పాకుడురాళ్ళు
పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి.[1] ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.
నేపథ్యం
మార్చుసినిమా ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి. ఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. అనాటి కాలంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశాడు రచయిత రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు నవల, కేవలం మంజరిగా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బెదిరించి పబ్బం గడుపుకునే సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.
నవలా స్వరూపం
మార్చుకథా స్థలం గుంటూరు సమీపంలో ఓ పల్లెటూరు. కథా కాలం పద్య నాటకాలు అంతరించి, సాంఘిక నాటకాలు అంతగా ఊపందుకోని రోజులు. నాటకాలంటే ఆసక్తి ఉన్న మాధవరావు, రామచంద్రం కలిసి 'నవ్యాంధ్ర కళామండలి' ప్రారంభించి, సాంఘిక నాటకాలు ప్రదర్శించాలి అనుకుంటారు. వాళ్ళ నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడం కోసం వస్తుంది పదిహేనేళ్ళ మంగమ్మ. బళ్ళారి రాఘవ ట్రూపులో పనిచేశానని చెప్పుకునే నాగమణి పోషణలో ఉంటుంది మంగమ్మ. అప్పటికే మంగమ్మ మీద సంపాదన ప్రారంభించిన నాగమణి, నాటకాల్లో అయితే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చునని ఈ మార్గం ఎంచుకుంటుంది. మాధవరావు-రామచంద్రం తర్ఫీదులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది మంగమ్మ. కళామండలి కి మంచి పేరు రావడంతో, నాగమణి కి కొంత మొత్తం చెల్లించి మంగమ్మని చెర విడిపిస్తారు మిత్రులిద్దరూ.
కొంతకాలానికి కళామండలి మూతపడే పరిస్థితి వస్తుంది. మంగమ్మ, నాగమణి 'కంపెనీ' కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పాత మిత్రుడు చలపతి తనో సినిమా తీస్తున్నాననీ, మంగమ్మ అందులో నాయిక అనీ చెప్పి ఆమెని మద్రాసు తీసుకెడతాడు. చలపతి సినిమా తీయకపోయినా, మంగమ్మకి వేషాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. స్వతహాగా తెలివైనదీ, మగవాళ్ళని కాచి వడపోసినదీ అయిన మంగమ్మ సైతం -మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సినిమా హీరోయిన్ల వైభవం, ఐశ్వర్యం చూశాక తనుకూడా హీరోయిన్ కావాల్సిందే అని నిర్ణయించుకుని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో, ఓ సిద్ధాంతి సూచన మేరకు తన పేరు మంజరి గా మార్చుకుంటుంది. వేషాలు రానప్పుడూ, చివరివరకూ వచ్చి జారిపోయినప్పుడూ మంజరి నిర్ణయం మరింత పదునెక్కుతూ ఉంటుంది.
మెల్లగా అవకాశాలు సంపాదించుకుని, నాయికగా పేరు తెచ్చుకుని తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి నాయిక అవుతుంది మంజరి. అనుకున్నది సాధించాక ప్రపంచాన్ని లెక్కచెయ్యదు మంజరి. చలపతిని కేవలం ఓ సెక్రటరీగా మాత్రమే చూస్తుంది. నిర్మాతలని అక్షరాలా ఆడిస్తుంది. అయితే, తనని తీర్చిదిద్దిన మాధవరావు-రామచంద్రం మీద, కష్టకాలంలో తనని ఆదుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. అగ్రహీరోలతో కయ్యం పెట్టుకుని, దానివల్ల తనకి పోటీగా మరో నాయిక తయారవుతున్నప్పుడు కయ్యాన్ని నెయ్యంగా మార్చుకున్నా, తనని సినిమా నుంచి తీసేయాలని ప్రయత్నించిన నిర్మాతకి ఊహించని విధంగా షాక్ ఇచ్చినా మంజరికి మంజరే సాటి అనిపిస్తుంది. గుర్రాప్పందాల మీద లక్షలు నష్టపోయినా కొంచం కూడా బాధ పడదు కానీ, ఎవరన్నా డొనేషన్ అంటూ వస్తే రెండో ఆలోచన లేకుండా తిప్పి పంపేసి మళ్ళీ రావొద్దని కచ్చితంగా చెప్పేస్తుంది. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే, హిందీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది మంజరి. ఇందుకోసం తన కాంటాక్ట్స్ ని తెలివిగా వాడుకుంటుంది. భారదేశం తరపున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళిన తొలి తెలుగు నటి మంజరి. అక్కడ మార్లిన్ మన్రో ని కలుసుకున్న మంజరి, సిని నాయికలందరి జీవితాలూ ఒకేలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటుంది.
పాత్రలు
మార్చు- మంగమ్మ అలియాస్ మంజరి - కథానాయిక
- మాధవరావు
- చలపతి
- రామచంద్రం
- నాగమణి
- రాజమణి
- వసంత
- కల్యాణి
మూలాలు
మార్చు- ↑ "ఈనాడు సాహిత్యంలో చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2011-08-30. Retrieved 2013-07-22.