నార్కే

బాబా భక్తుడైన జి .జి .నార్కే భూగర్భశాస్త్రంలో ఇంగ్లండులో ఉన్నత విద్యనభ్యసించిన గొప్ప విద్యావంతుడు . అతడి మామగారు బాబా సమాధి మందిరం కట్టించిన శ్రీమాన్ బూటీ . అతనికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ . జటిలమైన ఆధ్యాత్మిక గ్రంథాలను గూడా అతడు చదువుతూ ఉండేవాడు . అతనికంటే ముందే అతని కుటుంబ సభ్యులంతా బాబాను తరచూ దర్శిస్తూ ఉండేవారు . కానీ బాబా స్వయంగా తమ దర్శనానికి రమ్మని చెబితేనే ఆయనను దర్శించాలని నార్కే భావించాడు . ఈ విషయం బూటీ బాబాకు చెప్పగానే తమ దర్శనానికి నార్కే రావచ్చన్నారు సాయి . కనుక తన తల్లిని తీసుకుని నార్కే మొదటిసారి 1913 సం ॥లో బాబాను దర్శించాడు . నార్కే తల్లిగారంటే బాబాకు చాలా ఇష్టం . ఆమెను చూడగానే బాబా సంతోషంతో నృత్యం చేసేవారు .

నార్కే మొదటిసారి బాబాను దర్శించినపుడు శ్యామా అతనిని బాబాకు పరిచయం చేయబోయాడు . వెంటనే బాబా, "ఇతడు నాకు కొత్తకాదు, 30 తరాలనుండీ నాకితడు పరిచయమే !" అన్నారు . నార్కే ఆశ్చర్యపోయాడు . బాబా కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉండి నార్కే మనస్సులో ముద్రించుకు పోయాయి . ఆయన సన్నిధి యొక్క మహాత్మ్యం అతని మనస్సును ఆకట్టుకోసాగింది . బాబాసేవ లోనూ, హారతుల లోనూ అతడు తరచుగా పాల్గొనడం ప్రారంభించాడు.

నార్కే ఉద్యోగ నిమిత్తం దూరదూరప్రాంతాలైన కలకత్తా, బొంబాయి వంటి ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చేది . కనుక అతనికి దగ్గరలో ఉద్యోగం దొరకేలా అనుగ్రహించమని నార్కే తల్లి బాబాను ప్రార్థించింది . బాబా ఆమెతో, "నార్కే పూణేలో స్ధిరమైన ఉద్యోగం దొరికేలా చేస్తాను "అనేవారు . కానీ పూణేలో అతనికి తగిన ఉద్యోగం దొరికే అవకాశాలే లేనందువల్ల నార్కే ఆయన మాటలు నమ్మలేదు . కానీ చిత్రంగా 1918 లో నార్కేకు పూణేలోనే స్ధిరమైన ఉద్యోగం లభించింది . బాబా అలా తమ మాట నిలుపుకున్నారు .

ఒకసారి 1916 లో నార్కే శిరిడీ వెళ్ళాడు . అక్కడ ఆ రోజుల్లో వామన్ రావ్ పటేల్ అను భక్తుడు భిక్షపాత్ర పట్టుకుని బాబా తరఫున భిక్షకు వెళ్తూ ఉండేవాడు . అది తెలుసుకుని నార్కే తనకూ అంతటి సేవ లభిస్తే బాగుండునని తలచాడు . ఇంతలో బాబా దర్శనానికి సమయమైంది . అతడు వస్త్రాలు కూడా మార్చుకోకుండానే తానూ ధరించి ఉన్న సూటు ,బూటు ,టోపీలతోనే బాబా దర్శనానికి వెళ్ళాడు . బాబా వెంటనే నార్కేను చూపిస్తూ " ఈ రోజు భిక్షా పాత్ర ఇతనికిచ్చి భిక్షకు వెళ్ళమనండి "అన్నారు . నార్కే మనస్సు ఆనందాశ్చర్యాలతోను ,కృతజ్ఞతతోనూ నిండిపోయింది . అతడు ఆ రోజు సంతోషంగా సూటు ,బూటు వేసుకునే భిక్షకు వెళ్ళాడు . అప్పటి నుంచి నాలుగు నెలలపాటు మధ్యాహ్నం నియమంగా భిక్ష చేశాడు నార్కే .

నార్కేకు మరొక సమస్య ఉండేది . అతడికి ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉండేవారు . ఒకసారి నార్కే కుటుంబ సభ్యులు బాబాను దర్శిస్తే ఆయన ,"నార్కేకు ఎంతమంది పిల్లలు !" అని అడిగారు . వారతని సమస్య వివరించారు . వెంటనే బాబా, "భగవంతుడు మేలు చేస్తాడు "అన్నారు . ఆ తర్వాత బాబా ఆశీస్సులు ఫలించి నార్కేకు నలుగురు బిడ్డలు కలిగారు . ఇలా నార్కేకు ఉద్యోగము, సంతానము, తమ సేవ ప్రసాదించి ఉద్దరించారు సాయి .

"https://te.wikipedia.org/w/index.php?title=నార్కే&oldid=1994200" నుండి వెలికితీశారు