డిటర్మినిజం. ప్రతి సంఘటనకూ, కార్యానికీ ఏదో ఒక కారణం ఉంటుందనీ, సృష్టి సమస్తం కార్యకారణ సంబంధాల మూలంగానే జరుగు తుంటుందనీ తెలియజేసే సిద్ధాంతం. అనుక్షణం జరిగే పరిణామ క్రమంలో కారణం లేని కార్యం లేదు. మనం నిర్ణయాలు తీసుకొని, మనమే ఆచరిస్తున్నట్లు కనిపిస్తుందిగానీ, అలాంటి నిర్ణయాలకు పూర్వరంగం ఒకటి ఉండనే ఉంటుంది. కనుక, మనం చేసే పనులలోనూ పురుషకారం కంటే విధి బలవత్తరమనీ, అదే మన చేత అన్నీ చేయిస్తున్నదనీ లోతుగా చూస్తే అనిపిస్తుంది. కనుక ఈ వాదాన్ని ‘కార్యకారణ వాద’మనీ, ‘విధి బలీయతా వాదమ’నీ అనవచ్చు. పురుషకారం అనేది భ్రాంతి/ మిథ్య కనుక పురుషకార భ్రాంతి వాదమనే పదబంధం కూడా ఇదే భావాన్ని స్ఫురింప జేస్తుంది. Determinism అనే మాటకు తెలుగులో ‘‘నియతవాదం’’ అనే మాట వాడుకలో ఉంది. పాఠ్యగ్రంథాలు వాడు తున్నాయి. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘‘తత్వశాస్త్ర నిఘంటువు’’ ఈ పదాన్నే ఇచ్చింది. (సంకలన కర్త : అవమ్‌ రాజగోపాలరావు. పరిశీలన : ఆచార్య వి. మధుసూదన రెడ్డి.) స్థూలంగా సమస్తం దైవం ముందే నిర్ణయించిన ప్రకారం జరుగుతుందనీ, ఏదీ మన చేతుల్లో లేదనీ అనే వాదం. .............[పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010]