దామోదర్ రాస్నే

బాబా కృపను పొందిన భక్తులలో దామోదర్ రాస్నే ఒకడు. అతడు మొదట గాజులనమ్ముకునే పేదవాడు . కొంతకాలానికి ఎంతో ధనవంతుడయ్యాడు ,కానీ అతనికి ఎంతకాలమైనా బిడ్డలు కలుగలేదు . రెండవ వివాహం చేసుకున్నా ఫలితం లేకపోయింది . జ్యోతిష్కులు అతని జాతకం చూసి అతనికి పిల్లలు కలిగే భాగ్యం లేదని చెప్పారు . ఆ కోరిక తీర్చుకోవడానికే అతడు బాబా గురించి తెలిసి ఆయనను దర్శించడానికి 1895 లో శిరిడీ చేరాడు .

బాబా సం ॥ 1900 లో ఒక రోజున తన కొచ్చిన పండ్లలోంచి ఎనిమిది పండ్లను రాస్నే కోసం ప్రక్కన పెట్టారు . కాసేపట్లో రాస్నే శిరిడీ చేరి బాబా దర్శనానికి వచ్చాడు . ఈ లోపల ఎనిమిది పండ్లలో నాలుగింటిని ఎవరో తీసుకెళ్ళి పోయారు . బాబా మిగిలిన నాలుగు పండ్లను రాస్నేకు ప్రసాదించారు . బాబా ,"నీకు సంతానం ప్రసాదించాను . మొదట నీకు ఇద్దరు కొడుకులు కలుగుతారు . వారిలో పెద్దవాడికి 'దౌలత్ షా' అని పేరు పెట్టు . రెండవవాడికి 'తానాషా' అని నామకరణం చేయి " అన్నారు . బాబా ఆశీస్సుల వలన అతనికి సంతానం కలిగింది . అతడు బాబా ఆజ్ఞను పాటించాడు . అలా రాస్నే జాతకం కూడా మార్చి బిడ్డలను ప్రసాదించారు సాయి . శిరిడీలో జరిగే రామనవమి ఉత్సవానికి రాస్నే ప్రతి సంవత్సరమూ ఒక జండా సమర్పించుకునేవారు .

ఏ జీవిని అసహ్యించు కోకూడదని ,చులకన చేయకూడదని బాబా బోధించేవారు . అన్ని జీవుల రూపాలలోనూ భగవంతుడే ఉన్నాడు కదా ! ఈ విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించాలని బాబా చెప్పేవారు . ఈ బోధను హృదయంలో నిలుపుకో గలిగాడు రాస్నే . ఆతడు కుక్క వంటి జంతువులను హీనజాతి మనుషులను బాబా స్వరూపంగా చూడగలిగేవాడు . అంతటి గొప్పమార్పును అతడిలో తీసుకొచ్చారు సాయి .

ఒకసారి రాస్నే బాబాను ,"నన్ను ధాన్యం వ్యాపారం చేసుకోమంటారా ?"అని అడిగాడు . బాబా "ధాన్యం ధరలు పడిపోతాయి ,చాలా నష్టపోతావు "అన్నారు . అతడు తన ఆలోచన మానుకున్నాడు . కానీ చాలా రోజులపాటు ధాన్యం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి . బాబా అల ఎందుకు చెప్పారో అర్ధం కాలేదు . కానీ ఇంతలో వర్షాలు పడి ధాన్యం ధరలు తగ్గిపోయి వ్యాపారులు నష్ట పోయారు . అలా తమ భక్తుడు నష్టపోకుండా కాపాడారు బాబా .

ఒకసారి రాస్నే మనస్సులో ,"బాబా సమాధి చెందాక నా పరిస్ధితి ఏమిటి ?నాకు దిక్కెవరు ?"అని ఆలోచిస్తూ ఉన్నాడు . వెంటనే బాబా అందుకు సమాధానంగా , నీవేమి బాధపడనక్కరలేదు . నీవు నన్ను తలచుకోగానే నేను నీ వెంటే ఉంటాను "అన్నారు . అప్పటి నుంచి బాబాను తలచుకోగానే ఆయన తన చెంతనున్నట్లు రాస్నేకు అనుభవమయ్యేది .

దౌలత్ షా :

రాస్నే కుమారుడైన దౌలత్ షా కు బాబా సన్నిధిలో పుట్టు వెంట్రుకలు తీయించారు. ఆ పిల్లవాడి ఐదవ ఏట బాబాయే అక్షరాభ్యాసం చేశారు. తర్వాత బాబా ఆ బాలుడిని శిరిడీలో ఉన్న బడికి తీసుకుని వెళ్ళారు. అతడు కేవలం ఏడు సంవత్సరాల పిల్లవాడైనప్పటికీ బాబాకు చక్కగా పాదసేవ చేసుకునేవాడు. ఒకసారి దౌలత్ షా దృష్టి బాబా పంచుతున్న మిఠాయిలపై బడి అతడు పాదసేవ చేయడం మరచిపోయాడు. అందుకతని తల్లి ఆ పిల్లవాడిని కొట్టింది. బాబాకు ఆమెమీద కోపమొచ్చింది. ఆమె బాబాను దౌలత్ షా కు మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్ధించింది. అప్పుడాయన ,"దౌలత్ షా చక్కగా సేవ చేసుకుంటాడు. మంచి బుద్ధి కలిగి ఉంటాడు. దౌలత్ షా ను ఎప్పుడూ కొట్టకు "అన్నారు.

దౌలత్ షా వివాహం కూడా బాబా సూచించిన సంబంధం తోనే జరిగింది . బాబా అతని వివాహానికి తమ ప్రతినిధిగా శ్యామాను పంపారు . దౌలత్ షా ఏ మహాత్ముని దర్శించినా ,ఏ దేవతను పూజించినా వారిని సాయి రూపాలుగా భావించి ,"సమర్ధ సద్గురు సాయి నాథాయనమః "అని నమస్కరించుకునేవాడు . వారంతా ,"నీ గురువైన సాయి బాబా మాకంటే ఎంతో గొప్పవారు . నీవిక ఎవ్వరి దర్శనానికీ రానవసరం లేదు "అన్నారు . ఒకసారి అతనికి శివలింగంలో శ్రీ సాయినాథుడు దర్శనమిచ్చారు . అతనికి ఒకరోజు బాబా స్వప్న దర్శనమిచ్చి ,"నీ శరీరము ,మనస్సు నాకర్పించు" అన్నారు . స్వప్నంలోనే అతడు ఎంతో సంతోషంగా బాబాకు వాటిని సమర్పించాడు . బాబా సంతోషంతో అతనిని ప్రేమగా తమ చేతిలోకి తీసుకున్నారు తర్వాత తమ హృదయానికి దగ్గరగా జేబులో ఉంచుకున్నారు . అతడికెంతో సంతోషం కలిగింది . అతడికి ఇంతలో మెలకువ వచ్చింది . అప్పటి నుంచి అతని మనస్సుకెంతో ప్రశాంతత కలిగింది . అలా బాబా అనుగ్రహానికి పాత్రుడయ్యాడు దౌలత్ షా .