పగటి వేషాలు ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శంచే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది. పగటి వేషాలలో ఉండే గొప్పతనం ఇతరుల్ని నమ్మించడం. ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకు రావడం, వర్గమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి.

వీదులలో రోజూ వచ్చే పగటి వేషగాళ్ళు
వీదులలో రోజూ వచ్చే పగటి వేషగాళ్ళు

లక్షణాలుసవరించు

చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాలపేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనాసమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే "పైటేషాలు" అని కూడా అంటారు.

పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధి నాటకాలనుండి "బ్రోకెన్ డౌన్ మిత్" అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారి పగటి వేషాలని, స్థానిక పగటివేషాలని విభజించవచ్చు.

కృష్ణా జిల్లాలోని కూచిపూడి - భాగవత కథా ప్రదర్శనలకు ప్రత్యేకత అయితే, గడ్డిపాడు - పగటి వేషాలకు ప్రసిద్ధిపొందింది. గడ్డిపాడువారు సుమారు 60 రకాల వేషాలను ప్రదర్శించేవారు. ఈ వేషాలలో నిత్యజీవితంలో ఉండేవి కొన్ని, పౌరాణికంగా కొన్ని, కల్పిత వేషాలు కొన్ని, పూర్తిగా హాస్య ప్రధానమైనవి కొన్ని.[1]

పగటి వేషాలు చారిత్రకతసవరించు

జనవ్యవహారంలో ఉన్నకథలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకథ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కథలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషల గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రొ. ఎస్. గంగప్ప పరిశోధించి పగటి వేషాలు వాయసంలోను, కూచిపూడి భాగవథులు ప్రదర్శించే వేషాలను పగటి వేషాలుగా వివరించారు. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన ఈ కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ఠ రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమ్నుండే ఈ కలారూపం ఉందని, హాలుని గాథాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు.

  • భరత కోశంలో, సర్వేశ్వర శతకంలో, పండితారాధ్య చరిత్రలో పగటివేషాల వివరణ కనిపిస్తుంది.
  • భారతదేశంలో స్వతంత్ర, సామంతరాజుల పాలనలో ఈ పగటివేషాలు చాలా ప్రచారంలోకి వచ్చాయని అంటారు. రకరకాల మారువేషాలు ధరించి గూఢచారులుగా వీరు సమాచారాన్ని అందించేవారని చరిత్ర చెబుతుంది.
  • పగటి వేషాలద్వారా కాకతీయుల యుగంలో యుగంధరుడు పిచ్చి యుగందరుడుగా నటించి ఢిల్లీ సుల్తానులను జయించడం పేర్కొనబడింది.

పరిణామాలుసవరించు

జానపద కళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుకవృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది. అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి.

సంచారి పగటి వేషాలుసవరించు

సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే "బహు రూపులు" అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు, మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు.

పగటివేషాలు - వర్గీకరణసవరించు

పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు. ఇతివృత్తం ఆధారంగా పగటివేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు.

  1. మత పరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం.
  2. కుల పరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి.
  3. పురాణ పరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి.
  4. జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పాములోల్ల వేషం,
  5. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాశికావిళ్ళ వేషం వంటివి.

పగటివేషాలు- ప్రదర్శన రీతులుసవరించు

పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి.

పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు.

పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటున్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది.

రాయలసీమ ప్రాంతంలో పగటి వేష గాళ్ళను పగలేసి గాళ్ళని పిలుస్తారని తమ జానపద కళా సంపదలో దోణప్ప గారు ఉదహరించారు. వీరు కూడా విప్ర వినోదులు లాంటి వారు. దొర వేషం దొరసాని వేషం, వడ్డెర వాడు బ్రాహ్మణ వితంతువు మొదలైన వేషాలను ధరించి చమత్కారమైన మాటల తీరుతో ప్రజలను ఆనందింప చేస్తారు. వీరికి ఒక ఊరూ వాడా అని వుండదు. దేశ సంచారం చేస్తూ సంవత్సరానికి కొక సారి వార్షికంగా వచ్చి ప్రదర్శనలిచ్చి పారి తోషికాలు పొంది వెళతారు. ధరించే ఆ యా పాత్రల నడక, మాట యాస, భాషా ఉచ్ఛారణ వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి వేషాన్నీ తీర్చి దిద్దుకుని సహజత్వం వుట్టి పడేలా వుండే అలంకరణ వస్తు సామాగ్రిని వారే సమకూర్చు కుంటారు. ఎవరు ఏ మాట మాటాడినా పరిహాస దరహాసంతో సమాధానాలిస్తారు.

సూచికలుసవరించు

మూలాలజాబితాసవరించు