కాకతీయ ప్రతాప రుద్రుడు చక్రవర్తి ముఖ్య సేనానునలో నాగయ్య గన్న సేనాని ఒకడు. ఇతడు నియోగి బ్రాహ్మణుడని కొందరును, కమ్మనాయుడని మరికొందరు అనుంచుందురు. ఇతనితాత మల్ల సేనాని. తండ్రి నాగయ; కాకతీయ గణపతి దేవుడు చక్రవర్తి ఊరికావలి అగు మేచయ అల్లుడు.గన్నయ ప్రతాప రుద్రచక్రవర్తి దయచేత రాజ్య చిహ్నములను, సంపదను, నాయకత్వమును చేసెను. ఇతను ఊరి కావలిగా కూడా ఉండుట చేత ఈతనికి కాకతిక్ష్మాధీశకటకపాలుడు అని బిరుదు గావించెను. క్రీ.శ. 1322-23 సం.లో ఢిల్లీ సుల్తాను అగు ఘయాజుద్దీన్ తుగ్లక్ తన మహా సైన్యమును తన జ్యేష్ఠ పుత్రుడగు ఉలూఘ్ ఖాన్ ని ఆధిపత్యమున ఓరుగల్లు ముట్టడించుటకై పంపెను. ఈతను మొదట ప్రతాప రుద్రునిచే యుద్ధములో ఓడిపోయినను అచిరకాలములోన మరల మహా సైన్యముతో తిరిగి చవచ్చి ఓరుగల్ల్లు కోటను ముట్టడించి కొద్ది కొద్దిగా ఓరుగల్లును ఆక్రమిచుకొనెను.ఆతరువాత తురకల హడావుడి వలన రాజ్యమంతయు నాశనమై ప్రజా క్షోభ కలిగి తినుటకు ఆహారములేక ప్రజలు సంక్షోభము చెందుచుండిరి. ప్రతాప రుద్రుడు కావించిన ప్రయత్నములు అన్నీ విఫలములు కాగా, ఈ పరిస్థుతులలో ప్రతాప రుద్రుడు చివరికి తురకులకు లొంగిపోయెను, బందీగా చిక్కెను.

ఉలూఘ్ ఖానునికి ప్రతాప రుద్రుని తెలుగు దేశమున నిలువ నిచ్చుట కెంతమాత్రము ఇష్టములేకపోయెను. ఇదివరకు ఆంధ్రుల కత్తి పోటును రెండుమూడు పర్యాయములు రుచి చూచినవాడగుటచేత తాను ప్రతాప రుద్రుని అనుచరులతో ముప్పు వచ్చునని భావించి, వెంటనే ప్రతాప రుద్రుని ఢిల్లీకి పంపి వేసెను. ఆకాలమున రాజధానియందుండిన అనేకులు దొరలను, నాయకులను కూడా బందీలుగా తీసుకువెళ్ళారు. ఈ బందీలలో చక్రవర్తితో కడవరకు పోరాడిన నాగయ్య గన్న సేన్నని ఒకడు. ఇతడు చక్రవర్తి అనుసరించియే ఢిల్లీకి పోవుచుండెను. మార్గమధ్యమున ప్రతాపరుద్ర చక్రవర్తి తన పరిస్థితికి మిక్కిరి విచారము చెందుతుండగా, గన్నయ మహమ్మదీయ మతమును పుచ్చుకొని ఢిల్లీ పాదుషాకొలువు చేరెను.ఈలోపల సుల్తాను ఘయాజుద్దీను మృతినొందగా ఉలాఘ్ ఖాన్ ఢ్లీ సింహాసనమునెక్కి సుల్తాన్ మహమ్మదు అను పేరిట రాజ్యము చేయనారంభించెను. ఇతనికి గన్నయసేనాని అన్న ఎక్కువ అభిమానము. మహమ్మదీయ మతము పుచ్చుకొనిన తరువాత అతనికి మల్లిక్ మక్బూల్ అను నామకరణము చేసి సుల్తాను అతని ఆస్థానమున ఉంచుకొనెను. అటుతరువాత జరిగిన కిష్లు ఖానుని పితూరి (రాజ ద్రోహము) ను అణచిచవేసి సుల్తాను మక్బూలును ముల్తానుకు అధిపతిగా నియమించెను. మక్బూలు ముల్తానును పరిపాలించు కాలమున హలూజాన్, గుల్చంద్ అను ఇద్దరు సర్దారులు సుల్తాను ప్రభుత్వముపై తిరగపడగా, వారిన అడ్డుపడి ముక్బూలు సుల్తానుకు ప్రీతిపాత్రుడాయెను.క్రీ.శ.1334 సం. దక్షిణా పధమున ఢిల్లీ సామ్రాజ్యమునకు చెందిన రాష్ట్రము లన్నియు తిరుగుబాటు చేసెను. అందు ముఖ్యముగా మధుర యందు కొత్వాలుగా నున్న సయ్యదు జలాల్ అనువాడు అచ్చట ప్రభుత్వము చేయుచున్న రాష్ట్రపాలుని, అతని అనుచరులను చంపి జలాలుద్దీన్ అహ్సన్ షా అనుబిరుదుతో స్వతంత్రుడాయెను. వానిని తరమగొట్టి మధురయందు మరల స్వాధికారమున మరలప్రతిష్ఠించుటకై సుల్తాను దేవగిరి మార్గమున వచ్చి వరంగల్ పట్టణమున చేరెను. నెలరోజులతరువాత అచ్చట ఆగియున్న సుల్తాను మహమ్మదు యుద్ధమునకు తగు సన్నాహములను చేయుచుండగా ఓరుగంటియందప్పుడు విజృంభించియుండిన ప్లేగు జాడ్యము అతని సైన్యమున కూడా వ్యాపించి దానిలో మూదు వంతులు నాశనము చేసెను. అతడు మృతినొందెన్నన్న వదంతి రాజ్యమునందటను వ్యాపించెను. ఈ వార్త తెలిసి రాజ్యమందున్న పెక్కు సర్కారులు అధికారులకు లొంగక తిరుగుబాటు చేసిరి. ఇట్టి పరిస్థులందు సుల్తాను మధుర దండయాత్రను విరమించి ఢిల్లీకి మరలపోయెను. శాంతిపజేయుటకు తగువాడని తలచికాబోలు సుల్తాను ముక్బూలును తెలంగాణాకు పాలకునిగ నియమించెను. కాని ముక్బూలు జన్మత ఆంధ్రుడాయెను అన్యమతావలంబనము చేసినందున ప్రజలు ఆతనికి లొంగరైరి. అతడు తన అధికారమును నెగ్గించకొనజాలకపోయెను. కావున సుల్తాను ఢిల్లీకి పోయిన కొద్దికాలమునకే ఆంధ్ర నాయకుడగు కాపయ నాయకుని ప్రతాపమున కోర్చుకొనలేక ఓరుగంటిని ఆంధ్ర రాజ్యముతో సహా అతనికి అర్పించి, ముక్బూలు ఢిల్లీకి పారిపోయెను. అప్పటికి ఆతను సుల్తాను అనుగ్రహమును కోల్పోవలేదు. వెంటనే సుల్తాను ఇతనిని గుజరాతునకు పాలకునిగా నియమించెను. సుల్తాను కడపటి రోజులవరకు ఆతను అచ్చటనే యుండెను.

సుల్తాను తఘి అను పితూరీ (రాజ ద్రోహము) దారుని వెంబడించి సింధు దేశానికి పోవునప్పుడు అతడు రాజ్య సంరక్షణకై ఢిల్లీయందు ఏర్పరచిన మంత్రాంగ సభ యందు ముక్బూలు నొకనిగ నియమించెను. సుల్తాను ధధ్ఘ (లాహోరు) పట్టణమందు మరణించినప్పుడు ముక్బూలు ఢిల్లీ పట్టణమందుయుండెను. సుల్తాను మహమ్మదు ముఖ్య మంత్రియగు ఖ్వాజా జహాను సుల్తాను మహమ్మదు కుమారుని సింహాసనము నెక్కించగా సైన్యాధిపతులు తమ సుల్తానుగా అన్నుకొన్న ఫిరోజ్ షా పక్షమును అవలంబించి, ముక్బూలు పట్టణము వదలి సైన్యముతో కూడా వచ్చుచున్న ఫిరోజ్ షాను కలసుకొనెను. అతడు ముక్బూలును మిక్కిలి గౌరవించి తన రాజ్యాభిషేకానంతరము ఆతనికి ఖానిజహా అన్న బిరుదునిచ్చి అతనిని తన ప్రధాన మంత్రిగా ఏర్పరచుకొనెను. అదిమొదలు తన మరణమువరకును ఖానిజహాను ఆపదవియందే యుండి ఢిల్లీ సామ్రాజ్యమునను కడు జాగురూకతతో కాపాడెను. ఇతడు రాజనీతజ్ఞడు. రాజపట్టణమును విడచి దూరాదేశానికి పోవునప్పుడు ఈతనియందు గల నమ్మకముచేత సుల్తాను ఫిరోజ్ షా రాజ్యమునాతనికి అప్పగించి పోవువాడు. ఖానిజహాను అఖండవైభవమును అనుభవించి పుత్ర పౌత్రులను బడసి, వృద్ధుడయిన పితదప తన అధికారమును తనకుమారుని కప్పగించి క్రీ.శ.1372-3 లో మృతినొందెను.