యాసం చివర ఉన్న దృశ్య మాలికలో చూడవచ్చు. ఈ విగ్రహాలు ఏర్పరచే సమయంలో, మరికొంతమంది విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పరచలేదని కొంత వివాదం ఏర్పడింది. ముఖ్యంగా, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, వేయు పడగలు, రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలను రచించిన విశ్వనాధ సత్యనారాయణ విగ్రహం, తన కవితలతో, పాటలతో తెలుగువారిని వెన్నలస్నానాలు చేయించిన దాశరథిగారి విగ్రహం, అపర చాణక్యుడుగా పేరుగాంచిన తెలుగు ప్రధాని పి.వి నరసింహారావుగారి విగ్రహాలు ఇక్కడ ఏర్పరచకపోవటం ఒక లోపంగా ఇప్పటికీ సాహితీ అభిమానులు బాధపడుతుంటారు. చిత్రమాలికలో చూపినట్టుగా విగ్రహాలఅన్నింటిలో కొన్ని నేడు లేవు..... విచిత్రమేమిటంటే రాజకీయాలతో, ఉద్యమాలతో, వివాదాలతో, ప్రాంతాలతో సంబంధంలేని మొత్తం తెలుగువారందరికీ చెందిన అన్నివిగ్రహాలలో కొన్ని తెలుగువారిచేతనే కూల్చబడి, పగలగొట్టబడి, తగలబెట్టబడి, విరగ్గొట్టబడి, తొక్కబడి హుసేన్ సాగర్ లో విసిరివేయబడటం....
టాంకు బండ్ పరిసరాలు
మార్చుసరస్సుకు టాంక్‌బండ్ ఒక కట్ట కాగా రెండవ ప్రక్క నెక్‌లేస్ రోడ్, ఐ-మాక్స్ థియేటర్, ఎన్.టి.ఆర్. ఉద్యానవనం శోభాయమానంగా వృద్ధి చెందాయి. సెక్రటేరియట్ భవనం, పెద్ద ఫ్లై ఓవర్, బోట్ క్లబ్, లుంబిని పార్కు, రాష్ట్రపతి రోడ్డు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. ఉత్తరాన సంజీవయ్య పార్కు, హజరత్ సైదాని మా సమాధి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి టాంక్‌బండ్‌కు సమాంతరంగా దిగువ టాంక్‌బండ్ రోడ్ వేశారు. ఇది ప్రస్తుతం పత్రిక, టెలివిజన్ కార్యాలయాల కేంద్రంగా విలసిల్లుతున్నది. ఈ దిగువ టాంక్‌బండ్ రోడ్డు దక్షిణాన కట్ట మైసమ్మ గుడి, దాని సమీపంలో ఇందిరా పార్కు ఉన్నాయి.[4] ఇలా టాంక్‌బండ్ ప్రస్తుతం హైదరాబాదు సికందరాబాదు నగరాలలో ముఖ్యమైన ప్రయాణ మార్గంగానూ, పర్యాటక స్థలంగానూ ఉంది.
టాంక్ బండ్‌పై జరిగే ఉత్సవాలు
మార్చుగణేశ విగ్రహాల నిమజ్జనం
మార్చుప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణేశ విగ్రహాల నిమజ్జనం జంటనగరాలలో ఒక ముఖ్యమైన వార్షిక సంరంభంగా పరిణమించింది.దీనివల్ల, ఈ సరస్సును "వినాయక్ సాగర్"గా కూడా కొంతమంది పిలవటం పరిపాటయ్యింది. కోలాహలంగా, అనేక వాహనాలలో, వివిధ సైజులలో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపుగా 30,000 పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడుతాయని అంచనా. ట్రాపిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండడానికి నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తారు. బందోబస్తు కోసం 30,000 పైగా పోలీసు బలగం ఈ సమయంలో విధి నిర్వహరణలో ఉంటారు. విగ్రహాల సంఖ్యను, ఊరేగింపు రూట్లను, నిమజ్జనా కార్యకలాపాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు.[5] నిమజ్జనం జరిగిన మర్నాడు చూస్తే, అంతకుముందువరకు ఎన్నో పూజలందుకున్న విగ్రహాల మీదకెక్కి వాటిని పగులగొట్టి వాటిల్లో అమర్చిన ఇనప చువ్వలు తీసుకుపోతున్నవారు కనిపిస్తారు. చివరకు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముక్కలుగా మారిన ఆ విగ్రహాలు నీటిలో మిగిలిపోతాయి.ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేయబడి, రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద యెత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమౌతుందని పర్యావరణ పరిరక్షణావాదులు హెచ్చరిస్తున్నారు.[6] విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలావరకు తగ్గించవచ్చని, నిపుణుల అభిప్రాయం.
దృశ్య మాలిక
మార్చుటాంకు బండ్ మీద ఉన్న విగ్రహాల దృశ్య మాలిక
మార్చు-
సమర్పణ ఫలకం
విగ్రహ విధ్వంసం
మార్చుప్రత్యెక తెలంగాణా ఉద్యమంలో భాగంగా టాంక్ బండ్ మీద వారి దృష్టిలో ఆంధ్రా ప్రాంతపు వారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి పై దృశ్య మాలికలో కనపడే అనేక విగ్రహాలు లేవు.
ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు
మార్చుబతుకమ్మ పండుగ సందర్భంగా 2016 అక్టోబర్ 9న తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
-
హుస్సేన్ సాగర్ లో పడవలమీద బతుకమ్మలు
-
'బతుకమ్మ' వేడుకలలో భాగంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ
-
'బతుకమ్మ' వేడుకలలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
-
'బతుకమ్మ' వేడుకలలో పాల్గొన్న విదేశీ మహిళలు
-
'బతుకమ్మ' వేడుకలలో భాగంగా హుస్సేన్ సాగర్ లో పడవమీద బతుకమ్మ
-
'బతుకమ్మ' వేడుకలలో బాణాసంచా మెరుపులు
మూలాలు
మార్చు- ↑ The Eighteenth Parallel By A. Ashokamitran, G. Narayanan పేజీ.92[permanent dead link]
- ↑ "ఇండియన్ ఫొటోగ్రాఫర్ బ్లాగు". Archived from the original on 2012-09-05. Retrieved 2012-09-05.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ [సులేఖ.కమ్ లో ధనుంజయరెడ్డి వ్యాసం]
- ↑ "న్యూస్ పాయింట్ వార్త 17/9/2007". Archived from the original on 2012-01-21. Retrieved 2008-06-15.
- ↑ విక్రమరెడ్డి, విజయకుమార్ నివేదిక