పశ్చిమోత్తానాసనము

(పశ్చిమోత్తానాసనం నుండి దారిమార్పు చెందింది)

పశ్చిమోత్తానాసనము (సంస్కృతం: पश्चिमोतनसन) యోగాలో ఒక ఆసనం. వెన్నెముకను పైకి వంచి చేసే ఆసనం కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసనం లేదా పశ్చిమతానాసనం అని పేరు వచ్చింది. అతి ముఖ్యమైన యోగాసనాలలో ఇది ఒకటి.

Pashchimottanasana

పశ్చిమం అంటే వీపు, శరీరం వెనుకభాగం అని అర్థం. వీపు భాగాన్ని లేపి ముందుకు వంచుతాం కాబట్టి పశ్చిమోత్తానాసనమని పేరు వచ్చింది. అలాగే ప్రాణశక్తిని పశ్చిమ అనెడి సుషుమ్న మార్గము ద్వారా పోవునట్లు చేయు ఆసనము కనుక దీనికి పశ్చిమతానాసనము అని మరొకపేరు.[1]

పద్ధతిసవరించు

  • నేలపై కూర్చొని రెండు కాళ్ళు చాపి దగ్గరగా ఉంచాలి.
  • రెండు చేతులతో రెండు బొటనవేళ్ళను పట్టుకోవాలి.
  • తలను మెల్లమెల్లగా ముందుకు వంచుతూ మోకాళ్ళపై ఆనించడానికి ప్రయత్నించాలి. మోచేతులు నేలమీద ఉంచాలి. మోకాళ్ళు పైకి లేవకుండా జాగ్రత్తపడాలి.
  • తల వంచినంత సేపు శ్వాస వదలి బయటనే ఆపాలి. తల పైకి లేపిన తర్వాతనే శ్వాస పీల్చాలి.

ఆసనస్థితిసవరించు

కాళ్ళు పైకి లేవకుండా తలను మోకాళ్ళకు ఆనించి అలా ఉంటూ మనస్సును మోకాళ్ళ క్రింద భాగం, తొడల భాగంపై లగ్నంచేసి ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండగలిగినంతసేపు కాళ్ళను కదపకుండా ఉంటేనే లాభం ఉంటుంది. ఈ ఆసనస్థితిలో ఉన్నప్పుడు పొట్టభాగములో, డొక్కభాగములో కండలు పడుతూ ఉంటాయి. అలా పడితే వెంటనే ఆసనాన్ని తీసి విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనస్థితిలో ఉన్నంతసేపూ డయాఫ్రమ్ సంకోచించుకుని మాత్రమే ఉంటుంది. దానితో గాలి చాలా కొద్దిగా వెళుతూ ఉంటుంది. దాని వలన ఎక్కువ ఆయాసంగా, గాలి చాలనట్లుగా ఉంటుంది. ఉండగలిగినంత వరకు ఆ స్థితిలో ఉండి ఇక ఆ నొప్పి ఓర్చుకోలేము, గాలి అవసరము అనుకున్నప్పుడు మెల్లగా పైకి లేస్తారు. లేస్తూనే మీకు తెలియకుండానే దీర్ఘశ్వాసలో ఎక్కువ గాలిని పీల్చుకోగలుగుతారు.

ప్రయోజనంసవరించు

  • ఈ ఆసనం పొట్ట కండరాలకు, లోపలి అవయవాలకు, వెన్నెముకకు చాలా ఉపయోగపడుతుంది.
  • ప్రాణశక్తి శుషుమ్నా నాడియందు సంచరించడం వల్ల దీనిని అభ్యాసం చేసేవారు దీర్ఘాయుష్మంతులవుతారు.

మూలాలుసవరించు

  1. "ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు (సుఖ జీవన సోపానాలు - 6)". www.manthena.org. Retrieved 2020-08-26.