నాగప్పగారి సుందర్రాజు

నాగప్పగారి సుందర్రాజు దళిత కవి, రచయిత. ఆయన దళితసాహిత్యంలో విశేషంగా కృషిచేసిన సాహిత్య పిపాసి. మాదిగత్వంలో మాగిన కథలూ కవితలూ రాసి సిసలయిన మాదిగ సాహిత్యానికి ఆయన బాటలు వేశాడు. తద్వారా మొత్తం దళిత బహుజన సాహిత్యాన్ని కొత్త ప్రమాణాలతో నింపాడు. మాదిగ మూలాల్లోకి వెళ్ళి జీవితాన్ని సాహితీకరించిన తెలుగు దళిత కథాపితామహుడు కొలకలూరి ఇనాక్‌ బడి నుంచి నేర్చుకొంటూనే ‘దండోరా’ స్ఫూర్తిని బలంగా పలికించిన సృజనకారి సుందర్రాజు.[1]

నాగప్పగారి సుందర్ రాజు
దస్త్రం:Nagappa.jpg
నాగప్పగారి సుందర్ రాజు
నాగప్పగారి సుందర్ రాజు
జననంరాజు
1968 మే 30
మరణం17 జూలై 2000
అనంతపురం
మరణ కారణంఆత్మహత్య
వృత్తిరచయిత
ప్రసిద్ధికథా రచయిత, కవి

జీవిత విశేషాలు మార్చు

ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లు. ఆయన తన తల్లి గారి ఊరైన ఆలూరు తాలూకా లోని మొలగవెల్లి కొట్టాలలో పెద్దనర్సమ్మ, రంగన్నలకు దంపతులకు 1968 మే 31 న రెండవ సంతానంగా జన్మించారు. అక్క రాణెమ్మ, తమ్ముడు ఆనంద్‌, చెల్లెలు గాయత్రి. ప్రాథమిక విద్య 1 నుండి 5 వరకు మొలగవల్ల కొట్టాలలోనూ, 6 నుండి 10 వరకు గుంతకల్లు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోనూ, ఇంటర్మీడియేట్‌ (హెచ్‌.ఇ.సి) పత్తికొండ జూనియర్‌ కళాశాలలోనూ, బి.ఏ. (తెలుగు సాహిత్యం) అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోనూ, యం ఏ, యం.ఫిల్‌, పిహెచ్‌డి కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో చదివారు. దళితకథలపై పరిశోధనలో భాగంగా యం.ఫిల్‌, పిహెచ్‌డిలు పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలపై చేశారు.

ఆయన "సువార్త" అనే కలం పేరుతో "అక్క చచ్చిపోయింది" అనే శీర్షికతో రాసిన మొదటి కథ 1995లో దళిత రాజ్యం అనే పత్రికలో అచ్చయింది. 1997లో 10 కథలతో వచ్చిన `మాదిగోడు' తోపాటు `మాఊరి మైసమ్మ', `బొంబాయోడు గండు జోగమ్మయ్యేడ్య' ఈ రెండు కథలు 1999లో వచ్చాయి. తన కథల్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న బసివిరాలు వ్యవస్థ రద్దు కావాలని మాల, మాదిగ స్త్రీలు పడుతున్న ఆవేదనను కధలుగా రాశాడు.[2]

రచనలు మార్చు

1995లో గుండెచప్పుడు, 1996లో చండాల చాటింపు, 1997 ఫిబ్రవరిలో మాదిగోడు, 1997 డిసెంబర్‌లో మాదిగ చైతన్యం, 1999లో మాఊరిమైసమ్మ, బొంబాయోడు, గోండుజోగమ్మయ్యేడ వంటి రచనలు చేశారు. మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాలపట్ల కథలను విశ్లేషించినప్పుడు నాగప్పగారి సుందర్‌రాజు రచించిన బస్విని కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలుగా పేర్కొనవచ్చు. ఆయన రాసిన `మాదిగోడు' కథా సంపుటి తెలుగు కథా సాహిత్యంలోనే ఒక విప్లవ కెరటం. బోడెద్దు కథ, చనిపోయిన పశువుని కోసి వండుకొని తినే సంప్రదాయాన్ని ఒక గొప్ప అనుభూతిగా ప్రదర్శించింది. ఈరారెడ్డి మనుమరాలు మీద మొనుసుండాది లాంటి కథల్లో వాస్తవికంగా ప్రదర్శించాడు. దళిత స్త్రీని లోబరుచుకునే క్రమంలో అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళను బసివిరాండ్రుగా మార్చేక్రమాన్ని నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద్య కథలో ప్రతిబింబించాడు. [2]

గోవధ నిషేధించాలని హిందూత్వ శక్తులు ఎప్పట్నుంచో చేస్తున్న ఉద్యమం దళితహక్కులకు భంగమని గుర్తించి నిర్మొహమాటంగా దాన్ని ఖండిస్తూ రాశాడు. మనుషుల్ని అంటరానివాళ్ళుగా చేసి ఆవుల్ని దేవతలుగా పూజించే హిందూ సంస్కృతిని తాత్త్వికంగా ఎండగట్టాడు. మాదిగ సంస్కృతినీ హక్కుల్నీ కాపాడుకోవటమంటే ఏంటో రాసి చూపించాడు. అనంతపురం జిల్లా మాదిగవాడల్లో కాగిన మాదిగ జీవితాలను రంగరించి తన సొంత మాదిగ బతుకుతో జోడించి ‘మాదిగోడు’ కతల్ని 1998లో తీసుకొచ్చాడు. ఈ పుస్తకం తెలుగు మాదిగ మాదిగేతర సాహిత్యలోకంలో పెను సంచలనం తెచ్చింది.[1]

మరణం మార్చు

ఆయన 2000 జూలై 17 న మరణించాడు. అది కారంచేడులో దళితులపై హత్యాచారం జరిగిన రోజు కావడం యాదృచ్చికం. నాగప్పగారి సుందర్ రాజు చనిపోయిన తర్వాత ఆయన గురించి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు ‘ఒక మాదిగ స్మృతి’ నాగప్పగారి సుందర్రాజు పరిచయం పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు.దళితులు, మాదిగల జీవితాల్ని సాహిత్యీకరించాలనుకున్న సుందర్రాజు జీవితాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఆ పుస్తకమే ఏకైక ఆధారం కావడం విచిత్రం.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "డప్పుకొట్టి మాట్లాడిన మాదిగత్వం". జి. లక్ష్మీనరసయ్య. ఆంధ్రజ్యోతి దినపత్రిక. 30 May 2016. Retrieved 30 May 2016.[permanent dead link]
  2. 2.0 2.1 "దళిత చైతన్య కెరటం". surya. 8 June 2015. Retrieved 30 May 2016.[permanent dead link]

ఇతర లింకులు మార్చు