పరిటాల శ్రీరాములు

పరిటాల శ్రీరాములు అనంతపురం జిల్లాకు చెందిన ప్రజానాయకుడు, రచయిత.[1] జిల్లాల్లో భూపోరాటాల్లో పాల్గొని భూస్వాముల ఆధీనంలో ఉన్న అధిక భూముల్ని సాధారణ రైతులకు అందేలా చేశాడు.[2] ఈయన జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా రూపొందించాడు.

పరిటాల శ్రీరాములు
జననం(1935-04-02)1935 ఏప్రిల్ 2
వెంకటాపురం
వృత్తినాయకుడు, రచయిత
పిల్లలుపరిటాల రవి, పరిటాల హరి
తల్లిదండ్రులు
  • పరిటాల ముత్యాలప్ప (తండ్రి)
  • చిన వెంకటమ్మ (తల్లి)

బాల్యంసవరించు

పరిటాల శ్రీరాములు 1935, ఏప్రిల్ 2 న అనంతపురం జిల్లా, వెంకటాపురం గ్రామంలో జన్మించాడు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామమిది. తండ్రి పరిటాల ముత్యాలప్ప ఆ గ్రామంలోకెల్లా పెద్ద భూస్వామి. స్వగ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి ఆయనకు 150 ఎకరాలకిపైగా భూమి ఉండేది. ఈయన భూస్వామి అయినా పెద్ద దర్పాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేవాడు. రామాయణ, మహాభారతాలను నిత్యం పారాయణం చేసేవాడు. ముత్యాలప్ప మొదటి భార్యకు సంతానం లేదు. రెండవ భార్య ఒక కుమార్తెను కని చనిపోయింది. ఈమె పేరు అశ్వత్థమ్మ. మూడవ భార్య చినవెంకటమ్మ. ఈమెకు ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు శ్రీరాములు, రెండో కొడుకు పి. ఎం. నారాయణ, మూడోది గజ్జెలప్ప, నాలుగో వాడు సుబ్బయ్య, అయిదోవాడు చిననారాయణ, ఆఖరున కుమార్తె నారాయణమ్మ. శ్రీరామ నవమి రోజు పుట్టిన తమ పెద్దకొడుకుకి శ్రీరాములు అని పేరు పెట్టుకున్నారా దంపతులు.

శ్రీరాములు చదువుకుంటూనే వ్యవసాయం చేసేవాడు. విద్యార్థి దశ నుంచీ సాహిత్యం మీద, రాజకీయాల ముఖ్యంగా వాటిలోని ప్రగతిశీల భావజాలం మీద ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాచీన సాహిత్యంలోనూ ఆసక్తి ఉండేది. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శ్రీరాములు ఎస్. ఎస్. ఎల్. సి తో స్వీయ నిర్ణయంతో చదువు ముగించాడు. తమ్ముడు పి. ఎం. నారాయణ బి. ఎ. ఆనర్స్ దాకా చదివాడు. మిగతావారంతా చిన్న చిన్న చదువులతో సరిపెట్టుకున్నారు. చదువు ముగియడంతోనే ఆయనకు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1952లో పదిహేడేళ్ళ వయసులో శీరిపి కొట్టాల గ్రామానికి చెందిన నారాయణమ్మ తో ఆయనకు వివాహం అయింది.

కమ్యూనిజంపై ఆసక్తిసవరించు

రైతులు స్వేచ్ఛగా తమ వ్యవసాయం తాము చేసుకోవాలంటే కమ్యూనిస్టు పార్టీ నిర్మిస్తున్న ప్రజా పోరాటాల్లో పాల్గొనాలని భావించిన శ్రీరాములు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు శ్రీరాములు. 1948-51 మధ్య కాలంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ప్రతిష్టాత్మక భూపోరాటం ఆయన్ను కమ్యూనిస్టు యోధుడిగా తీర్చిదిద్దింది. అయితే భూములు కోల్పోయిన ఇతర భూస్వాములు ఆయనపై కక్ష పెంచుకున్నారు. ఇందులో మొదటివాడు ముత్తవకుంట్ల భూస్వామి చిన్నపరెడ్డి కొడుకు రామసుబ్బారెడ్డి. రామసుబ్బారెడ్డి, అతని సోదరులు పేద రైతులమీద సాగిస్తున్న జులుం అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. అందరూ కలిసి రామసుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి అతనికి దేహశుద్ధి చేశారు. అడ్డువచ్చిన తలారి నరసింహులు మీద కూడా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. రామసుబ్బారెడ్డి తమ్ముడు బాలసుబ్బారెడ్డి కేసు బలంగా ఉండటం కోసం చనిపోయిన తలారి నరసింహులు తలను వేటకత్తితో నరికించాడు. ఈ కేసులో శ్రీరాములు, అతని సోదరుడు గజ్జెలప్పతో బాటు నలభై ఆరు మంది మీద హత్య కేసు నమోదయింది. పదమూడు మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1962 లో వీరందరూ బయటకు వచ్చారు.

దాదాపు రెండేళ్ళ పాటు శ్రీరాములు, అతని తమ్ముడు గజ్జెలప్ప జైలుపాలవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. కుటుంబంలో పెద్దవాడిగా పరిస్థితులు చక్కదిద్దడం కోసం ఆయన అబ్కారీ (మద్యం తయారీ) వేలంపాటల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆయనకు స్వతహాగా మంచి వేటగాడు అయిన సిద్ధప్పతో పరిచయం ఏర్పడింది.

మూలాలుసవరించు

  1. ఖాదర్, మొహియుద్దీన్ (2007). అస్తమించని రవి. అనంతపురం: నారాయణమ్మ ప్రచురణలు. p. 14. Archived from the original on 2019-01-10. Retrieved 2018-12-08.
  2. "A saga of chilling feud between two families of Anantapur". 4 January 2011.