నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గుండా వెళ్ళే నాలుగు వరుసల రహదారి

నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి (నామ్ ఎక్స్‌ప్రెస్‌వే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా వెళ్ళే ఒక ప్రధాన నాలుగు వరుసల రహదారి. ఇది NH 65లో తెలంగాణలోని నార్కెట్‌పల్లి వద్ద ప్రారంభమై NH 16లో ఆంధ్రప్రదేశ్‌లోని మేదరమెట్ల వద్ద ముగుస్తుంది. దీని వలన హైదరాబాద్ నుండి చెన్నైకి దూరం తగ్గుతుంది. దీని మొత్తం పొడవు 212.5 కిలోమీటర్లు.

నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి
పటం
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ క్యూబ్ హైవేస్
పొడవు212.5 కి.మీ. (132.0 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరనార్కెట్‌పల్లి తెలంగాణ
దక్షిణ చివరమేదరమెట్ల, ఆంధ్రప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతెలంగాణ: 87.64 కి.మీ.
ఆంధ్రప్రదేశ్:124.86 కి.మీ.
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 65 ఎన్‌హెచ్ 16

చరిత్ర

మార్చు

నార్కట్ పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి 1998 వరకు ఒకే వరుసగల రహదారిగా వుండగా,[1] 2001-2010 కాలంలో రెండు వరుసల రవాణా సౌకర్యంతో "రాష్ట్ర రహదారి 36" గా మార్చారు.[2] రాష్ట్రం లోని రహదారుల అభివృద్ది కొరకు ఆంధ్రప్రదేశ్, ప్రపంచ బ్యాంకు నుండి US$ 32 కోట్లు అప్పు తీసుకుంది. దీనిని నాలుగు వరుసలకు విస్తరించడానికి 2010 లో ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా అభివృద్ధి సంస్థ, 24 సంవత్సరాలు రహదారి సుంకం వసూలు చేసుకొనే అనుమతితో, నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకొనడం, నిర్మించటం, నిర్వహించటం, చివరిగా బదిలీ చేయడం ప్రాతిపదికపై, పోటీపద్ధతిలో రామ్కీ సంస్థ, ఐఎల్‌ఎఫ్‌ఎస్ ల సంయుక్త సంస్థ అయిన నామ్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ను గుత్తేదారుగా ఎంపిక చేసింది. [3] మొత్తం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 1196.84 కోట్లలో, దాదాపు 40 శాతం ప్రాజెక్టు ఆర్ధిక విజయ సాధ్యత కొరకు ప్రభుత్వమివ్వాలని గుత్తేదారులు కోరారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని 204.02 కోట్లకు తగ్గించి ఖరారు చేసింది. వార్షిక ఆదాయ రేటు (Internal rate of return) 20.61 శాతం సముచితమని తొలిగా భావించిన సలహాదారు అంచనాల తరువాత ఇంకొక సలహాదారు 22-25 శాతం సముచితమని అభిప్రాయపడడంతో దాని ప్రకారం గుత్తేదారు ఎంపిక జరిగింది. గుత్తేదారు ఎంపికకు ప్రాజెక్టు విధానాలలో లోపాలను కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది.[4]

2011 జనవరి 11 ని రహదారి నిర్మాణ ప్రారంభతేదీగా నిర్ణయించారు. అప్పటినుండి 24 సంవత్సరాలు (రహదారి నిర్మాణం సమయంతో కలిపి) గుత్తేదారు రహదారి సుంకం వసూలు చేసుకోవచ్చు. 2014 మార్చి లో రహదారి సుంకాలు వసూలు చేయటం మొదలైంది. వాహనాలను నాలుగు రకాలుగా విభజించి, కి.మీ కు ₹ 0.79, 1.58, 3.16, 7.90 చొప్పున వసూలు చేస్తారు. టోల్ ప్లాజా కేంద్రంగా 20 కిమీ దూరంలో నివసిస్తూ ట్రాక్టర్లు, రెండు చక్రాలు,మూడు చక్రాల వాహనాలు, కారులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించే వారినుండి రహదారి సుంకం వసూలు చెయ్యరు. వాణిజ్యపరమైన వాడుకకు కార్లు వాడుకొనేవారు 20 కి.మీ. దూరంలోపల నివాసమున్నట్లైతే వారికి తక్కువ రుసుముతో నెలవారీ సుంకం వసూలు చేస్తారు.[5]

ఈ రహదారి వలన చెెన్నై, హైద్రాబాదు మధ్య దూరం తగ్గుతుంది. అలాగే హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరి దారిగా వుంటుంది. క్యూబ్ హైవేస్ ₹1669 కోట్లు వెచ్చించి ఈ రహదారి నిర్వహణ సంస్థను కొన్నది.[6] దీనిని 2018 డిసెంబరు నుండి క్యూబ్ హైవేస్ దీన్ని నిర్వహిస్తోంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఈ క్యూబ్ హైవేస్ సంస్థకు పెట్టుబడి పెట్టినవారిలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (International finance corporation) ఒకటి.[7] [8]

2014 లో స్వతంత్ర ఇంజనీరు, 190.38 కి.మీ. పొడవున్న రహదారి నిర్మాణం పూర్తయినట్లుగా తాత్కాలిక ధృవపత్రం ఇచ్చారు. తదనంతరం, 2021 సెప్టెంబరు నాటికి మరో 13.425 కి.మీ.తో మొత్తం 203.8O5 కి.మీ. రహదారికి అనుమతులు ఇచ్చారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర ప్రణాళికలో సూచించిన రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రోడ్డు నాలుగు వరుసల విస్తరణ కోసం 2011 జూలైలో భూసేకరణ ప్రారంభమైంది. రోడ్డులో కొంత భాగానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.[9]

ఈ రహదారి నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13 మండలాల్లో, 37 రెవెన్యూ గ్రామాల్లోని 61 ఆవాసాల గుండా వెళుతుంది. మొత్తం భూమి అవసరం 194.605 ఎకరాలు కాగా, దీనిలో 164.775 ఎకరాల ప్రైవేట్ భూమి, 29.83 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 164.775 ఎకరాల ప్రైవేట్ భూమిలో ప్రభుత్వం 96.01 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి గుత్తేదారుకి అప్పగించింది. అప్పగించిన భూమిలో ఉన్న రహదారి భాగాల నిర్మాణం పూర్తయింది.[10]

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలతో 2016లో గుత్తేదారు సంస్థ ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు పూర్తిచేయటానికి గడువును 2021 మార్చి 31 కి పొడిగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన కుటుంబాలకు, వారి సభ్యుల జీవనోపాధిని మెరుగుచేయటానికీ క్యూబ్ సంస్థ 2021లో ప్రణాళిక తయారు చేసింది.[8]

మార్గం

మార్చు

ఇది నల్గొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, అద్దంకి మీదుగా వెళుతుంది. రహదారి 0.000 నుండి 87.640 కి.మీ వరకు తెలంగాణలో, 87.640 నుండి 212.500 కి.మీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ రహదారి ప్రధానంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా సమతల భూభాగం గుండా వెళుతుంది. కారిడార్‌లో దాదాపు 83% గ్రామీణ ప్రాంతాలున్నాయి. రహదారికి సమీపంలోని ప్రధాన పట్టణ ప్రాంతాలు దామెరచర్ల, నల్గొండ, పిడుగురాళ్ల, అద్దంకి. మాడుగులపల్లి (TP1, చైనేజ్ 41.125 కి.మీ.; నల్గొండ జిల్లా), తుమ్మలచెరువు (TP2, చైనేజ్ 110.200 కి.మీ.; గుంటూరు జిల్లా), ఏల్చూరు (TP3, చైనేజ్ 168.200 కి.మీ.; ప్రకాశం జిల్లా) వద్ద మూడు రహదారి సుంకాల వసూలి నిర్మాణాలు(టోల్ ప్లాజాలు) ఉన్నాయి. [9]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 65 నార్కెట్‌పల్లి వద్ద
  ఎన్‌హెచ్ 16 మేదరేట్ల వద్ద

సమస్యలు

మార్చు

బాపట్ల జిల్లా అద్దంకి, గోపాలపురం, ఏల్చూరు ప్రదేశాలలో భూసేకరణ సమస్యతో కొంత మార్గం పనులు పూర్తికాకపోవటంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి.[11]

మూలాలు

మార్చు
 1. "IFC PROJECT INFORMATION & DATA PORTAL - Cube highways". IFC. Retrieved 2022-03-28.
 2. ERM 2021, p. 9.
 3. "Private Participation in Infrastructure (PPI) - World Bank Group - N.A.M Expressway Limited". World bank. Retrieved 2022-03-28.
 4. Report No. 3 of 2014 - Report of the Comptroller andd Auditor General of India on Economic Sector for the year ended March 2013 Government of Andhra Pradesh Chapter - 3 Compliance Audit (PDF). 2014-09-06. p. 8. Retrieved 2022-03-29. {{cite book}}: |website= ignored (help)
 5. "Toll tax collection on State Highway-2 to begin tomorrow". The Hindu. 2014-01-27. Retrieved 2022-03-28.
 6. "Ramky infra sells NAM Expressway to Cube Highways for Rs 1,669 Crore". 2018-09-01. Retrieved 2022-03-28.
 7. "Narketpally Addanki Medarametala Expressway Ltd". Retrieved 2022-03-28.
 8. 8.0 8.1 ERM 2021.
 9. 9.0 9.1 ERM, p. 1.
 10. ERM, p. 2.
 11. "రెండు రాష్ట్రాలను కలిపే రహదారి..అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం ప్రమాదాలు". etvbharat. 2022-02-14. Retrieved 2022-04-01.

ERM (2021). Social Impact Assessment and Livelihood Enhancement Plan for a 212 km Toll Road in Andhra Pradesh and Telangana, India. Retrieved 2022-03-28.