దేవరాజు వేంకటకృష్ణారావు
దేవరాజు వేంకటకృష్ణారావు (సెప్టెంబర్ 23, 1886 - సెప్టెంబర్ 13, 1966) [1] తొలి తెలుగు అపరాధపరిశోధక నవలా రచయితగా పరిగణింపబడుతున్నాడు.
దేవరాజు వేంకటకృష్ణారావు | |
---|---|
జననం | దేవరాజు వేంకటకృష్ణారావు సెప్టెంబర్ 23, 1886 విశాఖపట్టణం జిల్లా సంగంవలస గ్రామం |
మరణం | సెప్టెంబర్ 13, 1966 శ్రీకాకుళం జిల్లా రాజాం |
ప్రసిద్ధి | పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త |
భార్య / భర్త | రత్నమ్మ1906, సత్యవతి1934 |
పిల్లలు | దేవరాజు వేంకటసత్యనారాయణమూర్తి, దేవరాజు రవి ఇంకా నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు |
తండ్రి | వేంకటరావు |
తల్లి | రత్నమ్మ |
జీవిత విశేషాలు
మార్చుగడబిడదాస్, అర్జెంటుపంతులు, ప్రాడ్వివాకుడు అనే ముద్దుపేర్లతో పిలువబడిన దేవరాజు వేంకటకృష్ణారావు 1886 సెప్టెంబర్ 23 వతేదీ జన్మించాడు. ఇతని తండ్రి వెంకట్రావు పంతులు మృత్యుంజయ నిశ్శంక బహద్దరు జమీందారు వద్ద దీవాన్‌గా పనిచేసేవాడు. అతడు బహుభాషా కోవిదుడు. పంచభాషా నిఘంటువును రచించాడు. వేంకట కృష్ణారావు తాత వరదయ్య పంతులు సి.పి.బ్రౌన్ వద్ద దుబాసీగా పనిచేసి బ్రౌణ్యనిఘంటువు నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. ఇతని విద్యాభ్యాసం బొబ్బిలి, మద్రాసు పట్టణాలలో జరిగింది. పరవస్తు వెంకట రంగాచార్యులు, వేదం వెంకటరాయ శాస్త్రులు ఇతని గురువులు. వివాహం కారణంగా ఇతనికి ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడింది. ఇతడు వృద్ధాప్యంలో బరంపురం నుండి రాజాంకు తరలివచ్చాడు. 1960 నుండి మరణించేవరకు ఇతనికి కేంద్ర ప్రభుత్వం గౌరవభృతిని ఇచ్చి సత్కరించింది.[2]
సాహిత్యసేవ
మార్చుఆ రోజులలో ఇతని ఇల్లు గిడుగు రామమూర్తి పంతులు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, నేమాని నృసింహశర్మ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పింగళి లక్ష్మీకాంతం వంటి సాహితీమూర్తులతో నిత్య సాహితీసదస్సులతో కళకళలాడుతూ వుండేది. ఇతడు 1909లో బరంపురంలో ఆంధ్రభాషాభివర్ధినీ సమాజాన్ని స్థాపించాడు. 1910లో వేగుజుక్క ముద్రణాలయాన్ని స్థాపించాడు. 1911లో తాపీ ధర్మారావుతొ కలిసివేగుజుక్క గ్రంథమాల ను నెలకొల్పి 1912లో దానిద్వారా వాడేవీడు అనే అపరాధపరిశోధక నవలను ప్రకటించాడు. తెలుగులో వాడేవీడు మొట్టమొదటి డిటెక్టివ్ నవలగా ఇప్పటి వరకు గుర్తించబడింది. ఇంకా ఇతడు నేనే (1914), కాలూరాయి (1916) అనే అపరాధపరిశోధక నవలలు వ్రాసి గ్రంథమాల ద్వారా ప్రకటించాడు. కాలూరాయి నవలలో హెలీకాప్టర్ను ఊహించి వ్రాశాడు. అప్పటికి ఇంకా హెలీకాప్టర్ కనుగొనలేదు. డిటెక్టివ్ నవలలే కాకుండా జానకీపరిణయం (తప్పుల తమాషా) , సంజయరాయబారం, శ్రీకృష్ణరాయబారం, విభ్రమ రాఘవము , శ్రీకృష్ణాభ్యుదయము , మనసు దాని పని , ఒరిస్సా చరిత్ర , పురాణ సంహిత అనే గ్రంథాలను వ్రాశాడు. 1933లో కళాప్రచారక సమితిని స్థాపించాడు. 1934లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఇతని ఆధ్వర్యంలో వేగుజుక్క కథావళి (1914-1930), పదసమస్యబోధిని (1937), విశాలాంధ్రవాణి (1940-1960) అనే పత్రికలు వెలువడ్డాయి.
గుర్తింపులు, సత్కారాలు
మార్చు- తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్‌పజిల్‌ను సృష్టించిన ఘనతకూడా దేవరాజు వేంకటకృష్ణారావుకే దక్కుతుంది.
- 1933 మార్చి 10,11,12 తేదీలలో బరంపురంలో జరిగిన అభినవాంధ్ర కవిపండితసభలో అఖండసత్కారాన్ని పొందాడు.
- 1950లో విమర్శకాగ్రేసర అనే బిరుదుతో సత్కరించబడ్డాడు.
- ఇతడు వ్రాసిన శ్రీకృష్ణరాయబారం అనే గ్రంథంలోని కొంత భాగాన్ని మహాత్మా గాంధీ ఇంగ్లీషులోని తర్జుమా చేయించుకుని చదివి ఆనందించడమే కాకుండా ఇతనికి "డియర్ గురూజీ" అంటూ సంబోధిస్తూ గ్రంథాన్ని శ్లాఘిస్తూ ఉత్తరాలు వ్రాశాడు.
మరణం
మార్చుఇతడు 1966, సెప్టెంబరు 13వ తేదీన మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రభారతి సైటులో
- ↑ వేమకోటి, సీతారామశాస్త్రి (30 December 1979). "మహాత్మాగాంధీ మెచ్చిన తెలుగు రచయిత". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 258. Retrieved 5 January 2018.[permanent dead link]