దామోదల అప్పారావు

దామోదల అప్పారావు విశాఖపట్నానికి చెందిన బౌద్ధ ప్రచారకుడు, పత్రికా సంపాదకుడు. చిన్నప్పుడు పాటల మీద ఉన్న ఆసక్తి ఆయనను నాటక సమాజాలకు కూడా చేరువ చేసింది. చిట్టివలస, తగరపువలస ప్రాంతాలలో ప్రదర్శించిన అనేక నాటకాలలో ఆయన పౌరాణిక పాత్రలను ధరించారు.

దామోదల అప్పారావు
జననం1946
భీమునిపట్నం
ఇతర పేర్లుపుస్తకాల అప్పారావు, బుద్దిస్టు అప్పారావు
ప్రసిద్ధిసంపాదకుడు, బౌద్ధ ప్రచారకుడు
తండ్రినారాయణ
తల్లిఅప్పలకొండ

జననం మార్చు

దామోదల అప్పారావు 1946 లో భీమునిపట్నం తాలూకా పెద్దిపాలెం గ్రామంలో అప్పలకొండ, నారాయణ దంపతులకు జన్మించారు.

చిట్టివలసలో ఆనాడు జరిగిన జూట్ కార్మికుల ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం సృష్టించింది . ఆ ఉద్యమాన్ని చాలా దగ్గర నుండి చూసిన అప్పారావు గారు ఎంతో ప్రేరణను పొందారు. తర్వాతి కాలంలో విప్లవ రచనల పట్ల కూడా ఆసక్తిని పెంచుకున్నారు.

జీవిత విశేషాలు మార్చు

ఆ ఆసక్తి క్రమేణా ఆయనను కమ్యూనిస్టు నాయకులతో కలిసి నడిచేలా చేసింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ కాలంలో ప్రతీ జిల్లాలో ఓ బాలసంఘాన్ని నియమించేవారు. విశాఖ జిల్లాకు కూడా ఓ సంఘాన్ని అలా ఏర్పాటు చేసినప్పుడు, అప్పారావు గారిని ఆయన ఆ సంఘానికి అధ్యక్షుడిగా నియమంచారట.

తర్వాత అప్పారావు గారు కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే, నాటక సమాజాల వికాసానికి ఎంతగానో పాటుపడ్డారు. నాజర్, సలాది భాస్కరరావు, కోసూరి వున్నయ్య లాంటి వారి ఆధ్వర్యంలో హరికథలు, బుర్రకథ కార్యక్రమాలను ఆయన ఎక్కువగా నిర్వహించేవారు. అలాగే ఏటుకూరి బలరామమూర్తి, పరకాల పట్టాభి రామారావు, మహీధర రామ్మోహనరావు, చండ్ర రాజేశ్వరరావు లాంటి ఉద్ధండులతో అప్పారావుకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.

అయితే తర్వాతి కాలంలో ఏంగెల్స్ రచించిన డైలెక్టివ్స్ ఆఫ్ నేచర్ మొదలుకొని దేవిప్రసాద్ ఛటోపాధ్యాయ రచనలు, రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు, డిడిఎల్ శాంబి వ్యాసాలు ఈయనను ఎంతగానో ప్రభావితం చేశాయట. వీరి రచనలు చదివిన తర్వాతే అప్పారావు బౌద్ధాభిమాని అయ్యారు. తర్వాత బౌద్ధ సిద్ధాంతాలపై అనేక పుస్తకాలు రచించారు.

తెన్నేటి విశ్వనాథం విశాఖ పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు, ఆయనకు మద్దతుగా నిలిచిన అప్పారావు తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. స్వతంత్రాలోచనా స్వేచ్ఛను గౌరవించలేని సంఘాలకు తాను దూరంగా ఉంటానని.. తన జీవితాన్ని గౌతమ బుద్ధుడి రచనలను ప్రచారం చేయడానికే వినియోగిస్తానని ఆయన ప్రతిన బూనారు. ఆ ఆలోచన నుండి ఉద్భవించిన సంస్థే “బుద్ధిస్టు స్టడీ సర్కిల్”. ఓ వైపు “బుద్ధిస్టు స్టడీ సర్కిల్”ను నడుపుతూనే.. సంఘ సంస్కరణకు పాటుబడిన మహోన్నత వ్యక్తుల జీవిత సారాంశాన్ని నేటి యువతకు తెలియజేసేందుకు “సమాజ చైతన్య వేదిక” అనే మరో సంస్థకు కూడా బీజాలు వేశారు అప్పారావు.

ఈ సంస్థ ద్వారా కార్ల్ మార్క్స్, ఏంగిల్స్, రాహుల్ సాంకృత్యాయన్, అనాగరిక ధమ్మపాల, పెరియార్ రామస్వామి, జ్యోతిభా ఫూలే, వేమన, అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తూ, వాటిని ఉచితంగా విద్యార్థులకు పంచిపెట్టేవారు. ఇదే క్రమంలో యువతను కార్యోన్ముఖులను చేయడానికి “సమన్వయం” అనే పత్రికను కూడా కొన్నాళ్లు నడిపారు.

స్వయం ఉపాధి కోసం స్వయంగ టైలరింగ్ నేర్చుకున్న అప్పారావు గారు.. ఉత్తరాంధ్రలో దర్జీల సమస్యలను తీర్చడం కోసం తొలిసారిగా “ఉత్తరాంధ్ర టైలర్స్ అసోసియేషన్” స్థాపించారు. కానీ ఆయన ఎక్కువగా గౌతమ బుద్ధుడి భావాలను యువతకు చేరువ చేయడానికి, అందుకోసం ప్రారంభించిన “బుద్ధిస్టు స్టడీ సర్కిల్” అభ్యున్నతి కోసం చాలా పాటుపడ్డారు.[1]

శాస్త్రీయ, హేతువాద దృక్పథంతో రచించిన అనే పుస్తకాలను, మేధావుల జీవిత చరిత్రలను ఈ స్టడీ సర్కిల్ ప్రచురించేది. ఈ పుస్తకాలను గ్రామీణ, గిరజన ప్రాంతాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేది. ఈ సంస్థ కోసం తన సర్వస్వం అర్పించిన అప్పారావు గారు తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు.[2]

ప్రస్తుతం ఓ అద్దె ఇంటిలో నిరాడంబరంగా కాలం గడుపుతున్నారు. గాంధీ (పీకాక్ క్లాసిక్స్), ఎన్.అంజయ్య (సోషలిస్ట్ స్టడీ సెంటర్), రాధాకృష్ణమూర్తి (లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్) లాంటి మేధావులు ఒకప్పుడు అప్పారావుకి ఆత్మీయ మిత్రులుగా ఉండేవారు.

దామోదల అప్పారావు ప్రచురించిన పుస్తకాలు చదివి, అనేక విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఆయనకు శిష్యులుగా మారారు. డాక్టర్ మలయశ్రీ రచించిన “నిజమైన బౌద్ధం”, పరకాల పట్టాభి రామారావు రచించిన “బుద్ధునిపై అపవాదు కాదా” లాంటి పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించిన అప్పారావు, “భారతావనికి బుద్ధుని సందేశం” పేరిట ఓ గ్రంథాన్ని కూడా రచించారు.

సూచికలు మార్చు

  1. "దామోదల అప్పారావు పై వాయిస్ ఆఫ్ రిపోర్టర్స్ వెబ్ పత్రికలో వ్యాసం". Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "వాయిస్ ఆఫ్ రిపోర్టర్స్ వెబ్ పత్రికలో వ్యాసం, తేది: 15.07.2022". Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.