కెనడాలోని ఒంటారియో రాష్ట్ర ఆరోగ్యమంత్రి దీపిక దామెర్ల. ఈమె అంతకు ముందు ఆ దేశంలో మౌలిక వసతుల కల్పనలో సహాయమంత్రి. దీపీక పుట్టి, పెరిగింది సికింద్రాబాద్‌లో. దీపిక తండ్రి వెంకట రమణారావు, ఆయన మిలటరీలో మేజర్‌గా పనిచేసారు. తల్లి శేషు, ఆమె కథా రచయిత్రి. మిలటరీలో మేజర్‌గా పనిచేసిన రమణారావు ఉద్యోగ విరమణ తరువాత పుణేలో స్థిరపడ్డారు. దీపిక తల్లి శేషు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడి సమాజంలో వచ్చిన మార్పులు, మహిళలు ఎదుర్కొన్న సవాళ్లు, ఎదగడానికి మహిళ పడిన కష్టాల ఇతివృత్తంతో ఆమె అనేక కథలు రాశారు.

దీపిక దామెర్ల

దీపిక చదువు పూర్తయ్యాక 1991లో పుణేలోని అల్ఫాలావల్ కంపెనీలో మేనేజింగ్ డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసారు. తరువాత కెనడాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో వివాహం కావడంతో ఆమె భారత్ నుంచి కెనడాకు వెళ్లారు. కెనడాలో ఎం.బి.ఎ పూర్తిచేసిన తర్వాత దీపిక రాయల్ బ్యాంకులోనూ, నోవా సోషియా బ్యాంకులోనూ పనిచేశారు.

ఒకరోజు అనుకోకుండా కెనడా దేశ ప్రధానమంత్రిని కలవడంతో దీపిక దృష్టి సామాజికాంశాల మీదకు మళ్లింది. తరువాత "ఒంటారియో ప్రావిన్స్‌లో మినిష్టర్ ఆఫ్ ట్రేడ్‌లో ఎకనమిక్ డెవలప్‌మెంట్" విభాగంలో సీనియర్ అడ్వయిజర్‌గా చేరింది. తరువాత ఓమ్ని టెలివిజన్ చానెల్‌లో రిపోర్టర్ ఉద్యోగంలో చేరారు. చెదరని చిరునవ్వు వాక్పటిమ ఉన్న దీపిక అక్కడి రాజకీయ నాయకుల దృష్టిలో పడింది. తరువాత 2011లో లిబరల్‌పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన దీపిక ఆ ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంటరీ అసిస్టెంట్ మినిస్టర్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా పనిచేశారు. మళ్లీ 2014 ఎన్నికల్లో కెనడావాసులు దీపికను పదివేలకు పైగా మెజారిటీతో గెలిపించారు. ఈ దఫా అక్కడి ప్రభుత్వం అమెకు దేశ ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించింది. జూన్ 24, 2014న దీపిక ఈ బాధ్యతలను తీసుకున్నారు.

విద్య మార్చు

  • తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయలో
  • కెనడాలో టొరంటో యూనివర్శిటీలో ఎం.బి.ఎ ఫైనాన్స్

కుటుంబ నేపథ్యం మార్చు

దీపిక పూర్వీకులు ఖమ్మం జిల్లాలోని దామెర గ్రామం నుంచి మూడు వందల యేళ్ల కిందట రాజమండ్రికి వెళ్లారు.

మూలాలు మార్చు

  • సాక్షి దినపత్రిక - 23-07-2014 ఫ్యామిలీ పేజీ (కెనడాలో విరిసిన తెలుగు కమలం)