దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం

సృష్టి మొదలూ, దేవుడూ మొదలైన వాటి గురించి మాట్లాడే వారిలో కొందరిని ఈ కింది విధంగా వర్గీకరించ వచ్చు:

విశ్వాసాలుసవరించు

  1. దేవుడిని నమ్మే వారు. వీరు తమ ఇష్టమైనది నమ్మవచ్చు. కానీ వీరికి దేవుడి గురించిన ఎటువంటి ప్రత్యక్ష అనుభవాలూ ఉండవు. వీరు, భౌతిక నియమాలను లెక్కచేయకుండా దేవుడిని తమ ఇష్టమైనట్లు ఊహించుకొంటారు .ఈ ఊహలు వీరి మన్సులో మాత్రమే ఉంటాయి. బయట ఎక్కడా ఉండవు. ఉదాహరణకు రెక్కల దేవదూతలూ, సింహం తల కలిగిన పక్షి దేవుళ్ళూ వీరి ఊహల్లోనే ఉంటాయి.వీరిలో కొంతమంది తమ నమ్మకాన్ని బలపరుచుకోవటానికి తమకు తెలిసిన సైన్స్ ని ఒక వాదనగా ఉపయోగించుకొంటారు.
  2. ‘సంపూర్ణ సత్యం’ లేక ‘దేవుడు’ తమ ప్రత్యక్ష అనుభవం లోకి వచ్చాడనే వారు. వీరి అనుభవాలు సాధారణంగా ఆధ్యాత్మికమైనవి అయి ఉంటాయి. గొప్ప గొప్ప యోగులూ, ఋషులూ ఈ అనుభవాలను పొందినట్లు చెప్తారు. కానీ ఈ అనుభవాలు మానవ మేధ పరిధికి బయట జరిగి ఉంటాయి. మేధో పరంగా వీరి అనుభవాలను పరీక్షించటం కుదరదు.ఎందుకంటే అవి కాలానికి బయట జరిగిన అనిర్వచనీయమైన అనుభవాలు. మామూలు మనుషులకు ఈ అనుభవాలు “నిజమైనవా, కావా?” అని తేల్చుకోవటం కూడా కష్టం.ఈ అనుభవాలు ఐన ఇద్దరు మనుషులు కూడా, వాటి గురించి చర్చించుకొని, వారు “ఒకే విషయాన్ని అనుభవించారు”ని చెప్పటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, ఇద్దరు మనుషులు చర్చించుకోవాలంటే మాటలు కావాలి. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు సాధారణం గా మాటలకు అందనివై ఉంటాయి.
  3. ఇక మూడో రకం మేధోపరం గా సృష్టి గురించి పరిశోధించే వారు. వీరు చెప్పిన వాటిని పరీక్షించి నిగ్గుతేల్చవచ్చు. భౌతిక శాస్త్రవేత్తలు ఈ కోవలోని వారే! వీరు కాలానికి ఆవల నున్న విషయాలను ప్రత్యక్షం గా అనుభవించలేక పోయినప్పటికినీ, ఆ విషయాలను మేధోపరంగా తమ సమీకరణాలతో అర్ధం చేసుకొని,వాటిని ఆ సమీకరణాలతో ప్రాతినిధ్యం వహింపచేస్తారు. వీరు చెప్పిన సిధ్ధాంతాలను భౌతిక ప్రపంచం లో నిరూపణకు పెట్టవచ్చు. వీరితో చిక్కల్లా వీరు పరిశోధించే విషయం భౌతిక పరిధి దాటిపోయినప్పుడు వస్తుంది. ఉదహరణకు “ఈ విశ్వం రక రకాల నియమాలతో, స్థల కాలాలతో ఇలా ఎందుకు ఏర్పడి ఉన్నది?” అనే ప్రశ్న భౌతికతకి ఆవల ఉంది. ఇది అధి భౌతికమైనది. ఈ ప్రశ్నకు భౌతిక నిరూపణలతో సమాధానం ఇవ్వటం సాధ్యపడక పోవచ్చు. అప్పుడు కొందరు శాస్త్రవేత్తలు “సైధ్ధాంతిక కల్పనల (conceptual fantasy)” లోకి దిగుతారు. ఈ కల్పనలు అన్నీ నిజం కావు. ఏదో ఒక కల్పన మాత్రమే నిజమౌతుంది. అనంత విశ్వాలు ఉన్నాయి అనటమూ, అనంతమైన కొలత (Dimension) లు ఉన్నాయి అనటమూ, ఐదో కొలతలో ఈ సృష్టి జరిగింది అనటమూ ఇలాంటి కల్పనలే.అయితే వీరి కల్పనలన్నీ భౌతిక నియమాలకూ, భౌతిక దృగ్విషయాలకూ భిన్నంగా ఉండవు. ఇవి భౌతిక నియమాల ఆవల ఉంటాయి . వీరి కల్పనలు మనిషి బయట ఉన్న భౌతిక వస్తువు శోధనలో, భౌతికత పరిధిని దాటి, అధి-భౌతిక విషయాలలోకి వెళ్ళటం వలన వచ్చినవి.

శాస్త్రవేత్తలకున్న ఇంకొక పరిమితి, విశ్వ చరిత్రని శోధించి విశ్వం గురించిన నియమాలను మాత్రమే వారు కనుగొన గలరు. “ఆ నియమాలతో కూడిన విశ్వం ఎందుకు ఆవిర్భవించింది” అనేది వారి పరిధిలో లేని విషయం.యోగులకు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలకు అధి-భౌతిక విషయాల గురించిన ఇంద్రియానుభవం ఉండదు.

ఐన్‌స్టీన్ వాదనసవరించు

ఇక పోతే సృష్టికి కారణం లేదనే వాదనకి మూలం ఐన్-స్టీన్ మహాశయుడు ప్రతిపాదించిన సాపేక్ష సిధ్ధాంతంలో ఉంది. ఈ సిధ్ధాంతం ప్రకారం సమయం సాపేక్షమే! విశ్వం మొత్తానికి ”భారతీయ ప్రామాణిక సమయం (Indian Standard Time)” లా ఒకే సమయం లేదు. భూమిని ఆధారం (reference) గా తీసుకొంటే మిగిలిన ఖగోళ వస్తువుల (గ్రహాలూ నక్షత్రాలూ) మీద కాలం నెమ్మదిగానో, వేగంగానో, ( భూమితో ఆయా ఖగోళ వస్తువుల సాపేక్ష వేగాన్ని బట్టీ, ఆయా వస్తువుల గురుత్వాకత్షణను బట్టీ) ఉంటుంది. సాపేక్ష సిధ్ధాంతాన్ని సూర్యగ్రహణం సమయంలో స్థల-కాలం (Space-Time) వంపు తిరిగింది అని తెలుసుకోవటం ద్వారా నిరూపించారు. కాబట్టీ కాలం నెమ్మది గానూ, వేగంగానూ నడవటం పై సందేహాలు అవసరం లేదు. “ఈ విశ్వంలో అనేక కాల ప్రవాహాలు ఉండటం” పై కూడా సందేహాలు అనవసరం.

స్థల-కాలంసవరించు

స్థల-కాలం (Space-Time) అనేది విశ్వంతో పాటు పుట్టి ఉబ్బుతోంది. స్థల-కాలం వంపుతిరిగి, భూమి ఉపరితలంలా తన పైకి తాను ముడుచుకొని పోయి ఉన్నదని ఐన్-స్టీను ఉవాచ. గోళాకార ఉపరితలం లా ఉన్న కాలానికి “మొదలు” ఎలా ఉంటుంది? (Ref: Hawkings proposed quantum theory of gravity) ఒక వృత్తం గీస్తే, ఆ వృత్తం వెంబడి ఏది మొదలూ ఏది చివరా? అలానే భూమి మీద ప్రయాణం మొదలు పెట్టి ఉత్తర ధ్రువం చేరుకున్న తరువాత భూమి అంతమౌతుందా? కాదు కదా? ఉత్తర ధ్రువం తరువాత కూడా భూమే ఉంటుంది. కాకపోతే ఈ సారి మన ప్రయాణం ఉత్తర ధ్రువానికి దక్షిణంగా సాగుతుంది. అలానే కాలం పరిమితమైనది. కాబట్టీ, విశ్వం కాలంలో పుట్టలేదు. కాలంలో పుట్టని దానికి కారణం ఉండదు. ఎందుకంటే కార్య కారణ సంబంధాలు కాలంలోనే జరుగుతాయి.

గుళిక సిధ్ధాంతంసవరించు

భౌతిక శాస్త్రం ప్రకారం ఇలా కారణం లేకుండా పుట్టేవి అనేకం ఉన్నాయి. గుళిక సిధ్ధాంతం (quantum theory) ప్రకారం శూన్యం నుంచీ ఎలక్ట్రాలు ఏ కారణం లేకుండానే పుట్టి మళ్ళీ అంతరిస్తాయి. దీనినే శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations) అంటారు. ఇది సాయి బాబా శూన్యం నుంచీ విభూతి పుట్టించటం లాంటిది. కానీ, ఈ రెండూ ఒకటి కాదు. శాస్త్రం (science) ప్రయోగాల ద్వారా ధ్రువీకరించిన విషయమే శాస్త్ర నియమమౌతుంది . శాస్త్రం, శూన్యంలోంచీ ఎలక్ట్రాన్లు పుట్టటాన్ని ధ్రువీకరించి దాన్ని ఒక నియమంగా ఏర్పరిచింది కనుక, అది శాస్త్రీయమే. సాయి బాబా ఏ శక్తి లేకుండా ప్రయోగశాలలో విభూతి పుట్టించినట్లైతే, శాస్త్రం ఒక సాయి బాబా నియమాన్ని కూడా ప్రతిపాదించేదేమో! ఇంకొక విషయం.. విశ్వానికి “బయట” అనేది లేదు. “బయట” ఉండాలంటే స్థలం ఉండాలి. కానీ, స్థలం అంతా విశ్వంతో పాటు పుట్టి విశ్వం లోనే ఉంది. మరి విశ్వం ఎక్కడికి వ్యాకోచిస్తూంది? ఎక్కడికీ వ్యాకొచించటం లేదు. ఉన్న స్థలకాలానికి మరింత స్థ- కాలం కలుపబడుతోంది. విశ్వం “బయట” ఏముంది? ఏమీ లేదు. దక్షిణ ధ్రువానికి దక్షిణంగా ఏముంది? ఏమీ ఉండదు కదా? “బయట” లేని విశ్వాన్ని ఊహించుకోవటంలో కొన్ని పరిమితులున్నాయి. ఒక బుట్టలో ఐదు మామిడి పళ్ళున్నాయి అనుకొందాం. ఆ ఐదు పళ్ళనూ బయటికి తీస్తే బుట్టలో ఏముందీ అంటే, ‘శూన్యం ఉంది’ అని చెప్పవచ్చు. కానీ విశ్వం “బయట” స్థలం కూడా లేదు. స్థలం లేని స్థితిని ఊహించుకోవటం మనకు చేతకాదు. ఎందుకంటే, మన రోజువారీ జీవితంలో మనం అలాంటి స్థితిని చూసి ఉండం. అనంతం కాని కాలాన్ని ఊహించుకోలేకపోవటం కూడా ఈ కారణం వలననే! మనం విశ్వానికి మొదలు వెతకటం కూడా ఇదే కోవలోకి వస్తుంది. మన జీవితంలో అన్ని విషయాలకీ మొదలూ చివరా ఉంటాయి. కాబట్టీ, మనం విశ్వానికి కూడా మొదలును వెతుకుతాం. కాకపొతే, విశ్వానికి మొదలు ఉంది. కానీ కాలంలో ఈ మొదలు దాటి ముందుకు పోతే (ఉత్తర ధ్రువం దాటి ముందుకు పోతే దక్షిణం వచ్చినట్లు) మళ్ళీ తరువాతి కాలం వస్తుంది. కారణం లేకుండానే ఎలక్ట్రాన్లూ, విశ్వమూ మొదలైనవి పుట్టటాన్ని మనం ఇంకొక కొలత (Dimension) ప్రవేశ పెట్టటం ద్వారా కారణం పరిధిలోకి తీసుకొని రా వచ్చును.అయితే ఈ కొత్త కారణం మనం దైనందీన జీవితంలో చూసే కారణాలవంటిది కాదు. ఇది మన భౌతిక కాలంలో జరిగేది కాదు.అధిభౌతిక కాలంలో జరిగేది. సినిమా తెర మీది రెండు కొలతల బొమ్మలకు తెలివి ఉందనుకొందాం. తెరమీద మనం ఒక టార్చీ లైటు ఫోకస్ చేసినప్పుడు, తెరమీద బొమ్మలు ఆ టార్చి లైట్ వెలుగుకి కార్య కారణ నియమాన్ని ఆపాదిస్తే, ఆ వెలుగు ఏ కారణం లేకుండానే వచ్చినట్లు తేలుతుంది. ఎందుకంటే ఆ బొమ్మలు మూడవ కొలతలో ఉన్న మనలను కనిపెట్టలేవు కాబట్టీ. అలానే ఈ విశ్వ సృష్టి ఐదవ కొలత లోజరిగితే, అప్పుడు ఆ సృష్టి నాలుగు కొలత (కాలంతో కలిపి నాలుగు డైమన్షన్లు) లలో ఉన్న మనకు, కారణం లేనిదిగా కనపడుతుంది. కానీ ఐదవ కొలత అనేది అధి-భౌతికం. దీనిని మన నాలుగు కొలత ల ప్రపంచం లోని విషయాల సహాయంతో నిరూపించటం కష్టం. దీనినే సైధ్ధాంతిక కల్పన (conceptual fantasy) అనవచ్చు. ఈ ఐదవ కొలత ఏ భౌతిక నియమాన్నీ ఉల్లంఘించ లేదు . కానీ ఈ ఐదవ కొలత మన ఊహ లోని ఒక విషయమే! ఐతే దీనికీ, కేవలం ఊహా గానాలైన “భూమిని సృష్టించే రెక్కల దేవతలకీ, తాబేళ్ళకీ” తేడా గమనించవచ్చు. కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదన్నప్పుడు, దాని అర్ధం, మనం ఉన్న నాలుగు డైమన్షన్లలోనూ, విశ్వం పుట్టుకకి కారణం దొరకలేదనే! ఐదో కొలతలోనో, పన్నేండో కొలతలోనో దానికి కారణం ఉండవచ్చు. కానీ ఇలా ఎన్ని కొలతలని ఊహించు కొంటాం అనేది వేరే ప్రశ్న.

విశ్వంలో కారణాలు లేనివీ (ఉదా: శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations) ), కారణాలు తెలియనివీ (ఉదా: జీవులలో జన్యు మార్పులు), కారణాలు ఎప్పటికీ తెలుసుకోలేనివి (విశ్వం యొక్క ప్రయోజనం, ఐదవ కొలత, పదవ కొలత లాంటివి), కారణాలను కచ్చితంగా కొలవలేనివీ (హైజెన్-బర్గ్ అనిశ్చితి సిధ్ధాంతం (Heisenberg’s Uncertainity principle) ప్రకారం, ఎలక్ట్రాన్ వేగాన్నీ, స్థానాన్నీ ఒకే సమయంలో కచ్చితంగా ఎప్పటికీ తెలుసుకోలేము) ఉన్నాయి. వీటి మధ్య గల తేడాలను తెలుసుకోవటం కూడా ముఖ్యమైన విషయమే!

వేదాలూ, భగవద్గీతా, ఇతర మతాల గ్రంథాలూ, భౌతిక శాస్త్ర వేత్తలూ, మాట్లాడే దానిలో కొంత సారూప్యత ఉంటుంది. ఎందుకంటే అవి ఒకే విషయం, సృష్టి యొక్క జననం, సృష్టికి కారణం గురించి మాట్లాడుతున్నాయి. ఈ విశ్వం లాంటి విషయాల్లో సమాధానాలు చాలా తక్కువ ఆప్షన్స్ తో ఉంటాయి. సృష్టి పరిమితం, లేక అనంతం. దీనికి కారణం ఉంది, లేక లేదు. లేక ఉండీ ఉండకుండా ఉంది. దీనికి బయట ఉంది లేక లేదు. లేక ఈ మధ్యలో ఉంది. సృష్టికి కారకుడు ఉన్నాడు లేక లేదు. లేక ఈ మధ్యలో ఉన్నాడు. ఇలా ఆప్షన్స్ అన్నీ రెండు లేక మూడు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక మత గ్రంథం చెప్పేదానికీ, సైన్స్ చెప్పిన ఫలితానికీ పోలిక ఉండటం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కాబట్టీ, “మతాల గ్రంధాలూ, భౌతిక శాస్త్ర పరిశొధనలూ, ఈ సృష్టి రహస్యాల గురించి ఏకీభవిస్తున్నాయి”, అనటం అప్పుడే సరి కాదు.